Monday, May 20, 2024
Monday, May 20, 2024

కేజ్రీవాల్‌ బెయిల్‌పైఉత్కంఠ

. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదన్న ఈడీ
. నేడు సుప్రీంకోర్టు తీర్పు

న్యూదిల్లీ:
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ జారీపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనుంది. అయితే, కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వాలనడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ గురువారం కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది… ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా…ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్‌ ఇలాంటి కారణాలే చూపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. గత మూడేళ్లలో 123 ఎన్నికలు జరిగాయి. సంవత్సరమంతా ఏదో ఒకచోట… ఏవో ఒక ఎన్నికలు ఉంటూనే ఉన్నాయి. ఇలా ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం.
జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేం’ అని ఈడీ తమ అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుచేయడం అనేది చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని ఈడీ అభిప్రాయపడిరది. నేరాలకు పాల్పడే నేతలు ఎన్నికల ముసుగులో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశంగా మారుతుందని పేర్కొంది. అంతేగాక… ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందని తెలిపింది. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని అఫిడవిట్‌లో పేర్కొంది. మద్యం కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున… ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీంతో బెయిల్‌పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువడనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img