Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

దేశ సంపదను అమ్మే హక్కు ఎవరిచ్చారు

ఐక్య పోరాటాలతోనే విశాఖ ఉక్కును రక్షించుకుందాం
మోసకారి మాటలు నమ్మొద్దు
ఉక్కు ప్రజాగర్జన బహిరంగ సభలో వక్తలు

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం/గాజువాక/కూర్మన్నపాలెం:
దేశ సంపదను అమ్మే హక్కు కేంద్రంలో పాలకులకు ఎవరిచ్చారని వక్తలు ప్రశ్నించారు. సోమవారం విశాఖ ఉక్కు… తెలుగోడి హక్కు నినాదంతో ఉక్కు ప్రజా గర్జన మహాసభను ఉక్కు నగరం త్రిష్ణ క్రీడా మైదానంలో నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌ అధ్యక్షతన ఈ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ 700 రోజులుగా కార్మికులు పోరుబాట పడితే పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ తప్ప మిగతా అన్ని పక్షాలు ముక్త కంఠంతో ఏకమై నినదిస్తున్నా పట్టించుకోకపోవడం మోదీ మూర్ఖత్వా నికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నా యని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాన మంత్రి ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గకపోవడం శోచనీయమన్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించారు. ప్రజల సంపద షేర్లలో ఆవిరి చేస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న ఉక్కును మాత్రం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని ప్రయత్నం చేయడం దౌర్భాగ్యమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు ఏమి చేసినా ప్రధాన మంత్రికి చలనం లేదన్నారు. 52 మంది ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో నరేంద్ర మోదీ కార్యాలయం ముందు నిలబడితే దిగిరాక ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వేదిక మీద ఒక్క ఎంపీ అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. విశాఖపట్నం నుంచి జేడీ లక్ష్మీనారాయణను గెలిపించకపోయినా వచ్చి అండగా నిల్చున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం ఎన్ని పన్నాగాలు పన్నినా అది సాధ్యం కాదని ఈ వేదిక నుంచి హెచ్చరించారు. ప్రజలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నారని, మళ్లీ గెలిపిస్తారో లేదో తెలియదని, ఈ సంస్థ ప్రైవేటుపరం అయితే మీరంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. పార్లమెంటులో ఎంపీలు నోరు విప్పాలని అభ్యర్ధించారు. మా ఎంపీలను తీసుకువస్తాం అందరం కలసి పోరాడుదామని భరోసా ఇచ్చారు.
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాలను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని, ఇది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాటగా చెబుతున్నానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద లక్షలాదిమంది ఆధారపడి పని చేస్తున్నారని, లాభాలలో కొనసాగుతున్న స్టీల్‌ ప్లాంట్‌ను దొంగ చాటుగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు 700 రోజులకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అమర్నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 60వ దశకంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి, అప్పటి ప్రధానుల మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌ పరం చేయటానికి గత రెండు సంవత్స రాలుగా కేంద్రం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవడానికి కార్మిక, ప్రజా సంఘాలు పోరాడుతున్న సమయంలో, ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కార్మిక సంఘాల నాయకులు కలిసి సుదీర్ఘంగా చర్చించారని అమర్నాథ్‌ చెప్పారు. అప్పట్లోనే సీఎం జగన్‌ కార్మికులకు మద్దతు తెలియజేశారని, ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో తమకు ప్రజాప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనాలు లేవని స్పష్టం చేయడంతో పాటు ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రధానికి అనేక సందర్భాల్లో జగన్‌మోహన్‌ రెడ్డి లేఖలు కూడా రాశారని అమర్నాథ్‌ వివరించారు.
సీపీపం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభను అపూర్వ సంగ్రామంగా పేర్కొన్నారు. ఈ ఘనత కార్మిక వర్గానిదేనన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో సాధ్యం కాదని, ఇది ప్రజలతోనే సాధ్యమని, విశాఖ గర్జన దిల్లీ పార్లమెంటును షేక్‌ చేస్తోందని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
టీటీడీ చైర్మన్‌, వైసీపీ విశాఖ రీజనల్‌ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఇకపై పార్టీగా బాధ్యత తీసుకుంటామని, భవిష్యత్తులో జరిగే పోరాటాలకు ప్రభుత్వంగా, పార్టీగా ముందుకు నడిపిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రానికి ఎప్పుడూ భయపడేది లేదని చెప్పారు. పదవులు తమకు ముఖ్యం కాదని, తెలుగు ప్రజల త్యాగాలు ముఖ్యమన్నారు.
సీబీఐ విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌ వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండెచప్పుడు కాదని, భారత దేశ ప్రజల గుండె చప్పుడు అన్నారు. దేశంలో అనేక నిర్మాణాలకు విశాఖ ఉక్కును ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థపై కేంద్రం అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. పోరాట కమిటీ చైర్మన్‌లు జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ కోట్ల ఆస్తిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఏపీకి ఇది జీవనాడని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. సీపీఎం నేత సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చే దాకా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆటంకాలు అధిగమించైనా పోరాటాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విదేశాల్లో విలాసాలు చేస్తున్న వారికి కోట్ల రూపాయలు మాఫీ చేసే కేంద్రంలోని పాలకులు ఉక్కును అమ్మేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ నాయకులు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఇది ప్రజల ఉద్యమంగా మారాలన్నారు. అంతవరకు నిర్లిప్తతే కొనసాగుతుందని, మొన్న రైతుల జీవోలాగా ఈ ప్రైవేటీకరణను కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సీపీఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, సీపీఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, కె.సత్యాంజనేయ, సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్‌, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, వైసీపీ నేతలు కొండా రాజీవ్‌గాంధీ, సీతంరాజు సుధాకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, పోరాట కమిటీ కన్వీనర్‌ కె.ఎస్‌.ఎన్‌.రావు, జనసేన పార్టీ నేతలు శివశంకర్‌, కోన తాతారావు, ఏపీ రైటర్స్‌ అకాడమీ అధ్యక్షులు వి.వి.రమణమూర్తి, నాయకులు నాగభూషణం, గణపతిరెడ్డి, వై.మస్తానప్ప, బొడ్డు పైడిరాజు, బలిరెడ్డి సత్యనారాయణ, జీవీఎంసీ గాజువాక జోన్‌ కార్పొరేటర్‌లు, అనేక రాజకీయ పార్టీల నుంచి, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img