. ‘జేజీఎల్ 384’ రకానికి డిమాండ్
. బ్లాక్‌లో అధిక ధరకు విక్రయాలు
. దిక్కుతోచని స్థితిలో సాగర్ ఆయకట్టు రైతులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పుష్కలంగా నీరున్నప్పటికీ విత్తనాలు లభించకపోవడంతో సాగర్ కుడికాల్వ ఆయకట్టు ప్రాంత రైతులు వరి సాగుకు ఇబ్బందులెదుర్కొం టున్నారు. రైతులు అత్యధికంగా వినియోగిస్తున్న జేజీఎల్ 384రకం విత్తనాలు మార్కెట్లో అందుబాటు లేవు. ఇప్పటికే అక్కడక్కడా రైతుల ఆందోళనలతో ప్రభుత్వం మేల్కొని, కాస్త దిద్దుబాటు చర్యలకు దిగినా…సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన వరదలకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండల్లా మారాయి. అవసరానికి నీటిని ఉంచి, మిగులు జలాలను దిగువకు, కాల్వలకు వదిలేస్తున్నారు. సాగర్ ఆయకట్టు కుడికాల్వ పరిధిలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొంత భాగం ఉంటుంది. ఈ ప్రాం తంలో మొత్తంగా 4.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తారు. రెండేళ్ల నుంచి సాగునీటి ఇబ్బందితో చాలా మంది సాగుకు ఆసక్తి చూపలేదు. ఈ ఖరీఫ్ నాటికి భారీ వర్షాలతో సాగర్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విత్తనాలు సరఫరాకు సిద్ధం కాలేకపోయింది. పాత విధానంలోనే విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచినప్పటికీ, పెరిగిన డిమాండ్‌తో విత్తనాలకు కొరత ఏర్పడిరది. రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయకుండా, అవసరం లేని విత్తనాలను అందుబాటులో ఉంచడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైంది.
జేజీఎల్ 384 విత్తనంపైనే రైతుల ఆసక్తి
రైతులు జేజీఎల్ 384 రకం విత్తనాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత మిగిలిన రకం విత్తనాలపై దృష్టి పెడుతున్నారు. వరి పంట సాగు చేసే బీపీటీ 5204తోపాటు చిన్నపాటి రకం విత్తనాలకే ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఈ బీపీటీ వరిపంట కాల వ్యవధి 150రోజులు ఉంది. జేజీఎల్ 384 రకం వరి పంట కాల్వ వ్యవధి 135 రోజులే. జేజీఎల్ 384 రకం ద్వారా తక్కువ సమయంలో పంట చేతికి రావడంతోపాటు, తెగుళ్లు ఎదుర్కొనే గుణం ఉంది. ప్రస్తుతం పంట సాగు ఆలస్యం కావడం…దీనికితోడు నవంబరు, డిసెంబరులో తుపాన్ల వల్ల పంటలకు నష్టం వస్తుందన్న ఆందోళనతో ఎక్కువ మంది రైతులు జేజీఎల్ 384 రకం విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రకం పంటను రెండేళ్ల నుంచి మన ప్రాంతంలో రైతులు పండిరచడం లేదు. తెలంగాణ నుంచి విత్తనాలను తెచ్చుకోవడం అనివార్యమైంది. కరీంనగర్, పెద్దపల్లి, మిర్యాలగూడలో అత్యధి కంగా రైతులు ఈ రకం వరిని పండిస్తారు. అక్కడి నుంచి జేజీఎల్ 384 రకం విత్తనాలను వ్యాపారస్తులు తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం గతేడాది కంటే సాగుకు విత్తనాల డిమాండ్ పెరగడంతో..దానికి అనుగుణంగా ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. ఈ పరిణామాలతో మార్కెట్లో విత్తనాల కొరత ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు. సీఆర్ 1009 రకం విత్తనాలను బాపట్ల జిల్లాలో పండిస్తారు. ఇది కూడా అతి తక్కువ సమయంలో అధిక పంట దిగుబడినిస్తుంది. ఈ రకం విత్తనాలు రూడా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
30 కిలోల సంచికి రూ.600 దోపిడీ
తెలంగాణ నుంచి ఏపీకీ జేజీఎల్ 384 రకం విత్తనాలను ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి మార్కెట్లో 30కిలోల సంచి రూ.1800కు విక్రయిస్తున్నారని పల్నాడు, నరసారావుపేట ప్రాంత రైతులు చెబుతున్నారు. వాస్తవంగా 30 కిలోల సంచి ధర రూ.1000 నుంచి రూ.1200 వరకే ఉంటుంది. ఈ రకం విత్తనాలు అందుబాటులో లేనందున అధిక ధరకు రైతులు కొనుగోలు చేసి, ప్రతి సంచికీ రూ.500 నుంచి రూ.600 చొప్పున నష్టపోతున్నారు. పంటలకు సబ్సిడీ కూడా అరకొరగానే మార్కెఫెడ్ శాఖ ఇస్తోంది. వాస్తవంగా రైతులు కొనుగోలు చేసే విత్తనాలపై 40శాతం నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా దానిని ఎక్కడా ప్రభుత్వం అమలుచేయడం లేదు. బీపీటీ 5204 రకంతోపాటు చిన్నపాటి రకం విత్తనాలకు కిలోకు ఐదు రూపాయల చొప్పునే రాయితీ కల్పించింది. ఇక రైతులు కావాలంటున్న జేజీఎల్ 384 రకం వరి విత్తనాలను సబ్సిడీ జాబితా నుంచి తొలగించడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల నరసరావుపేట తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. అన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులోలేవని, తమకు అవసరమైన జేజీఎల్ 384రకం విత్తనాలను సరఫరా చేయాలని నిరసించారు. ఇదే పరిస్థితి సాగర్ ఆయకట్టు పరిధిలోని జిల్లాల్లో నెలకొంది. రైతులు ఆసక్తి చూపని బీపీటీతోపాటు వివిధ రకాల విత్తనాలనే సరఫరా చేస్తున్నారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణపైనా రైతులు సంతృప్తి చెందడం లేదు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి, జేజీఎల్ 384 విత్తనం అందుబాటులో ఉంచేలా చూడాల్సిన అవసరముంది. లేకుంటే సాగర్ ప్రాంతం రైతులు ఈ ఖరీఫ్ సాగుకు తీవ్ర అసౌకర్యానికి గురై..సకాలంలో పంట సాగు చేసే పరిస్థితిని కోల్పోతారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతుల కోసం వివిధ రకాల విత్తనాలను 13వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. అందులో జేజీఎల్ రకం విత్తనాలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.