Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పోలవరం టు అమరావతి పాదయాత్ర

సీపీఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం: రామకృష్ణ వెల్లడి

విశాలాంధ్ర – విజయవాడ : పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోలవరం టూ అమరావతి పాదయాత్ర చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. ఈ మేరకు రామకృష్ణ బుధవారం ప్రకటన విడుదల చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం విజయవాడ దాసరి భవన్‌లో కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు. రామకృష్ణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, భవిష్యత్‌ కర్తవ్యాలను వెల్లడిరచారు. సభ్యుల చర్చల అనంతరం సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా, నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపకుండా కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ద్రోహం చేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ప్రయోజనకరమైన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం అటకెక్కించేందుకు కుయుక్తులు పన్నుతోంది. పోలవరం ఎత్తు తగ్గిస్తామని, నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేమని, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేవలం రూ.1269 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందంటూ కేంద్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఏటా వరదల వల్ల పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. వర్షాకాలం సమీపిస్తున్నందున పోలవరం నిర్వాసితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముంది. వరదలొస్తే నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేయాలి. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రధాని నరేంద్రమోదీ ఏపీకి అన్ని విషయాల్లో అన్యాయం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అడుగడుగునా ఎపీకి ద్రోహం చేసున్నా…జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గం. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తిచేయకపోతే సీఎం జగన్‌ చరిత్రహీనుడిగా మిగలడం తథ్యం’ అని ప్రకటన పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తగు నిధులు కేటాయించాలని, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేస్తూ పోలవరం టూ అమరావతి పాదయాత్ర చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించిందని రామకృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వంతో చర్చించి, తేదీలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతుసంఘాలు చేపట్టిన ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని వెల్లడిరచారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెలుగొండ ప్రాజెక్టుల సాధన కోసం ఆయా ప్రాంతాల్లో సదస్సులు, పాదయాత్రలు చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img