Friday, May 3, 2024
Friday, May 3, 2024

బీజేపీ వెన్నులో వణుకు

ఏడు రాష్ట్రాలకే కమలం పరిమితం

ప్రాంతీయ పార్టీల హవా
13 రాష్ట్రాలలో అధికారం
బీజేపీకి తగ్గిన ప్రజాదరణ

న్యూదిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బీజేపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఆ పార్టీకి లోక్‌సభలో స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ వాస్తవిక అంశం బీజేపీకి నిద్ర పట్టనీయడం లేదు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌…అతి పెద్ద జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల కంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువ.
వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ప్రాంతీయ పార్టీల తరపునే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలుపొందారు. ఈ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 1600 పైమాటే. ఈ సంఖ్యతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు చాలా వెనుకబడి ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బలం గణనీయంగా పడిపోయింది. ఆ పార్టీ 1312 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ తరపున 770 మంది గెలుపొందారు. వామపక్షాలకు 116, బీఎస్‌పీకి 15, ఆప్‌కు 161 అసెంబ్లీ స్థానాలు లభించగా ప్రాంతీయ పార్టీలు, ఇతరులు 1679 స్థానాలు గెలుచుకున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కంటే ఇతర పార్టీలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే 13 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం అధికంగా ఉన్నది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఈ పార్టీలు యాభై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, జార్ఖండ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, మిజోరం, సిక్కిం రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్నాయి. ఇటీవలే జాతీయ పార్టీ హోదా పొందిన ఆమ్‌ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఈ పార్టీకి పంజాబ్‌లో 92 మంది, దిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌కు 97 మంది శాసనసభ్యులు ఉన్నారు.
దేశ జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే బీజేపీ 48.8 కోట్ల మందికి, కాంగ్రెస్‌ 24.4 కోట్ల మందికి, ప్రాంతీయ పార్టీలు 55.4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బీఎస్‌పీ 0.6 కోట్ల మందికి, ఆమ్‌ఆద్మీ పార్టీ 4.5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బీజేపీ ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభ్యులలో బీజేపీకి సగం లేదా అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేసమయంలో కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాలలో సగం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
తొమ్మిది రాష్ట్రాలలో ఇతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాలలో ఆయా పార్టీలకు 80 శాతం కంటే ఎక్కువగానే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే బీజేపీ కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నట్లు స్పష్టమవతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img