Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మన్యంలో వరుస మరణాలు

. భయాందోళనలో ప్రజలు
. భూత వైద్యుల హడావిడితో మరిన్ని వదంతులు
. నాటు వైద్యానికి పరుగులు
. ఎట్టకేలకు వైద్య పరీక్షలు చేపట్టిన యంత్రాంగం

విశాలాంధ్ర బ్యూరో`అల్లూరి జిల్లా/పెదబయలు : మన్యంలో వరుస మరణాలు గిరిజనులను వణికిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని మారుమూల కుంతర్ల పంచాయతీ కిండలం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస మరణాలు ప్రజలు భయాందోళన గురిచేశాయి. సుమారు 250 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఈనెల 19న తొమ్మిది నెలల పసికందు మృతి చెందింది. 22న కిముడు బోడం నాయుడు, 25న రక్తపు వాంతులతో కిముడు కృష్ణం నాయుడు, 26న విచిత్ర ప్రవర్తనతో కిమ్ముడు రామ్‌ నాయుడు, ఇవే లక్షణాలతో 27న రామన్న దొర, 29న ఈశ్వరమ్మ మృతి చెందారు. తొలుత ఒకరిద్దరు మరణించినప్పటికీ పెద్దగా పట్టించుకోని ప్రజలు వరుస మరణాలు చోటుచేసుకున్నాయని తెలియడంతో భయాందోళనకు గురయ్యారు. చేతబడులు, చిల్లంగి నెపంతో కొంతమంది భూత వైద్యులను, నాటు వైద్యులను సంప్రదించారు. మార్చి 31 నాటికి మరిన్ని వదంతులు వ్యాపించాయి. దీంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. గ్రామంలోని నీరు కలుషితమైందంటూ వదంతులు జోరందుకున్నాయి. దీంతో ఎవరైనా మరణించినా బంధువులు రావడం మానేశారు. పిల్లలను పాఠశాలకు పంపడం ఆపేశారు. కొంతమంది ప్రజలు గ్రామం ఖాళీ చేసి చుట్టుపక్కల గ్రామాలకు వలస పోయారు. ఎట్టకేలకు స్పందించిన జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. వైద్య బృందాలను గ్రామానికి తరలించి ప్రజల్లో భయాందోళనలు దూరం చేసే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
సహజ మరణాలే వదంతులు నమ్మవద్దు : జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ కిండలం గ్రామంలో ఇటీవల జరిగిన మరణాలన్నీ సహజ మరణాలేనని వైద్యులు ధ్రువీకరించినందున ఆ గ్రామంలోని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. మరణించిన వారిలో ఒకరికి 73 సవత్సరాలని, ఆయన కార్డియో మెగాలి వల్ల మరణించారని, మరొకరు ఈ నెల 26 నుంచి రక్త విరోచనాలతో బాధ పడుతున్నప్పటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయించారని, పరీక్షించగా సీవోపీడీతో మరణించినట్టు గుర్తించటం జరిగిందన్నారు. అదేవిధంగా మరో వ్యక్తికి ఫిట్స్‌ వచ్చి హెమరేజిక్‌ స్ట్రోక్‌తో ఇంటి వద్దే మరణించారని, మరో వ్యక్తి అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారని, ఒక మహిళ అధిక రక్తపోటుతో బాధ పడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించాలని ప్రయత్నించినా ఆమె న్యూమోనైటిస్‌తో మరణించిందని తెలిపారు. మరో వ్యక్తి చెట్టు మీద నుంచి కింద పడిపోవటంతో మృతి చెందారన్నారు. ఎనిమిది నెలల చిన్నారికి ఫిట్స్‌ రావటంతో పాటు హైపో గ్లాసిమియాతో మరణించినట్లు తెలిపారు.
గ్రామంలో కేంద్ర వైద్య బృందం పర్యటన
కిండలం గ్రామంలో వరుస మరణాలపై శనివారం కేంద్ర వైద్య బృందం, జిల్లా వైద్యులు పర్యటించారు. గ్రామ ప్రజలతో మమేకమై మూఢనమ్మకాల నుంచి విముక్తి పొంది వైద్యం పొందాలని సూచించారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర వైద్య బృందం డైరెక్టర్‌ రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలో వారం రోజులు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎక్కువమంది చుట్ట బీడీ, కైని, జీలుగు కల్లు వంటివి వాడడం వలన అధిక సంఖ్యలో రక్తపోటుకు గురవుతున్నారని తెలిపారు. గ్రామంలో 84 మందికి రక్తపోటును చెక్‌ చేయగా 25 మందికి ఉందని తెలిపారు. రోజు తప్పించి రోజు ప్రతి ఒక్కరికి రక్తపోటును పరీక్షించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీఎంహెచ్‌వో జమల్‌ బాషా, జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సర్వేశ్వరరావు, ఎన్‌వీబీడీ ఎస్‌ శ్రీనివాసరావు, టి.సాంబమూర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, మాజీ సర్పంచ్‌ సింహాచలం, జడ్పీటీసీ బొంజు బాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొంటా సూర్యనారాయణ, మండల బూత్‌ కన్వీనర్‌ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img