Friday, May 17, 2024
Friday, May 17, 2024

లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఏకంతోనే బీజేపీ ఓటమి

సీపీఎం మహాసభల ప్రారంభోపన్యాసంలో ఏచూరి
కన్నూర్‌ (ఈకే నయనార్‌ నగర్‌): బీజేపీని ఓడిరచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీని ఏకాకిని చేసేలా ఈ మహాసభల్లో తమ రాజకీయ విధానాన్ని రూపొందిస్తామన్నారు. సీపీఎం 23వ అఖిల భారత మహాసభల ప్రతినిధుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏచూరి మాట్లాడారు. ‘రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మత ధృవీకరణను ఉపయోగించుకుంటోంది. ప్రమాదకరమైన ఈ మతతత్వాన్ని వ్యతిరేకించాలంటే సెక్యులర్‌ విధానం కావాలి. దీనిపై కాంగ్రెస్‌ తన వైఖరిని చెప్పాలి. ఆ పార్టీ మతోన్మాదంతో రాజీ వైఖరిని అవలంబిస్తోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ మతోన్మాద ధోరణుల పట్ల, దాని దూకుడు పట్ల ఈ పార్టీలు ఏ వైఖరి తీసుకుంటాయో గళం విప్పాలి. బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయం సోషలిజమే. బీజేపీని కేవలం ఎన్నికల్లో ఎదుర్కోవడం ఒక్కటే కాదు, అది సమాజంలో చొప్పిస్తున్న అన్ని ప్రమాదకర హిందూత్వ అజెండాలను తిప్పికొట్టాలి. దేశంలో వామపక్ష పార్టీలు సంఘటిత కార్యాచరణకు ఈ కార్యక్రమం అవసరమైన వేదిక అవుతుంది’ అని ఏచూరి అన్నారు. ‘లౌకికవాద, ప్రజాతంత్ర పార్టీల ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బీజేపీని ఓడిరచవచ్చు. మోదీ ప్రభుత్వం ఇప్పుడు సమాఖ్య హక్కులతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులనూ కాలరాస్తోంది. ప్రాథమిక హక్కులను సైతం నిర్దాక్షిణ్యంగా ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్ర కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తోంది. మోదీ నియంతృత్వ పాలన మతతత్వశక్తులకు, కార్పొరేట్‌ శక్తులకు బలాన్నిస్తోంది’ అని సీతారాం పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం కోవిడ్‌ అనంతర ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని ఏకీకృతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనాను ‘ఒంటరి’ చేసే ఎజెండాతో కొనసాగుతోంది. సామ్రాజ్యవాదం దాని మిత్రదేశాలన్నింటినీ సమీకరిస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మొదలై నేటికి 42వ రోజు. నిజానికి ఇది రష్యా- అమెరికా, నాటోల మధ్య యుద్ధం. రష్యా సరిహద్దులో నాటో విస్తరించడానికి చేసిన ప్రయత్నం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ యుద్ధం వెంటనే ముగియాలి. అయితే, ఈ యుద్ధం అంతర్జాతీయంగా అనేక పరిణామాలకు దారితీస్తోంది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించడం ద్వారా భారతదేశం తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలి. క్వాడ్‌ వంటి సామ్రాజ్యవాద నేతృత్వంలోని కూటముల నుంచి దూరంగా ఉండాలి.’ ‘బలమైన పార్టీ నిర్మాణానికి, బలమైన వామపక్ష ఐక్యతకు, లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సీపీఎం తన ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. హిందూత్వ మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తృత ఫ్రంట్‌ను ఏర్పరచడానికి, మన రాజ్యాంగ విలువలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య విధానాలను రూపొందించే పోరాటాన్ని బలోపేతం చేయడానికి సీపీఎం అహర్నిశలూ పాటుపడుతోంది. ఇలాంటి కృషిలో భాగంగా కలిసి పనిచేయడానికి దేశభక్తులందరి సహకారాన్ని కోరుతున్నాం’ అని ఏచూరి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img