Friday, May 3, 2024
Friday, May 3, 2024

వారికి బాబు చెప్పిందే వేదం

. ఎవరికి టికెట్‌ ఇవ్వమంటే వారికే
. లోకల్‌ హీరో కావాలా… సినీ హీరో కావాలా?
. కాకినాడ సభలో వైఎస్‌ జగన్‌

విశాలాంధ్ర-కాకినాడ : బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల బీ ఫారాలు వేర్వేరు అయినా యూనిఫారం మాత్రం చంద్రబాబుదేనని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అభ్యర్థి అయినా చంద్రబాబు చెప్పిన వారికే సీటు దొరుకుతుందని విమర్శించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ ఏడీబీ రోడ్డులో నిర్వహించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ ఎన్‌డీఏ కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీస్టార్‌ పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తారని, ఆయన కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడమేనని అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఒకరోజు ప్రజల్లో ఉంటే రెండోరోజు పవన్‌కు జ్వరం వస్తుందని, వెంటనే హైదరాబాద్‌ పరిగెత్తుతారని ఆరోపించారు. పవన్‌కు పిఠాపురంపై ఉన్న చులకనభావం దీనిని బట్టి అర్థమవుతోందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా లోకల్‌ హీరో వంగా గీత కావాలా? చీటికీ మాటికి హైదరాబాద్‌ పారిపోయే సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ కావాలా తేల్చుకోవాలని ఓటర్లకు విన్నవించారు. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా నియోజకవర్గాలు సైతం ఇప్పుడు నాలుగయ్యాయన్నారు. చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడని, ఇదీ గాజు గ్లాస్‌ పరిస్థితని జగన్‌ ఎద్దేవా చేశారు. ఎన్‌డీఏ కూటమిలో ఉన్న వదినమ్మ… బాబు కాంగ్రెస్‌లో చేరమంటే కాంగ్రెస్‌లో, బీజేపీలో చేరమంటే బీజేపీలో చేరతారని, బాబు చెపితే తన తండ్రికే వెన్నుపోటు పొడిచారని తీవ్రంగా విమర్శించారు. బాబు ఎవరికి సీటివ్వమంటే వారికే వదినమ్మ ఇచ్చారన్నారు. తనపై విసరడానికి చంద్రబాబుకు గులకరాయే మిగిలిందని విమర్శించారు. ఆ పార్టీలకు స్టార్‌ క్యాంపైనర్లు కావాలేమో కానీ తనకు మాత్రం మీరే నా స్టార్‌ క్యాంపైనర్లు అని పేర్కొన్నారు. 2014లో కూటమి కట్టిన ఈ ముగ్గురే ప్రజలను మోసగించేందుకు మళ్ళీ ఒక్కటయ్యారని ఆరోపించారు. నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారో ప్రశ్నించాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, రూరల్‌ అభ్యర్థి కురసాల కన్నబాబు, పెద్దాపురం అభ్యర్థి దవులూరి దొరబాబు, పిఠాపురం అభ్యర్థి వంగా గీత, జగ్గంపేట అభ్యర్థి తోట నరసింహం, ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు, తుని అభ్యర్థి దాడిశెట్టి రాజాలను పరిచయం చేశారు. కాకినాడ పార్లమెంటుతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని జగన్‌ కోరారు. విజయవాడలో జగన్‌పై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img