Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నిక పరీక్ష

నేడు, రేపు ఉమ్మడి విశాఖ నేతలతో జగన్‌ భేటీలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: విశాఖ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వైసీపీకి పెద్ద పరీక్షగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ మళ్లీ బరిలోకి దిగింది. వాస్తవంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో వైసీపీకే 600కు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓటర్లు ఉన్నారని, ఆ పార్టీ నేతలు చెబు తున్నారు. తమకున్న బలం ఆధారంగా ఎన్నికకు పోటీకి అభ్యర్థిని దింపామని, తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దఫాలుగా ఆ ప్రాంత ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో జగన్‌ మంగళ, బుధవారాల్లో భేటీలు నిర్వహిస్తారు. దీని దృష్ట్యా ఇతరులను కలిసేందుకు అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడిరచింది. జగన్‌ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఇప్పటికే ఐదు నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ ఉప ఎన్నికకు ఆ పార్టీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలో నిలిపారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి అత్యధికంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బొత్స పేరును ఖరారు చేయగా, ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్వర్యంలో ఆ ప్రాంత నేతలు పార్టీ అభ్యర్థి బొత్స గెలుపు కోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img