Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

హైకోర్టుకు డీబీటీ పంచాయితీ

. నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌
. అయోమయంలో విద్యార్థులు
. హైకోర్టులో లబ్ధిదారుల పిటిషన్‌
. ఈసీ నిర్ణయంపై అసంతృప్తి
. దీని వెనుక కుట్ర కోణం: వైసీపీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం డీబీటీ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. డీబీటీ నిధుల విడుదలకు ఈసీ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ, విద్యార్థులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో వాదోపవాదనల అనంతరం కేసును బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై కళాశాలల యాజమాన్య ఒత్తిళ్లు పెరిగాయి. ఫీజులు చెల్లించకుంటే మీ పిల్లలను తరగతులకు, పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈసీ నిర్ణయంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు చివరి దశలో ఉండటం, దీనిపై ఎలాంటి నిర్ణయం ఉంటుందో అనే ఆందోళనతో తల్లిదండ్రులున్నారు. ఈ ప్రభుత్వ చివరి దశలో ఒక్క విద్యా దీవెనకు సంబంధించే రూ.610 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వాటి విడుదలకు ఈసీ అనుమతిస్తే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సమస్య పరిష్కారమయ్యేది. ఈ బకాయిలను ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే విడుదల చేస్తామని ఈసీ తేల్చిచెప్పడంతో లబ్ధిదారులకు దిక్కుతోచడం లేదు. ఈబీసీ నేస్తం, ఆసరా, రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ తదితర డీబీటీ పథకాల నిధుల విడుదలకూ ఈసీ నిరాకరించింది. నాలుగున్నరేళ్లపాటు డీబీటీ పథకాలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా సీఎం ద్వారా ఇవ్వపోయినా, ప్రభుత్వమే లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా చర్యలకు ప్రయత్నించింది. అందుకు ఈసీ అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇప్పటికే ఏప్రిల్‌ పెన్షన్ల పంపిణీ గందరగోళంగా మారింది. ఈ పెన్షన్ల అంశాన్ని ఎన్‌డీఏ కూటమి పార్టీలు, వైసీపీ తమకు ఇష్టానుసారంగా మలుచుకుని రాజకీయ లబ్ధికి ఆరాటపడ్డాయి. తాజాగా డీబీటీ సంక్షేమ పథకాలకు బ్రేక్‌ పడటంతో దానిని వైసీపీ రాజకీయ అస్త్రంగా మలుచుకుంది. ఎన్‌డీఏ కూటమి కుట్రలో భాగంగానే నిలిచిపోయాయని ఆరోపిస్తున్నది. ఏకంగా సీఎం జగన్‌ సైతం ఈ డీబీటీ పథకాలపై స్పందిస్తూ, తనను ఉంచకూడదనే లక్ష్యంతో ఎన్‌డీఏ కూటమి కుట్రకు పాల్పడుతుందని, అధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఇటీవల పెన్షన్ల పంపిణీపై ఈసీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్‌డీఏ నేతలు అనేక సార్లు లేఖలు రాశారని, ఇప్పుడు నిలిచిపోయిన డీబీటీ సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం లేఖలు రాస్తారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
హైకోర్టుకు విద్యార్థులు, రైతులు
విద్యా దీవెన, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ నిధులను ఈసీ అడ్డుకోవడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు విద్యార్థులు, రైతులు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదించినప్పటికీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు బ్రేక్‌ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ రాకముందే వైఎస్సార్‌ ఆసరా, విద్యా దీవెన పథకాలకు సీఎం జగన్‌ నిధులు విడుదల చేశారు. అవి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతున్న తరుణంలోనే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిధుల విడుదలకు బ్రేక్‌ పడిరది. రైతులకు చెల్లించాల్సిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీ నిధుల విడుదలకు నిరాకరించింది. పంట నష్టంపై అంచనా వేసేందుకుగాను ఈసీ అనుమతివ్వలేదు. 2019లో ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం ఖాతా కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఈసీ అనుమతిచ్చిందని, ఇప్పుడు మాత్రం కొనసాగుతున్న పథకాలకు నిధుల విడుదలకు అనుమతిలేదంటూ ఈసీ ఆదేశించడం పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలతో కూడినదని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇవే అంశాలపై లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలకు డబ్బులు ఇవ్వకుంటే తాము ఇబ్బందులకు గురవుతామని రైతులు, మహిళలు, విద్యార్థులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img