Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

సంక్షేమ నిధులకుస్వల్ప విరామం

. పోలింగ్‌ తర్వాత విడుదల
. ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠినచర్యలు
. పోలీసులకు రేపటి వరకు అవకాశం: ఎంకే మీనా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలేవీ ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, పోలింగ్‌ పూర్తయ్యాక ఇవ్వాలని మాత్రమే చెప్పిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. సంక్షేమ నిధుల విడుదలకు ఈసీ అభ్యంతరం చెప్పడంతో కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా… పథకాలు ఆపాలని తాము చెప్పలేదని, పోలింగ్‌ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని కోరినట్లు మీనా చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం మొత్తం 4.30 లక్షల మంది ధరఖాస్తు చేసుకోగా… ఇప్పటి వరకు 3.03 లక్షల (70%) మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని మీనా తెలిపారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన అంశంపై వివాదం రేగడంపై ఆయన వివరణ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో 3 వ తేదీన, మరికొన్ని జిల్లాల్లో 4వ తేదీన హోమ్‌ ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమైందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లకు సంబంధించి తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు. తాను స్వయంలో ఈ నెల 5వ తేదీన విజయనగరం జిల్లాల్లో పర్యటించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను పరిశీలించానని తెలిపారు. ఇప్పటి వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్‌ ఓటింగ్‌ కేటగిరీ క్రింద 28 వేల మంది, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కేటగిరీ క్రింద 31 వేల మంది, మిగిలిన వారిలో సెక్టార్‌ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ఆయన వివరించారు. వీరిలో ఇప్పటి వరకు 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్‌ సెంటర్లలోను, హోమ్‌ ఓటింగ్‌, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కేటగిరీ క్రింద 28 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. అయితే కొంత మంది ఉద్యోగులు వివిధ రకాల కారణాల వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోనందున సంబంధిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగి ఉన్నాడో ఆ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో స్పాట్‌లోనే ఈ సౌకర్యం వినియోగించుకునేలా 7,8 తేదీల్లో అవకాశం కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీచేశామ న్నారు. ఈ విషయంలో నేడు కూడా కొన్ని సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటి వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోని ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలో ఓటు హక్కును కలిగి ఉన్నాడో ఆ ఆర్వోను నేరుగా కలసి సంబంధిత ఫెసిలిటేషన్‌ సెంటర్లో స్పాట్‌లోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీవీఐపీల బందోబస్తు కార్యక్రమంలో పాల్గొనే పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఎవరన్నా తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోతే, ఈ నెల 9వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా… సస్పెండ్‌ చేస్తామని మీనా హెచ్చరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో లంచాలు ఇచ్చేవారిపైనే కాకుండా పుచ్చుకునే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
డబ్బులు పంచేవారిపై కేసులు నమోదు
పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకునే ఉద్యోగుల విష యంలో రెండు రోజుల నుండి విమర్శలు వస్తున్నాయని మీనా చెప్పారు. కొంతమంది ఉద్యోగులు ప్రలోభాలకు లోబడుతున్నట్లు ప్రచారంలో ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రలోభాలకు లోబడటం చెడు సంకేతమ న్నారు. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్‌ ఉద్యోగుల జాబితా పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి…సస్పెండ్‌ చేశామన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదు స్వాధీనం చేసుకొని…వారిని అరెస్టు చేశామ న్నారు. ఒంగోలులో కొంతమంది యూపీఐ విధానం ద్వారా ఉద్యోగులకు నగదు పంపించడం గుర్తించామన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సంబంధిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణకు ఆదేశించామని మీనా తెలిపారు. ప్రాథమిక విచారణ పూర్తయిందని, కొంతమందిని గుర్తించామని, కాల్‌ డేటా, బ్యాంక్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించిన దాదాపు పదిమంది ఉద్యోగులను గుర్తించామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img