Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

చినుకుపడితేనే భృతి!

గొడుగుల తయారీ కార్మికుల బతుకులు అగమ్యగోచరం
8 నెలలు అష్టకష్టాలు
పట్టించుకోని ప్రభుత్వాలు
వారసత్వ వృత్తిపైనే ఆధారం
కుటుంబ పోషణ కడుభారం
అర్థాకలితో కాలం వెళ్లదీస్తున్న వైనం

వారసత్వ వృత్తిని నమ్ముకుని అర్థాకలితో అలమటిస్తున్నారు గొడుగు కార్మికులు. చినుకుపడితేనే భృతి… లేకుంటే పస్తులు తప్పని దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఏడాదిలో నాలుగు నెలలు తప్ప 8 నెలలు అష్టకష్టాలను అనుభవిస్తున్నారు. వృత్తులను కాపాడుకోవాలని ప్రభుత్వాలు ఊకదంపుడు ప్రచారం చేస్తున్నా వారిని ఆదుకోవడంలో మాత్రం విఫలం చెందుతున్నాయి. కొద్దిమేర కుల వృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నప్పటికీ కేవలం గొడుగు కార్మికులపై సీతకన్ను వేయడంతో పిల్లలు విద్యాబుద్ధులకు దూరం అవుతున్నారు. ఓట్ల కోసం కాకుండా ఉపాధి కల్పిస్తే ‘గొడుగు’ కష్టాలు తీరినట్టే!

విశాలాంధ్ర – అరకులోయ: గొడుగు కార్మికుల బతుకులు దిశా నిర్ధేశం లేక అగమ్యగోచరంగా తయారవుతున్నాయి. తాతలతరం నుంచి వారసత్వంగా వచ్చిన గొడుగు మరమ్మత్తుల వృత్తినే ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న గొడుగు కార్మికుల సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం వర్షాకాలంలో మాత్రమే… అది కూడా చినుకు పడిన రోజులలోనే వారికి కాస్తో కోస్తూ జీవన భృతి లభిస్తుంది. మిగిలిన రోజులు పస్తులు ఉండక తప్పని దుస్థితి నెలకొంటుంది. నాలుగు నెలల పాటు వర్షాకాలంలో ఊరూరా వీధులు, వాడలు తిరుగుతూ గొడుగు మరమ్మత్తులు చేపడుతూ వచ్చిన కాస్త డబ్బుతో పిల్లాపాపల కడుపునింపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సంవత్సరంలో నాలుగు నెలలు తప్ప మిగిలిన 8 నెలలు అష్టకష్టాలు పడుతున్నారు. పనులు దొరక్క ఇతర పనులు చేతకాక ఇంటి వద్దనే ఉంటూ అర్థాకలితో అలమటిస్తున్నారు.
నేట కంప్యూటర్‌ యుగంలో ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో వర్షం వచ్చినా గొడుగుతో పెద్ద అవసరం లేకుండా పోతోంది. భారీ వర్షంలో ఎలాగూ బయటకి రారుగనుక గొడుగు కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి లభించడం లేదు. దీనికితోడు ఇంట్లో మూలకు చేరిన పాతగొడుగులున్నా … కొత్త గొడుగులే కొంటున్నారు తప్ప పాత గొడుగులను మరమ్మత్తు చేయించుకోవాలన్నా ఆలోచన రాకపోవడంతో గొడుగు కార్మికులకు వర్షాకాలంలో సైతం సరైన ఉపాధి లేకుండా పోతోంది.దీంతో జీవనోపాధి కోసం ఎదురు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు ఏనాడు గొడుగు కార్మికుల కష్టాలను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్ప వచ్చు. వాహన మిత్ర, నాయి బ్రాహ్మణ, రజక ఇలా కుల వృత్తుల వారికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నప్పటికీ గొడుగు కార్మికులను ఎందుకు విస్మరిస్తుందని అనేకమంది ప్రశ్నిస్తున్నారు.
ఒకపక్క ప్రభుత్వ ప్రోత్సాహం లేక మరోపక్క ఆర్థిక ఇబ్బందులతో పిల్లల్ని చదివించుకోలేక అగచాట్లు పడుతున్నామని గొడుగు కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాతలకాలం నుంచి వచ్చిన వృత్తిని వదులుకోలేక ఇతర పనులు చేసే అలవాటు, ఓపిక లేక కేవలం గొడుగు మరమ్మత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నామని తమ వంటి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నాయి. తమను ఎవరూ పట్టించుకోవడంలేదని, నిరాధారణకు గురవుతున్నామని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కేవలం ఓట్ల కోసం కాకుండా గొడుగు కార్మికుల కష్టాలను గుర్తించి వారికి ఉపాధి కల్పించి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img