హోలీ వేడుకల సందర్భంగా అగ్ని ప్రమాదం
గులాల్ కారణంగా గర్భగుడిలో వ్యాపించిన మంటలు
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయంలోని గర్భగుడిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూజారులు సహా 14 మంది భక్తులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… గర్భ గుడిలో భస్మ హారతి ఇస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆలయ అర్చకుడు ఆశిష్ శర్మ మాట్లాడుతూ… ఆలయంలో హోలీ సందర్భంగా సంప్రదాయ వేడుకలు జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. గులాల్ (రంగులు) కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఆలయ అర్చకులు కూడా అగ్నిప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు, కూతురు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. గాయపడిన వారిలో ప్రధాన అర్చకుడు భస్మార్తి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, చింతమన్ గెహ్లాట్ ఉన్నారు.