Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

99 మందితో తొలి జాబితా

టీడీపీ 94… జనసేన ఐదుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడి

. జనసేనకు 24 ఎమ్మెల్యే… 3 ఎంపీ సీట్లు
. 23 కొత్త ముఖాలకు టీడీపీ చోటు
. పేర్లు ప్రకటించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌
. బీజేపీ కలిసి వస్తే తగిన నిర్ణయం తీసుకుంటామన్న నేతలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసి శనివారం ప్రకటించారు. 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. వీరిలో 23 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు కేటాయించారు. వాటిలో ఐదు స్థానాలకు అభ్యర్థులను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత చంద్రబాబు మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజల మధ్యే ఉండి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారిని అభ్యర్థులుగా ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని, వ్యక్తులు, పార్టీ ప్రయోజనం కోసం టీడీపీ-జనసేన కలవలేదన్నారు. 5 కోట్లమంది ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాయని చంద్రబాబు వివరించారు. నేడు రాష్ట్రానికి చారిత్రాత్మక రోజని, మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగని వ్యాఖ్యానించారు. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నించామన్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్‌ సీఎం అయ్యాక జరిగిన నష్టం ఎక్కువని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా కోలుకోలేని దెబ్బతీశారని, ఇది తనకు, పవన్‌ కల్యాణ్‌కు జరిగిన నష్టం కాదని, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ఏపీ బ్రాండ్‌ను పూర్తిగా దెబ్బతీశారని, ఒక వ్యక్తి బయటకు వచ్చి అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ అవమానించారని, ఈ అవమానాలు ప్రజలు, కార్యకర్తలు, తాము కూడా భరించామన్నారు. యువత భవిష్యత్తు కోసం వైసీపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం టీడీపీ-జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలోనూ మనస్ఫూర్తిగా సహకరించుకుని ముందుకు నడవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ఎంపికపై తన రాజకీయ జీవితంలో చేయనంత ఎక్సర్‌సైజ్‌ చేశానని, దాదాపు 1.30 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని, అభిప్రాయాన్ని సేకరించామన్నారు. అన్ని కోణాల్లో విశ్లేషించాకే అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు. ప్రజల మధ్య ఉండే వారిని, ప్రజల ఆమోదం పొందేవారిని, సమర్థవంతంగా ఎన్నికలు ఎదుర్కొనే వారిని అభ్యర్థులగా ప్రకటించామన్నారు. ముఖ్యంగా మొదటిసారి పోటీ చేసేవారికి 23 మందికి అవకాశం కల్పించడంతోపాటు డాక్టర్లు, ఐఏఎస్‌, గ్రాడ్యుయేట్లకు అవకాశం ఇచ్చామన్నారు. కానీ వైసీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీలు, గూండాలను అభ్యర్థులుగా పెట్టారని విమర్శించారు. ప్రజలే ముందుకు వచ్చి టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాలని, 5 కోట్లమంది ప్రజలు ఒకపక్క…రౌడీయిజం, అక్రమ సొమ్ము, ధనబలం, పెత్తందారులు ఉన్న వైసీపీ మరోపక్క ఉందన్నారు. మాఘ పౌర్ణమి లాంటి శుభదినాన టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించామని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కలిసి వెళ్లాలని నిర్ణయించామన్నారు. 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని వివరించారు. బీజేపీ కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వివరించారు.
పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసేకంటే తక్కువ స్థానాలతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాన్ని దారిలో పెట్టడమే తమ లక్ష్యమని, పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నామన్నారు. 2019 నుండి మనం అరాచకపాలనలో నలుగుతున్నామని, ఇలాంటి సమయంలో బాధ్యతతో ఆలోచించామన్నారు. కొందరు 45 సీట్లు కావాలి…75 సీట్లు కావాలన్నారని, 2019లో కనీసం 10 స్థానాలన్నా గెలిచి ఉంటే నేడు ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని వారికి వివరించానన్నారు. అందుకే తక్కువ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని 24 స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనబడుతున్నాయి కానీ 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు జనసేనలో భాగమవుతాయన్నారు. పార్లమెంట్‌ స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్కని, టీడీపీ-జనసేన పొత్తు బలంగా ఉండాలని, బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకున్నామన్నారు. నాయకులందరూ వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img