Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రచార కాంక్షతోనే మోదీ చర్యలు

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలి
అందుకు ప్రధాని సరికాదు : డి.రాజా

న్యూదిల్లీ: పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి కాబట్టి నూతన భవనాన్ని ప్రారంభించాల్సింది కూడా వారేనని ప్రతిపక్షాలు తేల్చిచెప్పాయి. నూతన పార్లమెంటు భవనాన్ని ఈనెల 28న ప్రధాని మోదీ ప్రారంభించబోతుండటాన్ని తప్పుపట్టాయి. ఇది రాష్ట్రపతి చేయాల్సిన పనని, అందుకు ప్రధాని సరైనవారు కాదని నొక్కిచెప్పాయి. ప్రచార కాంక్షతో నిబంధనలను మోదీ తుంగలో తొక్కుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ‘ప్రధానిగా ఉన్న వారు కార్యనిర్వాహక వ్యవస్థకు నాయకత్వం వహిస్తారు. పార్లమెంటు… శాసన కార్యనిర్వాహక వ్యవస్థ కాబట్టి కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడం సముచితంగా ఉంటుంది’ అని రాజా ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ, ఆర్జేడీ నేత మనోజ్‌ రaా, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు రాజాతో ఏకీభవించారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడమే సరైనదని, దీనిని ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. ‘పార్లమెంటు భారతదేశ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి తలమానికం. దీనిని అప్రతిష్ఠపాల్జేయరాదు. పార్లమెంటుకు రాష్ట్రపతి అధిపతి అని రాజ్యాంగంలోని అధికరణ 79 స్పష్టం చేస్తుంది. ప్రధాని లోక్‌సభకు నాయకులు. అధికరణ 85 ప్రకారం రాష్ట్రపతి ఒంటరిగా పార్లమెంటును నిర్వహించగలరు. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ప్రధాని, రాజ్యసభ సభాపతి సెంట్రల్‌ హాల్‌లో కూర్చుంటారు. రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా గౌరవించాలి. రాష్ట్రపతియే పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలి’ అని ఆనంద్‌ శర్మ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పార్లమెంటు భవనాన్ని అసలు ప్రధాని ఎందుకు ప్రారంభించాలి, లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ ప్రారంభించవచ్చు కదా అని ఒవైసీ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన పార్లమెంటు భవనాన్ని తన ‘మిత్రులు’ సొంత డబ్బుతో కట్టించినట్లుగా మోదీ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిందూత్వ సిద్ధాంతకర్త సావార్కర్‌ జయంతి రోజున పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని పెట్టడంతో దేశనిర్మాతలను ఘోరంగా అవమానించారని విపక్షాలు విమర్శించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img