Friday, May 3, 2024
Friday, May 3, 2024

మద్యాంధ్రప్రదేశ్‌ జగన్‌ ధ్యేయం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంద్రప్రదేశ్‌గా మార్చడమే ముఖ్యమంత్రి జగన్‌ ధ్యేయంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌, ఇవాళ మాట తప్పి, మడమ తిప్పారన్నారు. రాష్ట్రంలో తన సొంత మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మకానికి పెట్టి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన గత మూడేళ్లల్లో రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి, మద్యం మీద ఆదాయం కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు. ఏడాదికి రూ.9 వేల కోట్లుగా ఉండే రాష్ట్ర మద్యం ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచారని వివరించారు. ఈ ఏడాది బార్ల లైసెన్సుల టెండర్లు దక్కించుకునేందుకు వైసీపీ నేతలే పోటీ పడ్డారన్నారు. కడప జిల్లాలో వైసీపీ నేతలే రాష్ట్రంలోనే అత్యధిక రేటును చెల్లించి లైసెన్సులు పొందారన్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం, అండదండలు బార్ల లైసెన్స్‌దారులకు ఉండటం విచారకరమని, ఇదేనా సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేయడం? అని ప్రశ్నించారు. జగన్‌ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారనడానికి వైసీపీ నేతలు పోటీపడి దక్కించుకున్న బార్ల లైసెన్స్‌లే నిదర్శనమన్నారు. జగన్‌ తిరోగమన విధానాలను రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారనీ, మద్య నిషేధంపై జగన్‌ సర్కార్‌ ఇదే విధానం కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆ ప్రకటనలో రామకృష్ణ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img