Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

బ్రిటన్‌ నూతన ప్రధాని సునాక్‌

నియమించిన రాజు ఛార్లెస్‌3

లండన్‌: దాదాపు 100 సంవత్సరాలు భారత్‌ను పరిపాలించిన యునైటెడ్‌కింగ్‌డమ్‌ (బ్రిటన్‌) ప్రధానమంత్రిగా భారత్‌ సంతతికి చెందిన రిషి సునాక్‌ను బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌3 నేడు నియమించారు. కేవలం 45 రోజులు మాత్రమే ప్రధానిగా అధికారంలో కొనసాగి అవమానకరంగా నిష్క్రమించిన లిజ్‌ట్రస్‌ వారసుడిగా సునాక్‌ నియమితులయ్యారు. ఆర్థిక సంక్షోభం అనంతరం బ్రిటన్‌లో నాయకత్వం మార్పు జరిగింది. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పోటీ ప్రయత్నం నుండి విరమించుకోవడం, మరో ప్రత్యర్థి పెన్నీ మార్డాంట్‌ ఎంపీల నుండి తగినంత మద్దతును పొందలేకపోవడంతో సునాక్‌ సోమవారం కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడయ్యారు. గత రెండు శతాబ్దాలలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్‌ ప్రధానిగా 42 సంవత్సరాల సునాక్‌ నిలిచారు. పౌండ్‌ విలువను దిగజారుస్తూ లిజ్‌ట్రస్‌ పన్నుకోత బడ్జెట్‌ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడానికి ముందే ఆర్థిక మాంద్యానికి దారితీసిన ఆర్థిక వ్యవస్థ వారసత్వాన్ని సునాక్‌ అందిపుచ్చుకున్నారు. రాణి ఎలిజబెత్‌ మరణానికి రెండు రోజులు ముందుగా గత నెల 8న ట్రస్‌ను ప్రధానమంత్రిగా నియమించగా నూతన రాజు ఛార్లెస్‌`3 మంగళవారం సునాక్‌ను తొలి ప్రధానమంత్రిగా నియమించారు.
సునాక్‌ తల్లితండ్రులు 1960వ దశకంలో తూర్పు ఆఫ్రికా నుండి బ్రిటన్‌ వలస వచ్చారు. భారత సాంకేతిక పరిజ్ఞాన దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునాక్‌ వివాహం చేసుకున్నారు.
ప్రభుత్వ రుణభారం అప్పటికే బాగా పెరిగిన నేపథ్యంలో పన్నుకోత విధిస్తానని ట్రస్‌ వాగ్ధానం చేయటం తప్పుడు విధానాన్ని అనుసరించటమేనని మాజీ ఆర్థికశాఖ ఛాన్సలర్‌గా సునాక్‌ హెచ్చరించారు. డాలర్‌తో పోల్చుకుంటే పౌండ్‌ రికార్డుస్థాయి దిగువకు పడిపోవటంతో సునాక్‌ చెప్పింది నిజమేనని రుజువయ్యింది. సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా ఎన్నిక కావడంతో మార్కెట్లలో స్థిరత్వం చోటు చేసుకుంది. పౌండ్‌ విలువ పెరిగింది.
‘ఈ దశలో అత్యంత క్లిష్టకరమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ పరిస్థితిని సునాక్‌ సుస్థిరం చేస్తారని పెట్టుబడులు పెట్టేవారు స్పష్టంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని’ ఎజ్‌బెల్‌ ఆర్థిక విశ్లేషకుడు డానీ హ్యూసన్‌ చెప్పారు. ‘పౌండు పుంజుకోవడం, ప్రభుత్వ రుణవ్యయం తగ్గడంతో యూరోపియన్‌ గ్యాస్‌ ధరలు పడిపోగలవని సునాక్‌ భావిస్తున్నారు. భారీ ఇంధన బిల్లులతో పోరాడుతున్న వాణిజ్యవేత్తలకు సహాయం చేయాలని కూడా బ్రిటిష్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ షివాన్‌ హావిలాండ్‌ సునాక్‌కు విజ్ఞప్తి చేశారు. ‘గత కొన్ని నెలలుగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం ఇప్పుడు అంతం కాగలదని బ్రిటీష్‌ వాణాజ్యవేత్తలు నమ్మకంతో ఉన్నట్లు సునాక్‌ నియామకం ధృవీకరణ అయిన అనంతరం హావిలాండ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భారత ప్రధాని అభినందనలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రిషి సునాక్‌కు ‘హృదయపూర్వక అభినందనలు పంపించారు.’ మీరు ప్రధానమంత్రి కావడంతో ప్రపంచ సమస్యలపైన, 2030 కార్యచరణ పథకం అమలుకు సన్నిహితంగా కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. బ్రిటన్‌లోని భారతీయులకు దివాళీ ప్రత్యేక శుభాకాంక్షలు. మన చారిత్రక సంబంధాలను నవీన భాగస్వామ్యం చేద్దాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img