Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆఫ్రికాలో ‘మార్‌బర్గ్‌’ టెర్రర్‌

. ఎబోలాను పోలిన ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి: 9 మంది మృతి
. ఈక్విటోరియల్‌ గినియా సరిహద్దుల్లో కేసులు
. డబ్ల్యూహెచ్‌ఓ ధ్రువీకరణ ` పీడిత ప్రాంతానికి అత్యవసర వైద్య బృందాలు

గినియా: కోవిడ్‌ మహమ్మారి నుంచి ప్రపంచం కాస్తంత ఉపశమనం పొందిందో లేదో ‘మార్‌బర్గ్‌’ అనే కొత్త వైరస్‌ టెర్రర్‌ మొదలైంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ఈ వైరస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈక్విటోరియల్‌ గినియా సరిహద్దుల్లో కేసులు రాగా తొమ్మిది మంది మరణించినట్లు తెలిసింది. కొత్త వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఎబోలా వంటి వైరస్‌ ఈక్వటోరియల్‌ గినియాలో వ్యాప్తి చెందుతోందని, ఇప్పటికే తొమ్మిది మంది మరణించారని ఓ నివేదికలో పేర్కొంది. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సైతం విధించారు. ఇది ప్రాణాంతక వైరస్‌ అని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. చాలా వేగంగా విస్తరింస్తోందని తెలిపింది. ఇది గాలి ద్వారా వ్యాపించదని, వైరస్‌ సోకిన వారిని తాకడం వల్ల లేదా రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని, రోగుల మంచం, వస్త్రాలు వినియోగించినా మార్‌బర్గ్‌ వైరస్‌ బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జంతువులు, గబ్బిలాల నుంచి ఇది మనుషులకు సోకుతుందని పేర్కొంది. వైరస్‌ సోకినవారికి జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం జరగడం.. శరీర సామర్థ్యం తగ్గిపోతుందని, వైరస్‌ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను గినియాకు పంపినట్టు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.రోగులలో తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా ఉన్నట్టు వైద్యులు వెల్లడిరచారు. గాబన్‌, కామెరూన్‌ సరిహద్దులకు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో అనుమానిత కేసులు వెలుగుచూసినట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మొంగోమోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మితోహా ఒండో అయేకాబా పేర్కొన్నారు. వైద్య బృందాలను ఈ ప్రాంతాలకు పంపారు. కీ-ఎన్‌టెమ్‌ ప్రావిన్సులో ఇప్పటివరకూ 4,325 మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించగా జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు తొమ్మిది మంది మరణించారు. వీరి రక్త నమూనాల్లో మార్‌బర్గ్‌ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వైరస్‌ నియంత్రణ కోసం అంటువ్యాధి, కేస్‌ మేనేజ్‌మెంంట్‌, నియంత్రణ, ల్యాబొరేటరీ, రిస్క్‌ కమ్యూనికేషన్‌ నిపుణులను గినియాకు డబ్ల్యూహెచ్‌ఓ పంపింది. నమూనా పరీక్ష కోసం ల్యాబొరేటరీ గ్లోవ్‌ టెంట్‌లు, వైరల్‌ హెమరేజిక్‌ ఫీవర్‌ కిట్‌లు, పీపీఈ కిట్‌లను డబ్ల్యూహెచ్‌ఓ సమకూర్చింది. మార్‌బర్గ్‌ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వైరస్‌ మరణాల నిష్పత్తి 88 శాతం వరకు ఉంటుంది. ఇది ఎబోలా వైరస్‌ వ్యాధికి కారణమయ్యే వైరస్‌ కుటుంబానికి చెందింది. చాలా మంది రోగులు ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావానికి గురయ్యారు. ఈక్వటోరియల్‌ గినియా అధికారులతో కలిసి అత్యవసర ప్రతిస్పందన ద్వారా వ్యాధిని వీలైనంత త్వరగా వైరస్‌ను కట్టడి చేస్తాం’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఆఫ్రికా ప్రాదేశిక డైరెక్టర్‌ డాక్టర్‌ మట్షిడిసో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img