Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇరాక్‌ పార్లమెంటులోనే నిరసనకారులు

బాగ్దాద్‌: ఇరాక్‌లోని పార్లమెంట్‌ భవనంలో అధికార పోరు సాగుతుండగా నిరసనకారులు అక్కడే బైఠాయించారు. షియా మతగురువు ముక్తదా అల్‌ సదర్‌ అనుచరులు ఆదివారం ఇరాక్‌ పార్లమెంట్‌ ప్రహరీని తాళ్లు, ఇనుప గొలుసుల సహాయంతో కూల్చి లోపలకు చొరబడ్డారు. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇరాన్‌ అనుకూల రాజకీయ వర్గాలతో తమ ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బహిరంగ సిట్‌-ఇన్‌ నిర్వహించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రదర్శనకారులను తిప్పికొట్టేందుకు ఇరాకీ భద్రతా దళాలు టియర్‌ గ్యాస్‌, స్టన్‌ గ్రెనేడ్‌లను ప్రయోగించాయి. ఈ హింసలో 100 మంది నిరసనకారులు, 25 మంది భద్రతా దళాల సభ్యులు గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముందస్తు ఎన్నికలు, రాజ్యాంగ సవరణలు, అల్‌-సదర్‌ ప్రత్యర్థుల తొలగింపులను డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాలు ఇరాక్‌ రాజకీయాలను సంక్షోభంలోకి నెట్టాయి. రెండు ప్రధాన షియా గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగడం దేశ రాజకీయ పరిణామాలు తీవ్ర సంక్షోభంలోకి దారితీశాయి. అల్‌-సదర్‌ ఘటనా స్థలాన్ని సందర్శించలేదు కానీ తన విధేయులకు అండగా నిలిచాడు. రాజ్యాంగం, ఎన్నికలను సమూలంగా మార్చడానికి ఇదొక గొప్ప అవకాశంగా ట్వీట్‌ చేశాడు. ఇరాకీలందరూ ‘‘విప్లవం’’లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పార్లమెంటు నిరసనలకంటే సంతోషకరమైన వేడుకగా కనిపించింది. అల్‌-సదర్‌ అనుచరులు తమ నాయకుడిని స్తుతిస్తూ పార్లమెంట్‌ లోపల డ్యాన్స్‌లు, ప్రార్థనలు చేస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img