Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐదు రోజుల్లో నివేదికివ్వాలి

. ఢాకా భవనంలో పేలుడుపై దర్యాప్తు కమిటీకి హోంమంత్రి ఆదేశాలు
. రెండోరోజు కొనసాగిన సహాయక చర్యలు

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఓ భవనంలో సంభవించిన పేలుడు 17 మంది ప్రాణాలు తీయగా మరో 100 మందికిపైగా గాయపడ్డారు. పాత ఢాకా గులిస్థాన్‌లోగల సిద్ధిఖ్‌ బజార్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4.50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనపై సముచిత నిపుణులతో దర్యాప్తు చేపట్టనున్నట్లు బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసదుజ్జమన్‌ ఖాన్‌ తెలిపారు. బుధవారం ఘటనాస్థలిని సందర్శించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాంబు నిర్వీర్యం చేసే దళాలు, పోలీసులు, సైన్యం, అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు చేపడతాయని చెప్పారు. దేశీయ దర్యాప్తు విఫలమైతే విదేశీ నిపుణుల సహాయాన్ని కోరతామని ఆయన తెలిపారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని, వివక్షకు తావులేదన్నారు. దర్యాప్తు వివరాలు బహిరంగపరుస్తామని చెప్పారు. నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందానికి అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం చౌదరి నేతృత్వం వహిస్తారన్నారు. ఈ కమిటీ ఐదు రోజుల్లో నివేదికను సమర్పిస్తుందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మంది షేక్‌ హసీనా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్‌, ప్లాస్టిక్‌ సర్జరీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడిరచారు. బుధవారం రెండవ రోజు సహాయక చర్యలను అగ్నిమాపక దళ సభ్యులు చేపట్టారు. భవనం శిథిలావస్థకు చేరిన క్రమంలో సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఢాకా పోలీసులు తెలిపారు. అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నారు. కాగా, 17 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు బుధవారం అధికారులు అప్పగించారని ఢాకా వైద్య కళాశాల, ఆసుపత్రి పోలీసు అవుట్‌పోస్టు ఇంచార్జి ఇనస్పెక్టర్‌ బచ్చు మియా తెలిపారు. అయితే చాలా మంది మెదడులో రక్తస్రావం వల్లనే చనిపోయారని బంగ్లాదేశ్‌ వైద్యశాఖ మంత్రి జాహిద్‌ మలేక్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img