Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాక్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీ మనీషా రోపేటా

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రోపేటా (26) ఆ దేశంలోనే తొలి హిందూ మహిళా డీఎస్పీగా నిలిచారు. పాకిస్తాన్‌లో పురుషాధిక్య సమాజం ఉంది. ఈ క్రమంలో ఒక మైనారిటీ వర్గానికి చెందిన మహిళా పోలీసు ఉఉద్యోగాన్ని పొందడమే కాకుండా అధికారి స్థాయికి చేరుకోవడం చరిత్రాత్మక పరిణామం. ‘నేను, నా సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థలో పెరిగాం. విద్యను పొందాం.. ఉద్యోగాలు చేస్తున్నాం. విద్య పొంది ఉద్యోగాలు చేయాలంటే ఏ టీచరో డాక్టరో కావాలి తప్ప మిగతా వృత్తుల్లో బాలికలను ప్రోత్సహించే పరిస్థితి స్థానికంగా లేదు’ అని మనీషా తెలిపారు. సామాజిక కట్టుబాట్లను కాదంటూ పోలీసు అధికారి అయ్యానని, మహిళలపై నేరాలు ఎక్కువ కాబట్టి సమాజంలో ‘రక్షక్‌’ మహిళల ఆవశ్యత ఉందన్న దృష్ట్యా ఈ వృత్తిని ఎంచుకున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మనీషా త్వరలోనే నేరాలు అత్యధికంగా జరిగే లియారీ ప్రాంతంలో పోస్టింగ్‌ పొందనున్నారు. సీనియర్‌ పోలీసు అధికారిగా పనిచేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని, ఇది ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని అన్నారు. తన ముగ్గురు సోదరీమణులు డాక్టర్లు కాగా తమ్ముడు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, తను ఎంబీబీఎస్‌ ప్రవేశ పరీక్షలో ఒక్క మార్కుతో ఫెయిల్‌ అయ్యాయని మనీషా తెలిపారు. ఫిజకల్‌ థెరపీ పట్టా పొందినట్లు చెప్పారు. సింధ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ పరీక్షలు రాయగా 468 మందిలో 16వ స్థానంలో నిలిచానని అన్నారు. మనీషా తండ్రి జాకోబాబాద్‌లో వ్యాపారి కాగా ఆయన మనీషాకు 13ఏళ్లప్పుడు చనిపోయారు. దీంతో వీరి కుటుంబం కరాచీకి తరలిపోయింది. సీనియర్‌ పోలీసు అధికారిణిగా లియారీలో విధులు నిర్వర్తించడం ఆషామాషీ వ్యవహారం కాదని, తన ఆలోచనలు, కష్టపడే తత్వానికిగాను తోటివారు గౌరవిస్తారని మనీషా తెలిపారు. తన స్వస్థలంలో మహిళలు ఇలాంటి వృత్తిలోకి రావడం దాదాపు అసాధ్యమని, తాను పోలీసు అయినట్లు తెలిసి ఎంతో కాలం కొనసాగలేదని అక్కడి వారు వ్యాఖ్యానించారని, వారందరి ఆలోచన తప్పు అని నిరూపించానని మనీషా చెప్పారు. నిబద్ధతతో పనిచేస్తానని, వృత్తికి న్యాయం చేస్తానని దీమా వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img