Friday, April 26, 2024
Friday, April 26, 2024

మా జోలికొస్తే ఊరుకోం..

నాటోకు రష్యా, చైనా దేశాల హెచ్చరిక

మాడ్రిడ్‌ : రష్యాతో ప్రత్యక్ష ముప్పు ఉందని, చైనా తీవ్ర సవాళ్లను విసురుతోందని, ఈ దేశాలు ప్రపంచాన్ని అస్థిరపరుస్తాయని నాటో చేసిన వ్యాఖ్యలకు మాస్కో, బీజింగ్‌ గురువారం దీటైన బదులు ఇచ్చాయి. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పాయి. తమ దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఆయా దేశాలు ప్రకటనలు వెలువరించాయి. మాడ్రిడ్‌లో పాశ్చాత్య సైనిక కూటమి (నాటో) శిఖరాగ్ర సమావేశం ముగిసింది. సైబర్‌ దాడులు మొదలు వాతావరణ మార్పు వరకు అనేక సమస్యలు సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని మాడ్రిడ్‌ సదస్సులో నాటో కూటమి వ్యాఖ్యానించింది. ప్రపంచానికి ముప్పు పొంచి వుందనేందుకు ఇది సంకేతామని పేర్కొంది. టర్కీ నుంచి ఎదురైన వ్యతిరేకతను అధిగమించిన అనంతరం తమ కూటమిలో చేరాలని ఫిన్లాండ్‌, స్వీడెన్‌కు నాటో నేతలు అధికారిక ఆహ్వానం పంపారు. నార్డిక్‌ దేశాల చేరికతో నాటో సభ్యదేశాల సంఖ్య 30కు పెరుగుతుంది. తద్వారా రష్యాతో పంచుకునే సరిహద్దులో 800 మైళ్లు నాటో పరిధిలోకి వస్తాయి. అయితే తమ భూభాగంలోని నాటో దళాలనుగానీ సైనిక మౌలికవసతులనుగానీ అనుమతిస్తే అందుకు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఫిన్లాండ్‌, స్వీడెన్‌ దేశాలను రష్యా హెచ్చరించింది. ఇది కొత్తేమీ కాదని రష్యా హెచ్చరికలను ఎస్టోనియన్‌ ప్రధాని ఖాజా ఖల్లాస్‌ తీసిపారేశారు. రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌ నుంచి ఆశ్చర్యకరమైనవి ఏదో ఉండాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. స్వీడెన్‌, ఫిన్లాండ్‌పై రష్యా నేరుగా దాడులు చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. సైబర్‌ దాడేలే కాదు హైబ్రిడ్‌ దాడులకూ ఆస్కారం లేకపోలేదుగానీ జరుగుతున్నది సమాచార యుద్ధమే.. సంప్రదాయ యుద్ధం కాదు అని ఆయనన్నారు. నాటో కూటమిపై చైనా దుమ్మెత్తిపోసింది. తమ దేశంపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. అస్థిరతకు మూలం నాటో అని దుయ్యబట్టింది. చైనాను సవాల్‌గా నాటో భావిస్తోంది కాబట్టి దానిపై మేము నిశిత నిఘా ఉంచడమే కాకుండా అనుగుణమైన విధంగా ప్రతిస్పందించాల్సి ఉంటుందంటూ చైనా వ్యాఖ్యానించింది. చైనా ప్రయోజనాలను తక్కువ చేసే చర్యలను ఉపేక్షించేది లేదని పేర్కొంది. కాగా, నాటో నేతలు గురువారం మాడ్రిడ్‌ సదస్సు ముగింపు నేపథ్యంలో తమ దృష్టిని ఆఫ్రికాలోని సాహెల్‌ ప్రాంతం, మధ్యప్రాశ్చ్యంపై మళ్లించారు. ఆయా చోట్ల రాజకీయ అస్థిరత ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం క్రమంలో వాతావరణ మార్పుఆహార అభద్రత నెలకొంది. పర్యవసానంగా శరణార్థులు యూరప్‌కు మళ్లించబడుతున్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత తమ ఉమ్మడి రక్షణకు అతిపెద్ద సవాల్‌గా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మారాయన్నారు. ఈ యుద్ధం వల్ల ఐరోప అతలాకులం కాగా ప్రతిస్పందన చర్యగా నాటో సాయుధ దళాలు తూర్పు ఐరోపాలోకి ప్రవేశించాయి. కూటమిలోని సభ్యదేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. సైనిక, ఆయుధ సాయాన్ని అందించాయి. వీడియో లింకు ద్వారా సదస్సులో మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమకు మరింత సాయం కావాలని కోరారు. ఆధునిక ఆయుధ వ్యవస్థలు, ఆయుధాలివ్వాలని నాటోకు విన్నవించారు. కీవ్‌కు అండగా నిలవండి లేదా రష్యాతో తలపడేందుకు సిద్ధం కండి అంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ తర్వాత ఏ దేశం మాల్దోవా? బల్టిక్స్‌? లేక పోలాండ్‌? ఈ ప్రశ్నకు అవన్నీ అన్నదే సమాధానం అని జెలెన్‌స్కీ అన్నారు. కాగా, కూటమి తూర్పు పార్శ్వంలో సైనిక బలాన్ని పెంచాలన్న నిర్ణయం జరిగింది. రష్యా భవిష్యత్తు ప్రణాళికల గురించి రొమేనియా నుంచి బాల్టిక్‌ దేశాల వరకు ఆందోళన చెందుతున్నాయి. అలాగే, శీఘ్ర ప్రతిచర్య దళాలను ఎనిమిది రెట్లు అంటే 40,000 నుంచి 3,00,000 పెంచడానికి ప్రణాళికలను నాటో ప్రకటించింది. దళాలు వారి స్వదేశాలలో ఉంటాయి కానీ తూర్పున ఉన్న నిర్దిష్ట దేశాలకు అంకితమై పనిచేస్తాయని పేర్కొంది. మరోవైపు బ్రిటన్‌ గురువారం ఉక్రెయిన్‌కు మరో 1 బిలియన్‌ పౌండ్ల (%వి%1.21 బిలియన్లు) సైనిక సహాయాన్ని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img