ఐవిఎఫ్ చికిత్సా విధానానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని, తాను ఫాదర్ ఆఫ్ ఐవిఎఫ్ అని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. జార్జియాలోని మహిళా టౌన్ హాల్లో బుధవారం ట్రంప్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) గురించి మాట్లాడారు. తాను ఐవిఎఫ్ చికిత్సా విధానం గురించి మాట్లాడాలనుకుంటున్నానని, తాను ఫాదర్ ఆఫ్ ఐవిఎఫ్ అని అన్నారు. తమ పార్టీ ఐవిఎఫ్కు పూర్తి మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. డెమోక్రాట్లు ఈ చికిత్సా విధానంపై దాడి చేయడానికి యత్నించారని అన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి చికిత్సలపై పరిమితుల గురించి కొందరు మహిళలు ఆందోళన చెందుతున్నారని తెలుసుకున్నానని, దీంతో తాను ఐవిఎఫ్కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు. కొంతమంది సాంప్రదాయక రిపబ్లికన్లు ఐవిఎఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఐవిఎఫ్ ఎన్నికలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఐవిఎఫ్పై చర్చపై ట్రంప్ ప్రచార ప్రతినిధి స్పందించారు. ట్రంప్ మహిళలు, సంతానోత్పత్తి చికిత్సల ఆవశ్యకతను సమర్థించారని, అయితే తనని తాను ఐవిఎఫ్ ఫాదర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ముందస్తు ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మహిళలకు సంబంధించిన సమస్యలలో ట్రంప్, తన ప్రత్యర్థి డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కన్నా వెనుకంజలో ఉన్నట్లు ఇటీవల రాయిటర్స్, ఇప్పోస్ పోల్లు ప్రకటించాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపును నిర్ణయించే కీలక రాష్ట్రాలలో జార్జియా కూడా ఒకటి. దీంతో మహిళా ఓట్లను రాబట్టుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు.