Friday, April 19, 2024
Friday, April 19, 2024

అధ్వాన్నంగా ఆర్టీసీ బస్టాండ్ – భద్రాచలం బైపాస్ రోడ్డు

విశాలాంధ్ర – తిరువూరు : తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేట్ నుంచి భద్రాచలం వెళ్ళే మినీ బైపాస్ రోడ్డు మోకాళ్ళలోతు గుంతలతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని సీపీఐ నగర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుందరరావు ఆరోపించారు. పార్టీ పట్టణ కమిటీ అధ్వర్యంలో శుక్రవారం మినీ బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలని కోరుతూ రహదారి గుంతల వద్ద పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ రాముడు కొలువై ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలానికి భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి ధ్వంసమై, భారీ గుంతలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా నగర పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏళ్ళ తరబడి డ్రైనేజీలు లేక, మురుగునీరు రోడ్డు పైనే ప్రవహిస్తూ రహదారి గోతులమయంగా మారినా, అదే వార్డుల్లో నివాసం ఉంటున్న నగర పంచాయతీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు ప్రజల కష్టాలు కనిపించట్లేదని, కేవలం మొక్కుబడి మరమ్మత్తులు తప్ప రహదారుల అభివృద్ధిని పాలకవర్గం పట్టించుకోవట్లేదని సుందరరావు విమర్శించారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు, పాలకవర్గ పెద్దలు మొద్దునిద్ర వీడి, యుద్ధప్రాతిపదికన ఈ మినీ బైపాస్ రోడ్డును సీసీ రహదారిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించకపోతే దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ సహాయ కార్యదర్సులు ఎస్ కే సుభాని, మాలపాటి ఉదయ్, పార్టీ నాయకులు ఐనాల ముత్తయ్య, బాణాల అశోక్, బత్తుల వెంకటేశ్వరరావు, మస్తాన్, మురళీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img