Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అటల్‌ నుంచి మోదీ దాకా ‘కాషాయ తుపాను’

మీడియా సమాజానికి దర్పణం అనుకుంటే సమాజ గమనం ఆ దర్పణంలోకి పరావర్తం కావడానికి కారకులు పత్రికా రచయితలే. వ్యవస్థలోని సర్వాంగాలనూ దగ్గర నుంచి చూసి రికార్డు చేసే పత్రికా రచయితలకూ సొంత అభిప్రాయాలు, సిద్ధాంతాలూ ఉంటాయి. తాము పని చేసిన కాలంలోని పరిణామాలపై వారికి ఒక నిర్ధిష్ట దృక్కోణం ఉంటుంది. ఆ దృక్పథాన్ని దైనందిన వృత్తినిర్వహణలో నమోదు చేయక పోవచ్చు. ఒకవేళ చేసినా తమ సొంత వైఖరిని పత్రికారచనలో ప్రతి బింబించే అవకాశం ఉండకపోవచ్చు. అలా తమ మదిలో నిలిచి పోయిన ఘటనలలో ముఖ్యమైన వాటిని ఏరి ఒక దండలా గుచ్చి తమ అనుభవాలను, వార్తా కథనాల వెనక ఉన్న పరిణామాలను రికార్డు చేయడానికి కొంతమంది జర్నలిస్టులు రచయితలుగా మారిపోతారు.
సృజనాత్మక శక్తి ఉన్న పత్రికా రచయితలు తాము వృత్తిధర్మంగా రాసిన రాతలను మించిన విశేషాలను ఇలాంటి గ్రంథాలలో నిక్షిప్తం చేయవచ్చు. కొంతకాలం వినోద్‌ మెహతా సంపాదకత్వంలోని ‘‘ఔట్‌ లుక్‌’’ పత్రికలో పొలిటికల్‌ ఎడిటర్‌గా పనిచేసిన సబా నఖ్వీ మంచి రచయిత్రి కూడా. ఇంతవరకు ఆమె ‘‘కాపిటల్‌ కాంక్వెస్ట్‌’’, ‘‘పొలిటికల్‌ జుగాడ్‌: ది కోయిలిషన్‌ హాండ్‌ బుక్‌’’, ‘‘ఇన్‌ గుడ్‌ ఫెయిత్‌’’, ‘‘మై ఆల్ఫాబెట్‌ స్టోరీ’’, ‘‘మై డైలీ రొటీన్‌’’ గ్రంథాలు వెలువరించారు. ‘‘షేడ్స్‌ ఆఫ్‌ సాఫ్రాన్‌’’ గ్రంథం నఖ్వీ 2018లో వెలువరించారు. ఆ తరవాత పరిణామాల ప్రేరణ కారణంగా ఆ గ్రంథాన్ని మరింత పరిపుష్టం చేసి ‘‘సాఫ్రాన్‌ స్టార్మ్‌’’ అని ఇటీవలే మరో గ్రంథం వెలువరించారు. ఈ రెండిరటిలో వస్తువు ఒకటే అయినా అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అడ్వానీకాలం నాటి బీజేపీ ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీలో కొట్టొచ్చినట్టు కనిపించే మార్పులను చేర్చారు. సాధారణంగా ఒక రచన పునర్ముద్రణ అంటే పెద్ద మార్పులు ఏమీ లేకుండానే ప్రచురిస్తారు. కొంతమంది రచయితలు అనివార్యం అనుకుంటే కొన్ని మార్పులూ చేయవచ్చు. కానీ సబా నఖ్వీ ఏకంగా షేడ్స్‌ ఆఫ్‌ సాఫ్రాన్‌ గ్రంథంలో కొత్త సరంజామా చేర్చడంతో సరిపెట్టుకోకుండా ‘‘సాఫ్రాన్‌ స్టార్మ్‌’’ గా పేరే మార్చేశారు.
విధి నిర్వహణలో భాగంగా సబా నఖ్వీ ఎక్కువగా బీజేపీ వ్యవహారాల వార్తలే ఎక్కువగా రాశారు. అంటే బీజేపీ రాజకీయాల క్రమోన్మీలనాన్ని నిశితంగా పరిశీలించే అవకాశం ఆమెకు వచ్చింది. ప్రస్తుతం ఆమె వివిధ పత్రికలకు వ్యాసాలు రాస్తారు. టీవీల్లో, యూట్యూబ్‌ చానళ్లలో రాజకీయ చర్చా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. మంచి రాజకీయ విశ్లేషణాశక్తిగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
భారతీయ జనసంఫ్‌ుగా ఉన్న సమయంలో బీజేపీ అస్తిత్వం లేదు. జనసంఫ్‌ు పేరుతో దాదాపు 27 ఏళ్లు పనిచేసిన తరవాత ఎమర్జెన్సీ పుణ్యమా అని ఇందిరాగాంధీ పోకడలను వ్యతిరేకించే క్రమంలో జనసంఫ్‌ు 1977 ఎన్నికలకు ముందు జనతా పార్టీలో విలీనం అయి పోయింది. ఆ ముచ్చట మూడేళ్లకన్నా తక్కువ రోజుల్లోనే ముగిసింది. తరవాత జనసంఫ్‌ు పేరు వదిలేసి వాజపేయి, అడ్వాణీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) గా అవతరించింది. మూడు దఫాలుగా మొత్తం ఆరేళ్ల పైచిలుకు కాలం బీజేపీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేసిన వాజపేయికి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలికే లేదంటారు నఖ్వీ. ఇద్దరి వ్యక్తిత్వాలు, వ్యవహార సరళిలో మార్పు తీరును నఖ్వీ సవిమర్శక దృష్టితో రికార్డు చేశారు. నిరపేక్షంగా రాయడం ఆమె ప్రత్యేకత. వాజపేయి నాయకత్వంలో మూడు సార్లు బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా ఆ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఎన్నడూ లేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు దఫాలు బీజేపీకి పూర్తి మెజారిటీ ఆధారంగానే ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. 2014లో కన్నా 2019లో బీజేపీ సొంత కాళ్ల మీద బలంగా నిలబడగలిగిన మెజారిటీ సంపాదించింది. వాజపేయి నాయకత్వంలో అయిదేళ్లు నిరాటంకంగా కొనసాగినప్పుడు ఆ ఐక్య కూటమిని ఎన్‌.డి.ఎ. అనే వారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగల నైపుణ్యం ఉన్న వ్యక్తిగా వాజపేయి గుర్తింపు పొందారు. ఇప్పటికీ మోదీ నడుపుతున్నది సాంకేతికంగా ఎన్‌.డి.ఎ. ప్రభుత్వమే. కానీ 2019లో మరింత మెజారిటీ సాధించిన తరవాత ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం అని ప్రస్తావించడమే మానేశారు. అందరూ బీజేపీ ప్రభుత్వం అనే అంటున్నారు.
మొదటి దఫా ప్రధాని అయినప్పుడు ప్రాంతీయ పార్టీల పాత్రను మోదీ కుదించి వేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాల ఛాయే కనిపించకుండా చేశారు. ఇప్పుడు ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బొటాబొటి మెజారిటీ అయినా సాధించగలమా అన్న భయం మోదీని పీడిస్తోంది. అందుకే మళ్లీ ఎన్‌.డి.ఎ. నామజపం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఏర్పాటు చేసిన రోజుననే మోదీకి హఠాత్తుగా ఎన్‌.డి.ఎ. గుర్తుకొచ్చింది. భాగస్వామ్య పక్షాల కోపం తపన మోదీలో బహిరంగంగానే కనిపిస్తోంది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే దశ నుంచి పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం నడిపే దశకు చేరుకున్న మోదీ నాయకత్వంలోని బీజేపీలో వాజపేయి నాటి ధోరణి లేశమంత కూడా కనిపించడం లేదు. బీజేపీ పరిణామం చెందినట్టే మోదీ పుణ్యమా అని అనేక ప్రతికూల పరిణామాలు వచ్చాయి. ఆధిపత్య ధోరణి అడుగడుగునా విలయ నర్తనం చేస్తోంది. వాజపేయిది, మోదీది ఒకే భావ ధార అయినా సకల విషయాలలో ఇద్దరి నడవడిక, వ్యవహార సరళిలో మార్పు ఎవరైనా గుర్తించగలరు. ఇద్దరు బీజేపీ ప్రధానమంత్రుల భిన్న ధోరణిని, వ్యక్తిత్వాల్లో తేడాను రూపు కట్టించడంలో సబా నఖ్వీ నైపుణ్యం ‘‘సాఫ్రాన్‌ స్టార్మ్‌’’ నిండా ప్రతి పేజీలో పరుచుకుని ఉంది.
1998లో నఖ్వీ వార్తా సేకరణలో భాగంగా ప్రధానిగా వాజపేయి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 2014లో అదే రాష్ట్రపతి భవన్‌ ఆవరణలోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగినా మార్పు ప్రత్యేకంగా కనిపించిందంటారు నఖ్వీ.
బీజేపీ అస్తిత్వానికి మూలభూతమైన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలకు బీజేపీ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలలోనూ మార్పు ప్రత్యేక పరిశీలనా దృష్టి అవసరం లేకుండా చూడొచ్చునంటారు నఖ్వీ. వ్యక్తి ఆరాధనా తత్వం ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయిందని రుజువు చేయడాన్ని నఖ్వీ మరిచిపోలేదు.
ఒకప్పుడు ఇతర రాజకీయ పార్టీలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్నారని వాజపేయి వగచేవారు. ఇప్పుడు మోదీ తాను అజేయుడిని అనుకుంటున్నారు. ఈ మార్పు సాధ్యమైన క్రమం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. మోదీ ఏలుబడిలో గత అయిదేళ్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాల మీదకు వేటకుక్కల్లా ప్రయోగిస్తున్న తీరునూ నఖ్వీ అరమరికలకు తావు లేకుండా చూపించారు. మన దేశం వైవిధ్యభరితమైందన్న భావనను పటాపంచలు చేసి సర్వాన్ని మోదీ ఎలా తన గుప్పెట్లో కేంద్రీకృతం చేసుకున్నారో కూడా నఖ్వీ నిరూపించారు. సమకాలీన చరిత్రను నిరపేక్షంగా రికార్డు చేయగలిగిన అతి కొద్ది మంది పత్రికా రచయితలలో నఖ్వీ మొదటి వరసలోనే ఉంటారు.
ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img