Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ఏడు దశాబ్దాలు దాటినా వాడీ వేడీ తగ్గని కథలు

చంద్ర ప్రతాప్‌ కంతేటి

 
కొన్ని కులాలు,  కొన్ని మతాల్నీ మాత్రమే భుజాన వేసుకుని జనాన్ని మరింతగా విడదీయడమే ‘అభ్యుదయం’  అనుకునే నేటి కొందరు రచయితలు ‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ తప్పకుండా చదవాలి. ‘కొడవటిగంటి’ అభిప్రాయం పిచ్చేశ్వరరావు కథలలో నాలుగైదు మాత్రమే ‘కథా ప్రపంచం’లో నిలబడి పోతాయి. నా అభిప్రాయం ప్రకారం ఈ సంపుటిలోని కథలన్నీ కాలపరీక్షకు నిలబడేవే. కాలాతీతమైనవే. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం రాసిన కథలే అయినా వీటిలో ఎక్కడా పాత వాసన పొడగట్టదు. మీదు మిక్కిలి ఈ కాలానికి సరిపడేలా అనిపిస్తాయి. వసివాడని నవ పారిజాతాల్లా ప్రాసంగికత కోల్పోని మానవతా పరిమళాలను ఇప్పటికీ వెదజల్లుతూనే ఉన్నాయి. 
‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ సంకలనంలోని  కథలన్నీ రచయిత కాలక్షేపానికో ఉబుసుపోక రాసినవో మాత్రం కాదు. జనాభ్యుదయమనే ప్రత్యేక లక్ష్యంతో రాసిన విలక్షణ కథలు. పైకి సరళంగా కనిపిస్తున్నా ఒక్కొక్క కథ ఒక్కో అణుబాంబు. అలాగని కృతకమైన కథా వస్తువులు, ఇతివృత్తాలు, పెచ్చుమీరిన హింస వీటిలో ఎక్కడా లేవు. రచయిత కూడా అలా చెప్పడు. కథ నడపడంలో ఆయన ప్రతిభ మన కళ్ళకి కడుతుంది. మెదళ్లను తడుతుంది. స్వీయానుభవైకవేద్యం అవుతుంది. 
‘చిరంజీవి’ కథ తీసుకుంటే మనం అందరం కథ చివరికి వచ్చేసరికి చిరంజీవులుగా మారిపోతాం. ఉద్రేకపడిపోతాం. దానిలో అంతటి విషయం దట్టించి చెప్పారు రచయిత. ‘ఇది ఇప్పుడు మన దేశమే’ కథ చదివితే దేశం కోసం కాలు పోగొట్టుకున్న ఒక సైనికుడికి లభించింది ఏమిటో తెలిసి నివ్వెరపోతాం. కడుపు మండిపోతుంది. ముఖ్యంగా అందులో పాత్రల నడుమ నడిచిన వ్యంగ్య సంభాషణలు చురకల్లా తగులుతాయి. ‘’ప్రభుత్వానికి నేను ఇంకా చాలా నష్టం చేశానండి..ఆ పదిమంది ఉన్నతాధికారుల ప్రాణాలూ రక్షించకుండా ఉన్నట్టయితే వాళ్ళ జీతాల ఖర్చు అలవెన్సుల ఖర్చు ఇంకా బోలెడంత మిగిలేదండి..’’ అంటూ పంచశీలపై చురకలు వేస్తాడు బాధిత సైనికుడు. దేశాధి నేతలకు కర్రుకాచి వాత పెట్టేలా చెప్పడం పిచ్చేశ్వరరావు గారి శైలి. 
రజాకార్లు,  భూస్వాముల నేపథ్యంలో సాగిన ‘విముక్తి’ కథ గొప్ప శిల్పంతో సాగుతుంది. కాలంలో ముందుకీ వెనక్కీ నడుస్తూ ఆ కథ సాగిన తీరు అత్యద్భుతం. బహుశా అలా ఎవరు రాయలేరేమో అనిపించింది. ‘నెత్తురు’ పేరుతో ఒక కథ రాయడం-పాత్రలు కనిపించకుండానే ఉద్రేకాన్ని ఉద్వేగాన్ని దానిలో దట్టించడం పిచ్చేశ్వరరావు గారికి మాత్రమే సాధ్యమైన విద్య. 
ఆయన వాక్యాల్లోనే చాలా మెరుపులు ఉంటాయి. వాటి విన్యాసాలు మనల్ని కవ్విస్తాయి.. నవ్విస్తాయి..   

‘‘ఒక సంవత్సరంలో నిన్నటి వరకూ నేనూ బానిసనే. ఏ సంవత్సరంలోనో నేటి నుండి నేను స్వతంత్రుడినట! ఔను! కాదనడానికి నాకు స్వాతంత్య్రం లేదు’’ (ఆగష్టు 15న)
‘‘బతకాలనుకున్నవాడు ఎవడైనా హైద్రాబాద్‌ అంతా కాళ్లతో తిరగ్గలడా? మీరే చెప్పండి. అందుకే అతను కారెక్కి వెళ్ళాడు. నిజమే అది అతని సొంతకారు కాదు. ఆంధ్రులకు అంత గొప్పసేవ చేయ బోతున్న వాడిని అలా గౌరవించడం ఆంధ్రుల కర్తవ్యం కాదూ’’ (డొంకల వంకల మనసులు)
చూడండి తన శైలిలో ఎంత గడుసుదనం చూపిస్తారో? నా వరకు నేను వేల కథలు చదివాను కానీ ఇలా శక్తివంతమైన శైలిలో రాసిన కథలు తక్కువ అని ఘంటాపథంగా చెప్పగలను. ముఖ్యంగా తెలుగులో ఇలాంటి కథలు మరీ తక్కువేమో! దీని అర్థం రావి శాస్త్రి, మునిపల్లె రాజు, శ్రీపాద, మల్లాది వంటి కథావరిష్టులను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఈ తరహా శైలిలో రాసినవారు మరొకరు కనిపించలేదని చెప్పడం మాత్రమే నా అభిమతం.
పిచ్చేశ్వరరావుగారి కొన్ని కథలు అప్పుడప్పుడే దేశీయ సాహిత్యంలోకి, కవిత్వంలోకి ప్రవేశిస్తున్న సర్రియలిజం వగైరా పోకడల్ని ప్రతిబింబిం చాయని అనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అవిశ్రాంత చదువరి కావడంవల్ల వారలాంటి ప్రయోగాలు చేశారని నా బలమైన నమ్మకం. సరళంగా చెప్పడం కాకుండా, అర్థమయ్యి కానట్టుగా చెప్పడం, ధ్వని ప్రధానంగా చెప్పడం కథకైనా కవితకైనా ప్రాణంగా నిలుస్తుందన్నది ప్రాజ్ఞుల భావన. ప్రాచీన కవులు కూడా ‘ధ్వని’ శాస్త్రం గురించి ఎప్పుడో చెప్పారు. అలా ధ్వని ప్రధానంగా చెప్పినదే ఉత్తమ కవిత్వం అని తీర్మానించారు. పాశ్చాత్యులూ అదే మాటన్నారు. ఈ సందర్భంగా మన కాలపు గొప్ప రచయితగా పేరు పొందిన దివంగత కే. కేశవరెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన మాటని ఒకటి ఇక్కడ ఉటంకిస్తాను.
‘‘పాఠకులని తెలివి తక్కువ వాళ్లుగా అంచనావేసి స్పూన్‌ ఫీడిరగ్‌ చేయాల్సిన అవసరంలేదు. పాఠకులు చాలాతెలివైనవారు. మనం ఏమి చెబుతున్నామో వారుబాగా అర్థం చేసుకోగలరు..’’ పిచ్చేశ్వరరావు కథలు చూస్తుంటే ఈ సత్యంఆయన 70 ఏళ్ల క్రితమే గుర్తించారని అనిపిస్తుంది.
కథలకు శీర్షికలు పెట్టడంలో కూడా పిచ్చేశ్వరరావుది విలక్షణ మార్గం. ‘గడవని నిన్న’, ‘బ్రతకడం తెలియనివాడు’, ‘చిత్రాతిచిత్రమైన ఒక గాధ’.. ‘గడిచిన దినాలు’, ‘ఆగస్టు 15న’ .. ఇలాంటి 26 కథానికలతో వెలువడిన ఈ పుస్తకంలో ప్రతికథా ఆణిముత్యమే! ఈ కథలన్నీ విశ్లేషించాలంటే స్థలాభావమే తప్ప అన్యం కాదు. అలా ఎవరైనా చేసినట్టయితే అది సమీక్ష కాదు.. గొప్ప థీసిస్‌ అవుతుంది.
తనకు రావాల్సిన పేరు కంటే తక్కువ పేరు సంపాదించుకున్నా వెలలేని మణులలాంటి కథలను తెలుగు జాతికి అందించిన మహానుభావుడు పిచ్చేశ్వరరావు. వారి తనయుడు అనిల్‌ అట్లూరి చెప్పినట్టు ఆయన భూమిపై ఉన్నది అతికొద్దినాళ్ళు అయినా కొడుకుకు విలువైన సమయాన్ని కేటాయించారు. తెలుగు సాహిత్యానికి అంతకంటే విలువైన కథారత్నాలను, నవలలను అందించారు. అనువాదాలు చేశారు. సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారు. నావికా దళంలో పనిచేశారు. ఒక మనిషిని సదా గుర్తుపెట్టుకోవడానికి ఇంతకన్నా ఎవరేం ఆశించగలరు?
పిచ్చేశ్వరరావు ప్రాతఃస్మరణీయులు. ఈ తరం పాఠకులు వారిని చదవాలి. ఈ కథలపై చర్చలు జరగాలి. కథా కార్యశాలల్లో ప్రముఖులు వీటి లోతుపాతులు, ప్రయోగశీలతలపై విస్తృతంగా చర్చించాలి. ఏదేమైనా వారి కథలు నేటి రచయితలకు పాఠ్యగ్రంథాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
చంద్ర ప్రతాప్‌ కంతేటి, 80081 53507

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img