Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఏ .ఐ. అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

సహజత్వం చావు దెబ్బ తిన్నది
అసహజత్వం అందలమెక్కింది
మనిషి మహనీయుడు అయ్యాడు
మనీషి దేవుడయ్యాడు
ఇప్పుడు వ్యవసాయం అంతా
యాంత్రికరణ ఫలసాయం
డ్రోన్లు మన పాలిట డాన్లు
యానిమేషన్‌ చిత్రంలో డాన్లు
చిత్రాతిచిత్రంగా రెజ్లర్లు అవుతారు
రిమోట్‌ నీ చేతుల్లో ఉంటుంది
ప్రసారాలు మాత్రం వాడు చేస్తాడు
సీరియల్‌ కథ కథకు మధ్య
అడ్వర్టైజ్మెంట్లు షాపింగ్‌
నీతో కప్పదాట్లు వేయిస్తుంది
ప్రకటనలను చూసి
అవసరం ఉన్నా లేకున్నా
ఇల్లును అగ్లీ సామాగ్రితో నింపేస్తాం
ఇప్పుడు మనల్ని మనం
అసహజత్వం అలసత్వంలోకి
సమాయత్తం చేసుకోవాలి
ఇప్పుడు చేతులతో పనిలేదు
కాళ్లతో నడవాల్సిన అవసరంలేదు
ఏకాగ్రత చదువుతో పనిలేదు
శాస్త్రంతో సంగీత గీతంతో పనిలేదు
నిన్ను పచ్చగా తీర్చిదిద్దే భూమితో పనిలేదు
నీకు పిడికెడు అన్నం ప్రసాదించే
భూమి పుత్రులతో పనిలేదు
ఊరు పట్టణం లేబర్‌ అడ్డా మీద
శ్రమ ప్రాసంగికత లేని తూకానికి
గిట్టుబాటు కూలీలు దొరుకుతారు
చేసంచి లేకున్నా
ప్లాస్టిక్‌ కవర్లో బార్‌ కోడ్‌ అతికించుకు
నిన్ను ‘‘నీవును’’
న్యాక్‌ గా నైస్‌ గా ప్యాక్‌ చేసుకుని
ఇంటికి తీసుకపోవచ్చును
అదీ వీలు కాదంటే
ఆన్లైన్లో ఆర్డర్‌ చేస్తే చాలు
నీ ఇంటి ముందు కాలింగ్‌ బెల్లుjైు
జీ హుజూర్‌ వస్తువు వచ్చి
చేతులు కట్టుకొని నిల్చుంటుంది
ఇప్పుడు ఇంజనీరింగ్‌ లో
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్స్‌
చేయడమే ఉత్తమోత్తం
అటు వెంటనే ఉద్యోగము వస్తుంది
ఇటు చదివిన చదువుకు
తల్లిదండ్రులకు వడ్డీతో సహా
పెట్టుబడి తిరిగి చెల్లించబడుతుంది
జుకర్‌ బర్గ్‌ బిడ్డకు
యుక్త వయస్సు వచ్చింది
ఇక హోంవర్క్‌ చేసే పిల్లల్ని కనే పిల్లకు
ఆర్టిఫిషియల్‌ యువకుడ్ని వెతకాలి
ఆడబిడ్డ పుట్టినప్పుడే
ఇదే భూమి మీద ఎక్కడో
మగవాడు పుట్టి ఉంటాడు
మనం కాలికి బట్ట కట్టకుండా
తిరిగి అల్లుడ్ని వెతుక్కోవాలి అంతే

మనిషిని ఉన్నతుడ్ని చేయాలి కానీ
మనిషి మనసును అమాంతం మింగేసేలా
మర మనిషిని సృష్టించుకోవడమే పెను విషాదం
-జూకంటి జగన్నాథం, 94410 78095

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img