Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఒక క్రీడాకారుని నవరసభరిత ఆత్మకథ ‘క్రీడాస్థలి’

ఆత్మకథలు అనేకం, దేశాధ్యక్షులూ ప్రధానులూ సర్వ సైన్యా ధ్యక్షులూ తత్వవేత్తలూ శాస్త్రవేత్తలూ, గొప్ప గొప్ప కవులూ కళా కారులు, చరిత్రను శాసించినవారు, చరిత్ర గతిని మార్చినవారు అంతా మహా మహులు మహానుభావులు. చాలావరకు అలాంటివారు రాస్తారు ఆత్మకథలు. అవి రకరకాలుగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. విశేషాలు ఉంటాయి. వివాదాలూ ఉంటాయి. అహో! అనిపిస్తాయి. మరి అతను ఒక మామూలు మనిషి. ఏ ప్రత్యేకతలూ లేని మధ్యతరగతి మనిషి. పల్లెటూరి బిడ్డడు. అందునా ఒక క్రీడా కారుడు. ఎందరికో ఆటలు నేర్పినవాడు. ఆడిరచినవాడు. క్రీడల శాఖలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగినవాడు. ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత దశలో ఆత్మకథ రాస్తే...అందులో అద్భుతాలు ఏం ఉంటాయి? అనుకోవచ్చు. కానీ ఉన్నాయి. ఒక పోరాటం ఉంది. మంచి సందేశమూ ఉంది. అది కేవలం ఒక వ్యక్తి జీవిత పోరాటం మాత్రమే కాదు. గెలుపు ఓటముల మధ్య పోరాటం. వైయక్తిక సామాజిక జీవన విలువల పతనోన్నతాల మధ్య పోరాటం. ఒక ఆదర్శాన్ని, ఉన్నత విలువల్ని సుప్రతిష్టించాలనే ఆరాటపు పోరాటం. క్రీడాకారునిగా, క్రీడా శిక్షకుడిగా, ప్రభుత్వ ఉద్యోగిగా తాను పొందిన అనుభవ సారాన్ని రంగరించి అందించిన సందేశం ఉంది. అదీ ‘‘క్రీడాస్థలి’’లో, ఆ సువిశాలమైన ‘‘మైదానం లోపలబయట’’ కారంగుల మనోహర్‌ అనే ఒక క్రీడాకారుని నవరసభరిత జీవితం ఉంది.
తన గురువు పాల్వంచ జునియర్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కొల్లి రామబ్రహ్మం కళాశాలలో బహిరంగ సభా వేదికపై నుండి ‘‘ఇతను సహజసిద్ధమైన క్రీడాకారుడు. మట్టిలో మాణిక్యం. రాష్ట్ర ఛాంపియన్‌గా అవతరిస్తాడు. ఆ బాధ్యత పూర్తిగా నాది.’’ అని చేసిన ప్రతిజ్ఞ కార్యసిద్ధి పొందేందుకు తనవంతు కృషి చేసిన ఒక శిష్యుని దీక్షా దక్షతల కథనం ఈ ఆత్మకథ. లక్ష్యనిబద్దులైన గురుశిష్యుల విజయగాథ ఇది. 1. క్రీడా కారునిగా.. సింథటిక్‌ ఉపరితలం, వివాహం 2. అథ్లెటిక్‌ శిక్షకుడిగా.. బదిలీ విధానం, డ్రగ్స్‌ వాడకం 3. జిల్లా క్రీడాధికారిగా (డియస్‌డిఓ)… క్రీడా అసోసియేషన్స్‌, రాష్ట్ర విభజన 4. రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌గా… ఎసిబి దాడి, గురుశిష్యులబంధం, ఇలా నాలుగు అధ్యాయాలుగా, ఒక్కో అధ్యాయంలో రెండేసి ప్రధానఅంశాలతో మనోహర్‌ఆత్మకథ నడిచింది.
‘‘నువ్వు గెలిచేవరకూ నీకథ ఎవరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. నీకథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి.’’ అంటూ రచయిత ఆత్మకథను ప్రారంభించారు.
భూర్గుంపహాడ్‌ బ్లాక్‌ స్థాయి పోటీల్లో 7 ఈవెంట్స్‌లో మొదటి స్థానంలో బహుమతులు గెలిచి బ్లాక్‌ ఛాంపియన్‌గా నిలిచారు. ఖమ్మం జిల్లాస్థాయి పోటీల్లో గెలిచి జిల్లా ఛాంపియన్‌ అయ్యారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో మొదటిసారి విఫలమైనా మరుసటి ఏడాది జరిగినపోటీల్లో ఒక బంగారుపతకం సాధించారు. రాష్ట్ర స్థాయిలో రెండు కొత్త రికార్డులను సృష్టించారు. మొత్తంగా నాలుగు పతకాలను కైవసం చేసు కున్నారు. జాతీయస్థాయిక్రీడల్లో కాంస్య పతకం సాధించారు. జాతీయక్రీడాకారుడిగా నిలిచారు.
బ్లాక్‌ స్థాయి క్రీడల నుండి ప్రారంభమై మూడు సంవత్సరాల అనంతరం హర్యానా రాష్ట్రం హిస్సార్‌లో జరిగిన జాతీయ క్రీడల వరకూ సాగిన తన క్రీడా ప్రస్థానపు గెలుపు వ్యూహాలను వైఫల్యాల కారణాలను అత్యంత ఆసక్తికరంగా విశ్లేష్ణాత్మకంగా వివరించారు. ఆయాసందర్భాలలో తనను వెన్నంటి ఉండిన పి.డి, కోచ్‌ల ప్రోత్సాహం, సహాయ సహకారాలు, తన విజయాల వెనుక వారి వ్యూహ రచనా చాతుర్యాలను సగౌరవంగా ఆవిష్కరించారు.
క్రీడాకారులపై సమాజంలో నాడున్న అపోహలు వాటి వెనుకనున్న కారణాలను సందర్భానుసారంగా ఆసక్తికరంగా వివరించారు. క్రీడా పోటీల విజయగాథలు చదివేప్పుడు మనం పాఠకులుగా కాక ప్రేక్షకులుగా మారిపోతాం. తన అనుభవాలను, అనుభూతులనూ అక్షరీ కరించే ప్రయత్నంలో రచయిత విజయం సాధించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా కోచ్‌గా, పదోన్నతుల అనంతరం ఉన్నత ఉద్యోగిగా తన అనుభవాలను చెప్తూ ఆ వ్యవస్థలోని లోటు పాట్లను లొసుగులనూ నిర్మోహమాటంగా చర్చించారు. ఈ వ్యవస్థలో నిజాయితీ, నిబద్ధతలకు అంకితమైన ఉద్యోగి చవిచూసిన అధికారుల విదిలింపుల, మందలింపుల చేదు అనుభవాలను, అవినీతి ఆరోపణలపై ఎసిబి విచారణ విషమ పరీక్షలను, అనుభవించిన క్షోభనూ, అనంతరం కడిగిన ముత్యంలా బయటపడ్డప్పుడు కలిగిన ఆనందాన్ని ఈ ఆత్మకథ కళ్ళకు కడుతుంది. అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడారంగంలోనూ దిగజారుతున్న విలువల పట్ల రచయిత ఆందోళన కనిపిస్తుంది. విలువలను నిలబెట్టుకోవలసిన బాధ్యతను రచయిత పదే పదే గుర్తు చేశారు.
గురుశిష్య సంబంధానికి గల ఔన్నత్యాన్ని నిలబెట్టటంలో మనోహర్‌ రచన ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే, తనలోని క్రీడాకారుని ప్రతిభను ప్రప్రథమంగా గుర్తించి, క్రమశిక్షణలో పెట్టి, సుశిక్షితుని చేసి బరిలో నిలిపి గెలిపిం చిన తొలి గురువు కొల్లి రామబ్రహ్మం గారికి తన ఆత్మకథను అంకితం చేశారు మనోహర్‌. తను దిద్దితీర్చిన తన ప్రియ శిష్యుడు యర్రా మాధవరావు ఈపుస్తకం వెలుగు చూడటంలో ప్రధాన భూమిక పోషించారు.
ప్రతి క్రీడాకారుడు, ప్రతి క్రీడా శిక్షకుడు, ప్రభుత్వ ఉద్యోగి కొని చదవవలసిన మంచి పుస్తకం ‘‘క్రీడాస్థలి’’.
` కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img