Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

కుటుంబ జీవనం`తండ్రి ఔన్నత్యం

మన దేశంలో పురాతన కాలం నుండి వివాహ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఉంది. పటిష్టమైన వివాహ వ్యవస్థ మంచి కుటుంబాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబ వ్యవస్థ అనగానే తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్లకి అనుసంధా నించిన ఇతర రక్త సంబంధీకులు భార్యాభర్తలే, పిల్లలకి జన్మనిచ్చాక తల్లితండ్రులుగా మారతారు. కుటుంబ వ్యవస్థలో తల్లిది అగ్రస్థానం. తండ్రిది ద్వితీయ స్థానం. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడటానికి వీళ్లిరువురే మూల బింధువులు. అందుచేతనే ‘‘మాతృదేశోభవ, పితృదేవోభవ’’ అని పెద్దలన్నారు. తల్లి అమృతమూర్తి. తల్లి మనసులో అమృతం నింపేవాడు తండ్రి.
మానవ సమాజం అనే పట్టాల మీద కుటుంబ జీవనమనే రైలు సజావుగా నడవడానికి భార్యాభర్తల పాత్ర ముఖ్యమైంది. అర్ధ శతాబ్దం ముందుకు వెళితే, తండ్రి సంపాదనపరుడుగాను, తల్లి ఆ సంపాదనతో సక్రమ మార్గంలో కుటుంబాన్ని నడిపించేదిగాను ఉన్న దాఖలాలు ఎక్కువగా కనిపిస్తాయి. తండ్రి విషయానికి వస్తే, తన కుటుంబానికి సంరక్షకుడుగా బాధ్యత వహించి, అవి నిర్వహించడంలో ఎంతో శ్రమని, కష్టాన్ని, ఇష్టంగా భరిస్తూ, భార్యా పిల్లలు ఆనందంగా ఉంటే చూసి, తనూ ఆనంద పారవశ్యంలో మునిగేవాడు. ఆ ఆనందంలో తాను పడ్డ శ్రమని, కష్టాల్ని మర్చిపోగలుగుతాడు. అటువంటి తండ్రిని, నిస్వార్థంగా ప్రేమించినప్పుడు, పిల్లలకి ఆ తండ్రి అత్యున్నత శిఖరాలపై దర్శనమిస్తాడు. తండ్రిలో అంతర్లీనంగా దాగిఉన్న ఎన్నో మంచి గుణాల్ని గమనిస్తారు పిల్లలు. బిడ్డలకి తండ్రి తోడు ఒక పవిత్రమైన అనుబంధం. తండ్రిని నిరంతరం ప్రేమించగలడా బిడ్డ. తండ్రి లేనప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలు అనునిత్యం నెమరు వేసుకునేలా చేస్తాయి. అటువంటి తండ్రి రూపం బిడ్డల మదిలో గూడు కట్టుకుని, నిరంతరం దర్శన మిస్తుంది. కవులు అయిన వాళ్లు, తండ్రితో పెనవేసుకుపోయిన అనుబంధాల్ని కవిత్వంలో చెప్పటం జరుగుతా ఉంది. గత రెండు దశాబ్దాలుగా కొందరు కవులు వాళ్ల తండ్రులతో గల అనుభవాల్ని, అనుభవించిన అనుభూతుల్ని కవిత్వీకరిస్తా ఉన్నారు. తండ్రిని గురించి అనేక రకాలుగా విశ్లేషణలు చేయవచ్చు. అయితే, కుటుంబ జీవితంలో తండ్రి యొక్క ఔన్నత్యం ఏ విధంగా ఉంది అనే దానిమీద కొంతమంది కవులు ఏమి చెప్పారో చూద్దాం.
‘‘నువ్వు కడుపు గట్టుకొని సాచిన
బక్క నాయిన్నను
ఈ రక్త మాంసాలు, శక్తి సామర్థ్యాలు నీవి
నేను నేర్చింది ఎన్ని భాషలైనా
‘బాపూ’ అన్న పదానికున్న
విస్తృతిని కనుక్కోలేకపోతున్నాను’’
తండ్రి పట్ల తనకున్న ప్రేమని, అద్భుతమైన అనుభూతిని డా॥నలిమెల భాస్కర్‌ ‘బాపూ’ అనే కవితలో ప్రకటించిన తీరు గమనించే ఉంటారు. తండ్రి అనే పదానికున్న విస్తృతి ఎంతటిదో! ఎంత గొప్పదో! తల్లితో పాటు తండ్రి కూడా బిడ్డలకి ప్రత్యక్ష దైవం. బిడ్డలను ఎలా తీర్చిదిద్దాలో తండ్రికి బాగా తెలుసు.
తండ్రి అంటే బీటలు వారిన నేలపై కురిసిన చినుకు. తండ్రిలోని గొప్పతనం చెప్పటానికి మాటలు ఏమి సరిపోతాయి. ‘ఎవరు నాయినా’ అనే కవితలో హనీఫ్‌ ఏమన్నారో చూడండి.
‘‘ఇంట్లో పిల్లలతో పాటు పెరుగుతున్న బాధ్యతలు
చేలో పక్షులు
ఎక్కడ నిద్రపోనిచ్చాయి
బీటలు వారిన నేలపై చినుకతడు’’
ఎండి, బీటలు వారిన పొలంలో వర్షం కురిస్తే, ఆ నేలకి ఎంత సంబరమో, ఎంత విలువో, ఒక కుటుంబానికి యజమానిjైున తండ్రి, అంత విలువైన వాడు. మరొకటి ‘‘నాయనంటే ఎప్పటికీ పూరించలేని మహా కావ్యం దండలో కనిపించని దారం నాయన’’ ‘కంటిచూపు’ అనే కవితలో జూలూరి గౌరీశంకర్‌ అన్న మాటలివి. కుటుంబ వ్యవస్థలో అనేక పనులకు మూలాధారమైన వాడు ‘తండ్రి’. తన కుటుంబం కోసం చేసేది ఏదైనా పూలదండలో దాగిన దారం మాదిరి కనిపించదు. తండ్రి శ్రమజీవి. ఉదయం నుండి రాత్రి వరకు తన భార్యాబిడ్డల కోసం శ్రమిస్తాడు. ఆ శ్రమ ఫలితంలో ఆ కష్టాన్నంతా మర్చిపోతాడు. ఒక కవితలో గుంటూరు ఏసుపాదం ఇలా అంటారు. ‘‘చీకటి గర్భాలు దున్ని సూర్యుళ్లని కుళ్లగించి ఏ పూటకాపూట ఉదయాలు సృష్టించిన వాడు’’ ఉదయం ప్రగతికి ప్రతిబింబం. అటువంటి ప్రగతి సాధకుడైన తండ్రి ఎప్పుడూ స్మరించ తగిన వాడే కదా! ఉదయాలు సృష్టించినవాడు అనడంలో తండ్రికున్న గొప్పతనం బహిర్గతమౌతుంది. తండ్రి మది లోతుల్ని తాకడం చాలా కష్టమైన పని. బిడ్డలని ప్రయోజకులుగా చేయడానికి, వాళ్లు నడిచే దారిలో ఉన్న ముళ్ల డొంకల్ని కష్టమైనా, అంటే ఆ ముళ్లు తన చేతులకి గుచ్చుకుపోతున్నా సరే, వాటిని తొలిగించి, మార్గాన్ని సుగమం చేస్తాడు. అందుకు ఉనాహరణగా శ్రీకంచరాన భుజంగరావు ‘చెమట పూలచెట్టు’ లో కొన్ని పంక్తులు చూద్దాం. ‘‘తన రెక్కల కష్టంతో శ్రమ సోపానాల మీదుగా బిడ్డని ప్రయోజకత్వ శిఖరాలను చేర్చేందుకు ముళ్ల కంపల కొండపై గాటిని తొలిచే కత్తి’’ ముళ్ల కంపలున్న కొండ మీద నడవడానికి రహదారిని తొలిచే కత్తి వంటివాడు తండ్రి అంటాడీయన. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తండ్రిలోని నిగూఢమైన ప్రేమని, తపనని, కార్యదక్షతని గూర్చి అనేకమంది కవులు అనేక విధాలుగా వారి వారి అనుభవాల్ని చెప్పడం జరిగింది. తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం గనుక చివరిగా దోర్నాదుల సుబ్బమ్మ చెప్పిన విషయంతో ముగిస్తాను. ‘‘తండ్రులే లేకపోతే తల్లులు తలలేని మొండాలుగా మిగుల్తారు తప్పించి తరిగిపోని ప్రేమ శిఖరాల్లా ఎలా నిలబడగలరు... నాకు తెల్సి తండ్రే ఈ జీవ మానవ శాశ్వత జ్ఞాపిక తండ్రి బతుకు నిస్వార్థపు వారధి’’ ఇందాక చెప్పుకున్నాం. తండ్రికి, తన కుటుంబం పట్ల నిస్వార్థమైన ప్రేమానురాగాలు ఉంటై. వాళ్ల భవిత కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు. తండ్రి బతుకు, అతనికి అతని కుటుంబ సభ్యుల నడుమ అదృశ్య వంతెన. ఆ వారథిపై ఎవరు పయనించినా ఆత్మీయతను పంచటం తప్ప, ఏవిధమైన సుంకాలు ఉండవు. తండ్రి తపన ఎల్లప్పుడూ భార్యాబిడ్డల భవిష్యత్తు కోసమే.
`ఎస్‌.ఆర్‌.పృథ్వి, సెల్‌: 9989223245

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img