Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

చావెరుగని ‘‘చిరంజీవి’’!

మందలపర్తి కిషోర్‌

సాధారణ రచయితల రచనలు గాలివాటంగా బతికి, మరుపున పడిపోతుంటాయి. బాతాఖానీరాయుళ్ళ రచనలు వేడివేడి పల్లీ బఠానీల్లా కాలక్షేపానికి బాగానే పనికిరావచ్చుకానీ, ముందుపేజీలో ఏం చదివామో పక్కపేజీకి వచ్చేసరికే మర్చిపోతుంటాం మనం! కానీ గొప్ప రచయితల రచనలు అలాకాదుÑ అవి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనల్ని వెంటాడతాయి! అలాంటి రచనలు మాత్రమే నాలుగు కాలాల పాటు నిలుస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే కనక, విస్తృతంగా వివరించుకోనవసరం లేదుగానీ రెండుముక్కల్లో ప్రస్తావించుకుని పక్కనపెడదాం! మామూలు రచయితల రచనల్లో ప్రాణంలేని పాత్రలుంటాయిÑ మంచిరచయితల రచనలలో మాత్రమే రక్తమాంసాలున్న మనుషులుంటారు! సాదాసీదా రచయితల రచనల్లో నాటునాటకీయత వుంటుందిమంచి రచయితల రచనల్లో మాత్రమే జీవితవాస్తవం వుంటుంది! సాహిత్య విద్యార్థులందరికీ తెలిసిన సామాన్యమైన విషయాలే ఇవి!! నాలుగు కాలాలపాటు నిలబడివుండి, చదువరులకు దారిదీపాలుగా వుపయోగపడిన ఏ రచనతీసి చూసినా ఈ విషయం బోధపడుతుంది. మీకు ఇంకా సులువయిన మార్గమొకటి చెప్తాను అట్లూరి పిచ్చేశ్వర్రావు కథలు ఒక్కసారి చదివిచూడండి! కనీసం, చిరంజీవి అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన ‘‘బ్రతకడం తెలియనివాడు’’ అనే ఒక్క కథానిక చదవండిచాలు! ఇది, ఒకరకం, ఆత్మకథాత్మక కథనం! ఈమాట నేనన్నదికాదుపిచ్చేశ్వర్రావును క్షుణ్ణంగా తెలిసిన కొడవటిగంటి కుటుంబరావు చెప్పినమాట! ‘‘మనిషితోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే, ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుం’’దన్నారు కుటుంబ రావు. పిచ్చేశ్వర్రావు కన్నుమూసిన తర్వాత సంవత్సరానికి, ‘‘పిచ్చేశ్వర్రావు కథలు’’ పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్న మాటలివి! ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ, పిచ్చేశ్వర్రావులో ‘‘అదేదో’’ మిగిలేవుం దింకా ఆయన రచనల్లో దాన్ని మనం చూడొచ్చు!! పందొమ్మిదివందల ఇరవై దశకంలో పుట్టిన రచయితలతరంలో కనిపించే విశిష్టతలన్నీ అట్లూరి పిచ్చేశ్వర్రావులోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి అవే పిచ్చేశ్వర్రావుకు అమృతత్వం ఆపాదించాయనిపిస్తుంది! జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఈతరం విశిష్టమైన స్వరాన్ని సమకూర్చుకుంది. ఎక్కడో, అమెరికాలో వయోజనులందరికీ సార్వజనీనమైన వోటుహక్కు కల్పించడాన్నిమొదటి ప్రపంచయుద్ధంలో చావుతప్పి, కన్నులొట్టబోయిన బ్రిటిష్‌వలసవాదం ఒక్కొక్కటిగా ఆఫ్రో ఆసియా దేశాలకు స్వాతంత్య్రం ప్రకటిస్తూ రావడాన్ని జపాన్‌ భూకంపాన్నిడార్విన్‌చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని పాఠశాల విద్యార్థులకు బోధించిన ‘నేరానికి’ జాన్‌ స్కోప్స్‌ అనే బ్రిటిష్‌ టీచర్‌కి శిక్షపడడాన్ని చాలాదేశాల్లో స్టాలిన్‌, ముసోలినీ, హిట్లర్‌, చర్చిల్‌ తదితర కండబలం కలిగిన నేతలు రంగం మీదికి రావడాన్నిఆర్థిక మాంద్యాన్ని చర్చిల్‌ తెచ్చిపెట్టిన బంగాల్‌ కరువునూపర్ల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడిని రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న దశలో అమెరికా హిరోషిమాపై చేసిన పరమాణుబాంబు దాడినిభారతదేశంతో పాటుగా అనేక మూడోప్రపంచ దేశాలు వరసగా స్వతంత్రం కావడాన్ని ఈతరానికి చెందిన రచయితలు తమ పెరుగుదలలో భాగంగా గమనిస్తూ, అనుభవిస్తూ వచ్చారు. అవి వాళ్ళకు రక్తగతమైపోయాయి! తెలుగు విషయానికి వస్తే కందుకూరి గురజాడ గిడుగు అందించిన ఆధునిక స్ఫూర్తి అభ్యుదయ దృక్పథానికి మూడో కన్నులా ఉపయోగపడిరది!!
ముఖ్యంగా బ్రిటిష్‌ వలస పాలకులకు తమ మాన సంరక్షణార్థం భారతదేశ స్వాతంత్య్ర ప్రకటనను తక్షణ అవసరంగా మార్చిన రాయల్‌ ఇండియన్‌ నేవీ (ఆర్‌ఐఎన్‌) పితూరీ అనే చరిత్రాత్మక తిరుగుబాటు అభ్యుదయ రచయితల, ప్రగతిశీల కళాకారుల నెత్తురును వేడెక్కించింది. 194553 మధ్యకాలంలో నేవీలో పనిచేసిన పిచ్చేశ్వర్రావు అయిదురోజులు సాగిన ఆ తిరుగు బాటులో స్వయంగా పాల్గొన్నవారు! అంచేత, పిచ్చేశ్వర్రావుపై దాని ప్రభావం మరింతగా వుండడం సహజమే! కుటుంబరావు ముందుమాటలో ప్రస్తావించిన కథానిక ఈ తిరుగుబాటు గురించినదే. ఈ సంఘటనను చిత్రిస్తూ చిత్తప్రసాద్‌ వేసిన చిత్రం సుప్రసిద్ధం అలాగే, ఇదే సందర్భంగా సలిల్‌ చౌదరీ రాసి, స్వరబద్ధంచేసిన గీతంకూడా ప్రసిద్ధమే! చిత్రమేమిటంటే కరాచీ నుంచి కోల్‌కతా వరకూ జరిగిన ఈ తిరుగుబాటును ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఖండిరచాయిÑ తిరగబడ్డ నావికులు మాత్రం తమ అధీనంలోకి వచ్చిన 78నౌకలపై కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, కమ్యూనిస్ట్‌ పార్టీల జెండాలు ఎగరేశారు!! అంతేకాదు తిరుగుబాటుదార్ల తొలి డిమాండే, దేశం లోని రాజకీయ ఖైదీలనందరినీ తక్షణమే విడుదల చెయ్యాలనేది! రెండో డిమాండ్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులందరినీ వెంటనే విడుదల చెయ్యాలని! సంకుచిత, తక్షణ రాజకీయ ప్రయోజనాలకు అతీతమయిన చైతన్యం ప్రదర్శించిన నావికులనుచూసి, ఆనాటి బ్రిటన్‌ప్రధాని క్లెమెన్ట్‌ అట్లీ దిగొచ్చాడంటే వింతేముంది? ఈ తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్న పిచ్చేశ్వర్రావు ఎందరో ‘చిరంజీవుల్ని’ కళ్ళారా చూసే వుంటారు! 1948 వరకూ స్వతంత్ర భారత్‌ పాక్‌ దేశాల్లోని బ్రిటిష్‌ సేనలన్నింటికీ సుప్రీం కమాండర్‌గా పనిచేసిన ఒకనాటి కమాండరిన్‌ చీఫ్‌ ఆచిన్‌లెక్‌ ప్రసంగించనున్న వేదిక పైనే ‘క్విట్‌ ఇండియా!’,‘రివోల్ట్‌ నౌ!’ స్టిక్కర్లు అతికించిన 22ఏళ్ళ సాహసి బీ.సీ.దత్‌లాంటి వ్యక్తుల కథల ప్రాతిపదికపైనే ‘‘బ్రతకడం తెలియనివాడు’’ కథానిక పుట్టివుంటుంది. చిరంజీవి మాదిరిగా దత్తును ఎవరూ కాల్చిచంపకపోయినా, ఆయన నోటికాడకూడు పడగొట్టి అంతపనీచేశారు మన జాతీయ నాయకమ్మన్యులు!! పిచ్చేశ్వర్రావులాంటి అభ్యుదయ రచయితలు ఇలాంటి పోకడలను నిర్లిప్తంగా చూస్తూవుండలేరు మరి! కృష్ణాజిల్లాలోని సాదాసీదా పల్లెటూళ్ళోని సామాన్య రైతుకుటుంబంలో పుట్టి, ఇంటర్మీడియట్‌ చదివి, హిందీ భాషలో విశారద పట్టం పొందిన పిచ్చేశ్వర్రావు నేవీలో ఏడెనిమిదేళ్ళు పనిచేశారు. ఆ తర్వాత విశాలాంధ్ర దినపత్రికలో దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు. అదే సమయంలో ఆయన ఎన్నో ప్రసిద్ధ రచనలను హిందీ నుంచి తెలుగు లోకి అనువాదం చేశారు. ప్రేమ్‌చంద్‌ సుప్రసిద్ధ నవల ‘‘గోదాన్‌’’నూ, కిషన్‌ చందర్‌ రాసిన అద్భుత వ్యంగ్య నవల ‘‘ఒకానొక గాడిద ఆత్మకథ’’నూ ఇల్యా ఎఖ్రెన్‌బుర్గ్‌ రచన ‘‘పారిస్‌ పతనం’’ తదితర రచనలనూ ఆయనఅదే కాలంలో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. మరెన్నో రచనలనూ, మరెందరో రచయితలనూ పిచ్చేశ్వర్రావు తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. 1955 మధ్యంతర ఎన్నికల తర్వాత మద్రాసుబాట పట్టిన అనేకమంది అభ్యుదయ రచయితల దారిలోనే, 1960కి అటూ ఇటూగా పిచ్చేశ్వర్రావు సినీరంగప్రవేశం చేశారు. ‘ఇల్లరికం’, ‘నమ్మినబంటు’, ‘చివరకు మిగిలేది’, ‘భార్యాభర్తలు’, ‘వాగ్దానం’, ‘బాటసారి’, ‘ఆత్మబంధువు’, ‘వివాహబంధం’ తదితర చిత్రాలకు రచన చేశారు. సినిమా రంగంలో అభ్యుదయ రచయితలకు ఆత్మతృప్తి కలిగే సందర్భాలు అరుదుగానే వుంటాయి. అది ఫక్తు వాణిజ్యరంగం! అక్కడ వాణిజ్య విలువలు తప్ప మరే విలువలూ చెలామణీ కావు!! పిచ్చేశ్వర్రావు లాంటి వ్యక్తులు అలాంటి చోట కూడా తమకు ఆత్మతృప్తినిచ్చే రచనలు చేసేందుకు యత్నిస్తారు. ‘‘గౌతమ బుద్ధ’’, ‘‘కందుకూరి వీరేశలింగం’’ లఘు చిత్రాలకు స్క్రిప్ట్‌ సమకూర్చడం అందులో భాగమే! కథకుడిగానూ, అనువాదకుడిగానూ, స్క్రిప్టు రచయితగానూ పిచ్చేశ్వర్రావు చేసిన కృషి చూస్తే ఆయన శక్తిసామర్ధ్యాల గురించి అంచనా వేసుకోవడం కష్టం కాదు. ముఖ్యంగా, సినిమా స్క్రిప్టు ఆధారంగా రూపొందించే ‘వెండితెర నవల’ అనే ప్రక్రియనుబహుశాతొలిసారి జయప్రదంగా నిర్వహించిన పిచ్చేశ్వర్రావు తర్వాతి రోజుల్లో ఈ రంగంలో వచ్చిన అనేక ప్రయోగాలను కూడా సుసంపన్నం చేసివుండేవారు. 1950 దశకంలోనే అకిర కురసావా రూపొందించుకున్న ‘‘సెవెన్‌ సమురాయ్‌ షూట్‌ రెడీ స్క్రిప్ట్‌’’ ను యథాతథంగా అచ్చువేస్తే, కొత్తతరం పాఠకులు దాన్ని నవల చదువుకున్నట్టు చదువుకున్నారట! దాదాపు నలభయ్యేళ్ళతర్వాత తెలుగులోకూడా అలాంటి ప్రయోగాలు జరిగాయి. ‘‘అత్యధిక సర్క్యులేషన్‌’’గల వ్యాపార పత్రికలే వాటిని అచ్చువేసుకున్నాయి కూడా. సాహిత్య ప్రక్రియల రూపాలను దేశకాల పరిస్థితులు ప్రభావితం చేస్తాయనే ప్రాథమిక సత్యం తెలియనివాళ్ళు వెండితెర నవల లాంటి ప్రయోగాలు జయప్రదంగా చెయ్యలేరు! పిచ్చేశ్వర్రావుకు అలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుననడానికి ఆయన రాసిన వెండితెర నవలలే నిదర్శనం. అన్నిటికీమించి పిచ్చేశ్వర్రావు జీవితానుభవం ఆయన చేత మరెన్నో మంచి రచనలు చేయించివుండేదని అనిపించడం ఖాయం. కానీ, అలాంటి అరుదయిన రచయిత నుంచి తెలుగు భాషకు జరగాల్సినంత సేవ జరగక ముందే పిచ్చేశ్వర్రావు కన్నుమూయడం ఓ విషాదం! ఆయన పోవడానికి నాలుగేళ్ళు ముందు పుట్టిన ప్రముఖ రచయిత ఛుక్‌ పలాఖ్నుయిక్‌ అన్నట్టుగా, ‘‘మనమందరం పోయేవాళ్ళమేÑ జీవితానికి లక్ష్యం కలకాలం బతకడం కాదు` అలా బతికే దాన్ని సృష్టించడమే మన లక్ష్యం!’’ పిచ్చేశ్వర్రావు ఆ పని చేయగలిగారనడంలో సందేహంలేదు. నలభైయేళ్ళ నడిప్రాయంలో, గుండె జబ్బుతో ఆయన కన్నుమూసి నిన్నటికి యాభయ్యయిదేళ్ళు పూర్తయింది!!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img