Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

తాత్విక ప్రయాణికుడు గుర్రం జాషువ

`రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సెల్‌: 9440222117

‘‘కవినిగన్నతల్లి గర్భంబు ధన్యంబు’’ గుర్రం జాషువ (18951971) జన్మించి 126ఏళ్లు, మరణించి 50ఏళ్లు పూర్తయ్యాయి. జీవించిన డబ్బైఆరేళ్లలో 50ఏళ్లు రచనా జీవితం గడిపారు. ఆయన రచనా జీవితం ఒక గొప్ప ప్రయాణం. ‘‘హిమధామార్కధర పరిణయము’’ (1917) మొదలైన ఆయన రచనా ప్రస్థానం‘‘తన వీలునామా’’ (1968) తో ముగిసింది. ఈ మధ్యకాలంలో ఆయన దాదాపు 36 రచనలు చేశారు. ఆయన రచనలలో నవల, నాటికలు, కొన్ని సినిమా రచనలు ఉన్నా, ఆయన ప్రధానంగా కవి. తాను కవినన్న స్పృహ ఆయనలో బలంగా ఉంది. సంఘసంస్కరణ, స్వాతంత్య్ర సమరకాలంలో కవిగా పుట్టుకొచ్చిన జాషువ మొదట 191725 మధ్య కొన్ని పౌరాణిక కావ్యాలు రాశారు. భారతీయ సమాజంలో ఇరవయ్యవ శతాబ్దం తొలినాళ్లలో కవులుగా ఎదిగొచ్చిన వాళ్లంతా మొదట పౌరాణిక రచనలే చేశారు. 1926లో ‘శివాజి’ కావ్యరచనతో జాషువ ఆధునిక మార్గంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా సామాజిక కావ్యాలే రాశారు. పిరదౌసి (1932) ముంటాజమహలు (1943) క్రీస్తు చరిత్ర (1963)వంటి చారిత్రక పౌరాణిక కావ్యాలు పోగా తక్కినవన్నీ సాంఘిక కావ్యాలే. స్వప్న కథ, అనాథ (1934) గబ్బిలం (1941, 1946) కాందిశీకుడు (1945) నేతాజీ (1947) బాపూజీ (1948) అశ్రుమంజరి (1948) స్వయంవరం (1950) రాష్ట్ర పూజ (1953) కొత్తలోకము (1967) నా కథ (1962) ముసాఫరులు (1963) నాగార్జున సాగర్‌ (1966) వంటి బలమైన కావ్యాలతో ఆధునిక తెలుగు కవిత్వానికి జవజీవాలు అందించారు జాషువ. వీటికి తోడు 1937` 1945 మధ్య ఏడు సంపుటాలతో 200లకు పైగా కవిత్వ ఖండికలు విభిన్న సందర్భాలలో రచించారు. ఆయన కావ్యాలన్నీ ఒక ఎత్తయితే, ఈ ఖండికలు మరో ఎత్తు.
జాషువ కవిత్వం ఆకలి ముప్పైల నుండి, నియమోల్లంఘనోద్యమం నుండి శ్రీకాకుళం గిరిజన పోరాటం దాకా ఉన్న సామాజిక చరిత్రను కవిత్వ రూపంలో ఆవిష్కరిస్తుంది. సామాజిక పరిణామాల నేపథ్యంలో జాషువ కవిత్వం చదివితే ఆయన కవిత్వానికుండే సామాజిక స్వభావం తెలుస్తుంది. మొదట్లో జాషువ తాత్వికంగా ఆస్తికుడే. దైవ విశ్వాసం బలంగా ఉండేది. అందుకే పురాణ కథలు కావ్యాలుగా రాశారు. అంతేకాదు సాంఘిక కావ్యాలలో కూడా ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. ‘అనాథ’ అనే తొలి తెలుగు దళిత మహిళా కావ్యంలో ‘‘నలువసేయు విలాసము’’ ప్రస్తావన చేశారు. దళిత బిచ్చగత్తె చంకలో బిడ్డను పెట్టుకొని అడుక్కుంటూ ఉంటే, ఎవరో సైకిలుతో గుద్దుతారు. తల్లీబిడ్డ కిందపడతారు. బిడ్డకు దెబ్బలు తగలవు. తల్లికి గాయాలవుతాయి. అప్పుడు కవి
ఓయి! నాస్తికుడా! విను మొక్కమాట
అరసియుందువు ఘోర దృశ్యంబు నిచట
మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు
శిశువునే మహాశక్తి రక్షించెనోయి
అని నాస్తికులను ప్రశ్నించారు. ‘‘పరమేశు విలాసమ్ములు కరముదు రుహ్యములు’’ అన్నారు.
పరమేశ్వరుడు లేడా
నరుండు నరునుద్దరించునా! వెఱిదానా!
అని చెప్పించారు. జాషువలో ప్రశ్నించే గుణం మొదట నుంచీ ఉన్నా, దానితో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం చాలాకాలం ఆయనను నడిపించింది. ‘గబ్బిలం’ లో అస్పృశ్యతను ఖండిస్తూనే, గబ్బిలంతో సందేశాన్ని శివునికి పంపించడం ఇందుకు నిదర్శనం. ‘గబ్బిలం’ లో కర్మ సిద్ధాంతాన్ని నిలదీసినా శివుని నిందించలేదు. గబ్బిలంతో
వెఱవనేల నీకు విశ్వనాథుమ్రోల
సృష్టికర్త తాను, సృష్టి వీవు
అని అనటంలోనూ ఈ లక్షణమే కనిపిస్తుంది. గబ్బిలం రెండవ భాగంలో జాషువలో తాత్వికంగా వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఏనాడు మా బుఱ్ఱలు, జుట్టుతల లేని పుక్కిట కథలలో జిక్కువడవొ అని మార్పును కోరుకున్నారు. ‘‘నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చే వింత ధర్మాన్ని ప్రశ్నించారు. హిందుత్వంలోని అసంబద్ధతను ప్రశ్నిస్తున్న జాషువకు ఏసుక్రీస్తులో విశ్వాసం సన్నగిల్లలేదు. గబ్బిలం రెండవ భాగం రాసే నాటికే (1946) జాషువలో తాత్వికంగా మార్పు వచ్చి దైవ అవతార సిద్ధాంతాన్ని అధిక్షేపించారు.
ఇక ఇక్కడ నుంచి అవకాశం వచ్చినప్పుడంతా దాదాపు రెండు దశాబ్దాలు ఈ ప్రశ్నించే తాత్వికతను జాషువ కొనసాగించారు.
‘‘కాందిశీకుడు’’ కావ్యం రెండో ప్రపంచ యుద్ధ కావ్యంలో జాషువ రాసిన కావ్యం. యుద్ధ కాలంలో బర్మా నుంచి బయటికి వచ్చిన ఒక సైనికునికి, ఒక బౌద్ధ కపాలానికి మధ్య జరిగిన సంభాషణ ఈ కావ్యం. ఈ బౌద్ధ కపాలాన్ని ఎన్నుకోవడంలోనే జాషువ తాత్విక పరిపక్వత కనిపిస్తుంది. బౌద్ధం మానవ ధర్మం కావడమే ఇందుకు కారణం.
స్వర్గనరకాలు రెండు నీ జగతి యందె
నరుడు సృష్టింపగలడని నమ్మగలను
అని మానవుని చరిత్ర నిర్మాతగా ప్రతిపాదించింది బౌద్ధ కపాలం.
‘నేతాజీ కావ్యం’ లో సుభాస్‌చంద్రబోస్‌కు కనిపించిన భరతమాత దేశంలోని వర్తమాన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తుంది. ఆ సందర్భంలో విగ్రహాల రూపంలో దేవుళ్ల కిచ్చిన ప్రాధాన్యం కంటికి కనిపించే మనుషులకు ఇవ్వకపోవడాన్ని ఆమె ప్రస్తావిస్తుంది.
గాంధీజీ హత్య జరిగినప్పుడు, జాషువ తీవ్రంగా వేదనపడ్డారు. శోకించారు. ఆ బాధలో
భరతభూమినింక భగవంతుడుండునా
దేవళంబు లుత్త తిత్తులయ్యె
అని ఆక్రోశించారు. ఇది ఉద్వేగభరిత, బాధాతప్త ఉద్వేగమేగానీ తాత్వికంగా తిరుగుబాట పట్టడం కాదు. ఈ కావ్యంలోనే మతం పేరు జరిగే అమానవ కర్మకాండను జాషువ విమర్శించి తన భౌతిక తాత్వికతను చాటుకున్నారు.
గుళ్లు గోపురాల కొఱకు చందాలెత్తి
పొట్టబోసికొనుట పుణ్యమగునె
అన్నమునకు నీటి కంటు జాడ్యంబున్న
చుప్పనాతి మతము గొప్పదగునె
అని ప్రశ్నించారు. మానవ ముఖం కోల్పోయిన ఏ అంశాన్నీ జాషువ ఉపేక్షించకుండా విమర్శించారు. ఈ ధోరణి జాషువ తాత్వికతా ప్రయాణంలో క్రమంగా బలపడిరది. భారతదేశం అస్పృశ్యతా జాడ్యం మీద అవకాశం వచ్చినప్పుడంతా జాషువ అస్పృశ్యతకు తాత్వికంగా మతానికీ ఉన్న సంబంధాన్ని ప్రస్తావించి విమర్శిస్తూ వచ్చారు! ‘బాపూజీ’ కావ్యంలోనూ ఈ పని చేశారు.
దళకోటి పంచముల దు
ర్దశకై కన్నీటి చుక్కరాల్పని వేల్పులో
దశలక్షవేల? వెన్నుని
దశావతారంబు లేల? ధర్మములేలా?
ఈ ప్రశ్నలో జాషువ కంఠస్వరం,దానిలో దాగిన ఆయన తాత్వికతా పరిణతి ప్రస్ఫుటంగా ధ్వనిస్తున్నాయి. 1957నాటి ‘కొత్తలోకము’ కావ్యం రాసేనాటికి జాషువకు 60ఏళ్లు దాటాయి. అనేక సామాజిక ఉద్యమాలను ఆయన చూశారు. అంబేద్కర్‌ ఉద్యమాన్ని చూశారు. మానవ ధర్మమైన బౌద్ధాన్ని అంబేద్కర్‌ స్వీకరించడమూ గమనించారు. ‘‘కొత్త లోకము’’ ‘‘తొలికోర్కె’’ లో దేవుని అనేక రకాలుగా ప్రశ్నించారు. ‘‘కనుపడవేమిర జగము కల్పన చేసిన గారడీడ’’ అని అధిక్షేపించారు. దేవుడు ఉన్నది నిజమైతే తనకు కనపడమని డిమాండ్‌ చేశారు. దేవుని సృష్టిగా ప్రచారంలో ఉన్న వ్యవస్థను విమర్శించారు.
భగవంతుడు ఉన్నాడని నమ్మే భక్తులు తనువులు కోసి వేడి నెత్తురుతో అనాదిగా అర్చనలు చేస్తుంటే దర్శనం ఇవ్వనివాడు ‘‘నిన్నసలుసందేహించుచుక నమ్మిన నమ్మని మా బోంట్లను లెక్కసేయుదువె’’ అని అన్నారు. జాషువ కాంగ్రెస్‌ పాలనలో ఉంటూ, గాంధీజీని స్మరిస్తూ ఉన్నా ఆయన తాత్వికత క్రమక్రమంగా పదునెక్కింది. అది భౌతికవాద తాత్వికత. తన కాలంనాటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాటాన్ని చూశారు. కమ్యూనిస్టులు నిర్వహించిన అనేక ఉద్యమాలను గమనించారు. ‘‘కొత్తలోకము’’ కావ్యంలో వామపక్ష ప్రశంస చేయడానికి ఆయన సంకోచించలేదు.
నాస్తికుల సామ్యవాదుల
మస్తిష్కము నందు పతిత మానవతతికిన్‌
గాస్త జగా కలదేమో
నాస్తి సుమి కరుణకేది కాలం గృతులన్‌
మరణించే నాటికి జాషువ పూర్తిగా భౌతికవాది అయ్యారని ఆయన అల్లుడు లవణంగారు ఒకసారి నాతో అన్నారు. జాషువ ఒక తాత్విక ప్రయాణికుడు. భావవాదం నుండి భౌతికవాదం వైపు ఆయన ప్రయాణించారు. కవిత్వాన్ని తన తాత్విక ప్రయాణానికి వాహికగా చేసుకున్నారు. భౌతికవాదులుగా ఉండి జీవిత అవసాన దశలో భావవాదులుగా మారిన రచయితలు తెలుగులో కొందరున్నారు. జాషువ దానికి భిన్నమైన కవి. ఆయన ప్రయాణం శాస్త్రీయమైది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img