Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నిర్మాణ బ్రమ్మలు

ఈ రాత్రి…
అక్కడ ఆకలి పరిశ్రమిస్తుంది…
విరామ మెరుగని చెమట ఓ నిర్మాణానికి రూపు కడుతోంది.
మింటిపై పూచిన చందమామ…
ముక్కడ్డీ పనితో ఉడుకుతున్న ఒంట్లోకి
వెన్నెలై చల్లగా ఇంకుతుంది…
తీరని వెలుతురు దప్పికతో
రెక్కలూడి రాలిపోతున్న దీపపు పురుగులు…
నడిరాత్రి నిశ్శబ్దాన్ని నిర్దమిగా కోస్తున్న కాంక్రీట్‌ మిక్సర్‌…
ఎంత ఒంగినా విరగని సరుగుడు పూటీలా
సిమెంట్‌ కట్టల కింద బక్క భుజాలు…
నెత్తిన గమేళాలతో భారంగా కదులుతున్న రాత్రి…
అక్కడి బతుకు పోరాటాన్ని
పరిహసిస్తున్నట్లు సుఖ నిద్రలో చుట్టూ భవంతులు…
లోకాన్ని నిద్రపుచ్చి… వారికి మాత్రమే మెలకువనిచ్చి
సిమెంటు గురువులపై వారిని బండ బారిస్తున్న రాత్రి…
వారు…
‘తాపీ’ ని మూడో చేతిగా తొడిగినవారు…
పుడమి గర్భంలో పునాదుల్ని ప్రతిష్టించిన వారు…
ఆలయాలకు హంగులద్దినవారు…
రాజప్రసాదాలకి దర్పాణ్ణి పొదిగిన వారు…
కట్టడాలని మహాకావ్యాలుగా రచించినవారు…
ఈ దేశపు నిరావాసానికి గూడును కట్టినవారు…
ఎవరికీ పట్టని వారు…
ఏ సంక్షేమాల్లోనూ చోటు దక్కని వారు…
సేద తీరడానికి పిట్టగోడైన ఆసరా లేనివారు…
కష్టాల ‘మూలమట్టం’ నుంచి
గీత మాత్రమైనా దిశను మార్చుకోలేని విధి వంచితులు…
ఎన్ని కన్నీటి కడల్నైనా కలుపుకోగల నేత్ర సముద్రాలు…
భవన నిర్మాణ బ్రమ్మలు వారు…
శ్రమ భాషలో…
ఇసుక రేణువులతో ఊసులాడుతుంటారు.
‘ఇటుక’లతో ఆప్తమై వెతల్ని కలబోసుకుంటారు…
ఇనప గజాల బిగువులో
తమ జీవనగాధల్ని శృతి చేసుకుంటారు.
కండలు కోరుకుపోయినా
పిక్కరాళ్ల మొనల మీద ఆరి పాదాలు రక్తాపోరులైనా…
ముద్ద పెడుతున్న సిమెంట్‌ బుగ్గంటే వారికి కృతజ్ఞత…
పగలనకా…రాత్రనకా కాంక్రీట్‌ బురదలో కలదిరిగి
బతుకును తొలగకరించుకునే స్పృహ వారిది…
భవన నిర్మాణమే వారి భుజము పై జీవనాయుధం…
నిబ్బరం కోల్పోని ఓ తాత్విక దృక్పథం…
`కలమట దాసుబాబు, సెల్‌: 8096703363

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img