Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కర్షకుడి జీవనగానమైన కవిత్వం

అతడు దేశపు తిమిరాన్ని సంహరిస్తూ నిరంతరం సుభిక్షపు వెన్నెలను కురిపించే చంద్రుడు. పల్లె జీవన సౌందర్యానికి నగిషీలు చెక్కే శిల్పకారుడు. పచ్చదనాలు కల్పోతూ వసివాడే పొలాలకు వసంతాల ఊపురులూదే శస్త్రకారుడు. నిదురించే మట్టిని తట్టిలేపుతూ జన జీవన బీళ్లలో ఆనంత ప్రవాహాన్ని పొంగించే నాగావళి అతడి నాగలి. బాధల సెగలతో సతమతమైపోతున్నా అతడు తీరుస్తుంటాడు కోట్ల మంది ఆకలి. ఎన్నెన్ని గుట్టలు ఎదురైనా ఆత్మ విశ్వాసపు జలపాతమై ముందుకురుకు తుంటాడు. ప్రగతికి ప్రతిబింబంగా జగతిని అలరిస్తుంటాడు. అతడే కర్షకుడు. అందరికీ ఆత్మీయుడు. మనిషి జీవన మనుగడలో అతడి పాత్ర అద్వితీయం. అమోఘం. తన నిండా కలవరాన్ని నింపుకున్నా మట్టిని పొలాలతో కళకళలాడిరచే హాలికుడు. మట్టి నుంచి అద్భుతాల్ని సృష్టించే ఇంద్రజాలికుడు. మట్టిని చినుకులతో నింపుతుంది మేఘం. రైతు  మట్టినుంచి పలికిస్తాడు జీవనరాగం.  అందుకే అతడంటే కవిత్వానికి వల్లమాలిన ప్రేమ. అతడి జీవనోద్యానాన్ని పూల పరిమళాలతో నింపాలని అది తపిస్తుంది. కార్పొరేట్‌ మాయాజాలంలో చిక్కుకొని సతమతమయ్యే అతడి జీవన పోరాటాన్ని వినిపించడానికి తానే అతడి జీవనగానమై పోతుంది. బతుకు బీళ్లను తడుపుతూ ఊపిరిపోసే నీటిప్రవాహం కన్నీటి ప్రవాహమై పోవడం పట్ల అవేదన వ్యక్తం చేస్తుంది. అతని జీవన నాదాల్ని, నినాదాల్ని ఏకరువు పెడుతుంది. 
‘మా పొలాన్ని అమ్మేశాను/చితినిచేరేవరకు/బతుకులోభాగంగా వుంటుందని
భావిస్తూ వచ్చిన పొలాన్ని/ భయపడుతూ/ భాదపడుతూ/ అమ్మేశాను
మా తాత చెమటచుక్కల్ని/ రెక్కల కష్టాన్ని/ చిక్కిన రుధిరాన్ని
రొక్కంగా మార్చి/ సంపాదించిన పొలాన్ని/ అమ్మేశాను
పది కాలాలపాటు ముప్పూటలా/ బువ్వపెట్టి బతికించిన పొలంతో
బాధలన్నింటినీ తెంపుకుంటూ/ అమ్మేశాను.......
హాలికుడు ఏకవచనాన్ని/ బహువచనంగా మార్చగల మహా మాంత్రికుడు
జడ్డిగాల ద్వారా ఒక్కగింజను/ జారవిడిచి/ మొక్కను మొలకెత్తిస్తాడు
రంగుల రంగుల పూలను/ రకరకాల ధాన్యాలను/ కల్పిస్తాడు
విశాల విశ్వాన్ని తానే తిండిపెట్టి బతికిస్తున్నా/ స్వాతిశయం ప్రదర్శించని
స్వాతిముత్యం/ రైతు...
వ్యవస్థలపై రోత కలిగి/ అవస్థలతో నలిగి నలిగి/ హలాలను విసిరికొట్టి 
పొలాలను విడిచిపెట్టి/ హాలికులందరూ/ తలోదారికి/ తరలిపోతే
రామచంద్రుడు పాలించిన/ రామరాజ్యంలో/ రేపు
‘అన్నమో రామచంద్ర’/ అనే అరుపులు వినిపిస్తాయేమో!
‘అలో లక్ష్మణా’/ అంటూ అసువులు బాసే/ ఆకలిచావులు 
కనిపిస్తాయేమో/ ఏమో!ఏమో!’   (‘మట్టిబండి’ దీర్ఘకవితనుంచి)
అంటూ తనను చుట్టుముట్టిన సామాజిక అస్తవ్యస్త పరిస్థితుల మధ్య సతమతమవుతూ మనుగడ సాగించలేని రైతు విభిన్న జీవన పార్శ్వాలను కవితాబద్దం చేస్తుంది వర్తమానకవి నాగభైరవ ఆదినారాయణ కలం. తన జీవితంలో భాగమైపోయిన భూమిని జీవన మనుగడ కోసం బలవంతంగా వేరుచేసిన వైనాన్ని దుఃఖాశ్రువులతో చెప్పుకునే రైతు వేదనకు అక్షర రూపం తొడిగింది కవిత్వం. మూడు తరాల్ని ఆదుకున్న నేలతల్లి పట్ల అతడికున్న అవ్యాజమైన ప్రేమను, అతడి కష్టాలను ఏకరువు పెట్టింది. కార్పొరేట్‌ మాయాజాలం తనలో కల్పించిన స్వార్థపూరిత నిర్లక్ష్యంతో తనకు చేదోడుగా వున్న ఎడ్లనూ, ఎడ్లబండినీ అమ్మేయడాన్ని ఎత్తిచూపే ఆ రైతు ఆవేదన అయిపోయింది కవిత్వం. ఆవురావురుమనే ఆశతో ఆత్మీయ బంధాల్ని కోల్పోయి బావురుమనే అతని పశ్చాత్తాపమైపోయింది. గింజల్ని మొక్కలుగా, మొక్కల్ని పంటలుగా, పంటల్ని ధాన్యాగారాలుగా మార్చే రైతు అద్వితీయ శక్తికి నీరాజనాలర్పిస్తుంది. విశాల విశ్వానికి ప్రాణం పోస్తున్నా భేషజాలు చూపించని అన్నదాత పక్షం వహిస్తుంది. లోపభూయిష్ట సామాజిక అస్తవ్యస్త పరిస్థితులు కల్పించే అవస్థల్లో కునారిల్లుతూ ఆ పరిస్థితులతో రాజీపడలేక తమ భూములకు భూమి పుత్రులు దూరమైపోతుంటే ఆకలి చావుల భవిష్యత్తును దర్శిస్తుంది కవిత్వం.  రైతు జీవితాన్ని అనునిత్యం అతలాకుతలం చేసే వ్యవస్థల్ని దునుమాడుతుంది. 
‘చేలో లేని నీరు కంటిలోకి చేరినవాడా
జల్లుల తడికోసం పగుళ్లిచ్చిన/ నీ గుండె నెర్రెలు తీసిందంటావా
భూమి తల్లిని నమ్మిచెడినవాడు/ తాత మాటలు నెమరేస్తున్నవాడా
ఒక ముద్దవడం కోసం/ దూదిపింజల్లా తేలిపోతున్న మేఘాల్ని 
చాపలాచుట్టి నెత్తిపై/ నిలబెడదామనుకుంటున్నావా...
పడమటింటి విందు భోజనం కోసం రైతు పచ్చని పొలాలపై 
మొప్పలాడిరచుకుంటూ ఈదుతున్నాడు/ కయ్యల్లో మీసాలు మెలేసి
కాసుల కోసం/తలలు నరుక్కుంటున్నాడు
రొయ్య ఎంతో గర్వంగా/ నక్కవినయాలు పోతున్నా
చేప విలాసంగా/ తోక ఊపుకుంటూ
 రైతుగుండె తలుపులకు కన్నుకొడుతుంది’  (‘వానరానికాలం’ఖండికనుంచి)
‘ఒక వారధి ముందు/ సన్నకారునిగా నేను/ అరచేతిలో
అద్భుత నగిషీల కొయ్య/ అనువంశిక దర్పానికి సంకేతంగా
తరతరాల అభిజాత్యాలకు ప్రతీకగా/ వారసత్వపు చెలకలు
అనివార్య విభజనమై/వాటాలుగా ముక్కలై/ కమతాల ఛిద్రరూపాల గురించి
ముద్రబల్ల చెప్పే కథలెన్నో’        (‘ముద్రబల్ల’ దీర్ఘకవిత నుంచి)
అంటూ వానరాని కాలంలో రైతు గుండె పరితపించే దీనావస్థలకీ, కాలం కల్పించే తరతరాల రైతు జీవనావస్థలకు సాక్ష్యంగా నిలుస్తూ ముద్రబల్ల వినిపించే అవస్థల గాధలకీ అక్షరరూపం కల్పిస్తుంది దాట్ల దేవదానంరాజు కలం. ఇక్కడ వానకోసం తపించి తపించి పొలంలోని నీరంతా హాలికుడి కన్నీరు అయిపోవడాన్నీ. తొలకరి జల్లుల తడి కోసం కలవరించి కలవరించి అతడి హృదయం నెర్రెలు విచ్చుకోవడాన్నీ రికార్డు చేసింది కవిత్వం. మనిషి ఆకలి తీర్చేందుకు తానే అన్నం ముద్ద అయిపోవడానికి మేఘాల్ని కురిపించాలనే రైతు ఆత్మస్థైర్యానికి ప్రతీక అయిపోయింది. ప్రపంచీకరణ కల్పించే పడమటి విందు భోజనం పట్ల ఆకర్షితుడై తన పొలం పంటల్ని కాలరాసి రొయ్యల కయ్యలై అంతర్జాతీయ విఫణి వీధిలో కాసులు కురిపించాలన్న రైతు కలనూ ఆవిష్కరిస్తుంది. కర్షకుడి తీరు మార్చేసిన రొయ్యల నక్క వినయాల్ని తూర్పారబడుతుంది. రైతు తరతరాల భూమి వారసత్వం వాటాలుగా ముక్కలైపోవడాన్నీ, అనువంశిక దర్పం స్వార్థానికి అర్పణమైపోవడాన్నీ ఆ భూమికి సాక్ష్యంగా నిలిచే ముద్రబల్ల వేదనగా వినిపిస్తుంది కవిత్వం. మనిషి ఆకలి తీర్చే మెతుకును సృష్టించే రైతు బతుకు గతుకులమయం కాకూడదని తపిస్తుంది. ప్రతి మనిషీ ఆత్మబంధువైన రైతుకు కవిత్వమూ ఆత్మబంధువైపోయి అతని ఆత్మక్షోభకు అక్షరాలు తొడుగుతుంది.
    డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, సెల్‌: 9177732414                                                                           

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img