Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నేను మీ బ్రహ్మానందం…!

సహజంగా జీవిత చరిత్రలు అంటే వ్యక్తికి సంబంధించిన విషయాలను సగం రాస్తారు, మిగతా సగం దాస్తారు అని అంటుంటారు. అందులో వాస్తవం కూడా లేకపోలేదు ఎందుకంటే ఏ విషయం రాస్తే అది వివాదాస్పదమై కూర్చుంటుందో అన్న భయం సహజంగా వారి కుంటుంది. అలాగే పలానా వ్యక్తులు, సంస్థల గూర్చి రాస్తే వారు ఎలా స్పందిస్తారోనని మరొక భయం. కానీ అలాంటి వాటికి భిన్నమైనదే ప్రముఖ హాస్యనటులు ‘‘పద్మశ్రీ’’ బ్రహ్మానందం స్వీయ చరిత్ర. ‘‘నేను మీ బ్రహ్మానందం’’ వారి జీవితంలో దాయటానికి ఏమీ లేదు. దాపరికాలు కూడా ఏమీ లేవు. అంతా బహిరంగ రహాస్యమే. అందుకే వారు ఏమీ దాయకుండానే తన జీవిత చరిత్రను మన ముందుంచారు. ఎవరి జీవిత చరిత్రనైన ఎందుకు చదవాలి? ఏ ఉద్దేశం నెరవేర్చడానికి చదవాలి? చదివిన తరువాత ఏం నేర్చుకున్నాం? చదివినది మన జీవితానికి ఎంత ఉపయోగపడిరది? లేదా వారి జీవితానికి మన జీవితానికి ఏమైనా సారూప్యత ఉందా? అని తరిచి చూసుకునే అవకాశం బ్రహ్మానందం జీవిత చరిత్రను చదివితే తెలుస్తుంది. నాణానికి ‘‘బొమ్మాబొరుసు’’ ఉన్నట్లే మానవ జీవితానికి కష్టాలు సుఖాలు ‘‘జోడు గుర్రాల’’ మాదిరిగా పరిగెడుతూనే ఉంటాయ్‌. కష్టాలకు నిరాశ చెందకుండా, సుఖాలకు పొంగిపోకుండా బతుకు బండిని లాగేవాడే ధీరోదాత్తుడు నా దృష్టిలో. ఎక్కడ మొదలైనామో అక్కడే ఆగిపోవటం కాదు మానవ జన్మ ఉద్దేశం, ఎక్కడి నుండి మొదలైనా ఎక్కడెక్కడో పయనించినా ఎంతమంది మనుషుల్ని, మనసుల్ని గెలిచామనేది ముఖ్యం అలాంటి వారిలో బ్రహ్మానందం ఒకరు.
సహజంగా సినిమా పరిశ్రమ అంటేనే ఎత్తులు పై ఎత్తులు, రాత్రికి రాత్రే వచ్చిపడే ‘‘స్టార్డమ్‌’’ వివిధ రకాలు ఆకర్షణలు లేదా వ్యసనాలు వాటి జోలికి పోకుండా ‘‘ఇంతింతై వటుడిరతై’’ అన్నట్లుగా సాక్షాత్తు ఆ ‘‘వేంకటేశ్వరస్వామి’’ వారే తను ఎదుగుతున్న క్రమంలో వచ్చిన అవాంతరాలను ఒక్కొక్కటిగా పక్కకు తప్పించి వారికి మార్గం సుగమం చేశారని చెప్పొచ్చు. ‘‘దైవేచ్చ’’ లేనిదే ఏ మనిషి చెట్టూపుట్టా కార్యం మొదలవ్వదు కదా. ‘‘కలయో వైష్ణవ మాయయో ‘‘అన్నట్లు ఎక్కడో మారుమూల పల్లెటూరిలో చిన్నపాటి వడ్రంగం వృత్తి చేసుకునే దంపతులకు ఆరవ సంతానంగా ‘‘కన్నెగంటి బ్రహ్మానందం’’ జన్మించటం ఏమిటి? పుట్టిన పిల్లాడికి ‘‘బ్రహ్మానందం’’ అని పేరు పెట్టడమేమిటి? అంతా ఈశ్వరలీల కాకపోతే. ‘‘ఊరకరారు మహాత్ములు’’ అన్నట్లుగా ఏదో కార్యార్ధము ఒక ఈశ్వరేచ్చతో వస్తారు కొందరు. అలా బ్రహ్మానందమ్‌ ప్రస్తానం మొదలైంది. బ్రహ్మానందంలోని చురుకుదనం గమనించిన వారి మేనమామ వీడు పరమ బ్రష్టుడన్నా అవుతాడు లేదా జాతి గర్వించే స్థాయికైనా ఎదుగుతాడని చెప్పటంలో వాస్తవమే దాగుంది. పుట్టింది పేదరికంలోనే ఐనా ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ అవాంతరాలను, అడ్డంకులను పక్కకు నెడుతూ, చెడు వ్యసనాలకు లోనుకానని అమ్మకు ‘‘ఒట్టువేసి’’ ఉన్నత చదువుల కోసం భీమవరం పయనమై టీచర్‌ యోగీశ్వరమ్మ రికమండేషన్‌తో సున్నం ఆంజనేయులు వద్దకు వెళ్లి వారి సిపార్సుతో (ప్రీ యూనివర్సిటీ కోర్సు) పూర్తి చేయటం గొప్ప విషయం.
ఈ చదువులు కూడా యోగీశ్వరమ్మ చెల్లెలు సున్నం అనసూయమ్మ ప్రతినెల మనియార్డరు పంపగా చదువు కోవడం ముదావహం. సంకల్పం గట్టిదైతే సమస్యలు వాటంతవే పక్కకు తొలుగుతాయి అంటారు. ఇక్కడ బ్రహ్మానందంకి కూడా సమస్యలు వచ్చాయి. మేఘాల్లాగా వెళ్ళాయి. ఉపశమనం, ఉక్కపోత కాసింతసేపే అన్నట్లుగా వారి జీవితం గడవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడే ఒక విషయం ప్రస్తావించాలి డిగ్రీలో ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ చదవాల్సి ఉండగా ‘‘తెలుగు లిటరేచర్‌’’ చేయాల్సి రావటం అంటే బహుశా జీవితంలో నిలదోక్కు కోవడానికి ఆ భగవంతుడే ఈ దారి వేశాడెమో, ఒకవేళ బిఏను ఇహెచ్‌పి గ్రూపుతో పూర్తిచేసి ఉంటే ఆ బ్రహ్మానందమ్‌ ఇంతటి వాడు అయ్యేవాడా? తెలుగు సాహిత్యం చదివి, ఎంఏ తెలుగు చదవటానికి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలి. కాని అక్కడికి వెళ్లి చదువుకునే స్థోమత తనకు లేదు. పైగా హాస్టల్లోవుండి దానికికూడా దేవుడుమార్గం చూయించాడు. ఓ దారిలో వెళ్లాలని దేవుడే చూయించినట్లుగా అన్ని అలా జరిగిపోయాయి. పీజీలో కూడా సున్నం అనసూయమ్మ ఆర్ధిక సహకారం చేయడం వారి దాత్రుత్వపు హృదయానికి ఎంతిచ్చినా తక్కువే అంటారు. అలా దైవలీలతో పీజీ చేయడానికి విశాఖపట్నం వెళ్ళే అవసరం లేకుండానే గుంటూరులోనే ఆంధ్రా యూనివర్సిటీ వారు ఓ శాఖను ఏర్పాటు చేయటంతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం శ్రీవల్లి సుబ్రహ్మనేశ్వర ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ‘‘తెలుగు లెక్చరర్‌’’గా పార్ట్‌ టైం ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి దీనికి సమాంతరంగా మిమిక్రి కార్యక్రమాలకు వెళ్ళి పాల్గొనటం వీటి ద్వార బ్రహ్మానందం పేరు అక్కడక్కడ వ్యాపించడం మొదలైంది.
ఈ క్రమంలోనే పెళ్ళి సంబంధాలు రావటం తల్లిదండ్రులు కట్నానికి ఆశపడటం అనసూయమ్మ బందుత్వంలోని అమ్మాయిని బ్రహ్మానందంని చేసుకోమని అడగడం ఇంట్లో ఒప్పించి 1977-డిసెంబర్‌ 14 న కాపు కులస్థుల అమ్మాయి లక్ష్మిని వివాహం చేసుకోవటం బయటి ప్రపంచానికి తెలియని విషయం. అనంతరం రెండు కాన్పులు పోవటం మూడో కాన్పు పట్ల శ్రద్ధ కనబరిచి హైదరాబాద్‌లో వున్న వారి బావమర్ది ఇంట్లో వుంచి వైద్యం చేయించటం, యాదృచికంగా తెలిసిన మిత్రుడి ద్వారా ఆకాశవాణి రేడియో కార్యక్రమంలో ‘‘మిమిక్రి’’ అవకాశం రావటం, అనంతరం సినిమా అవకాశాలు రావటం మొదటి సినిమా ‘‘శ్రీ తాతావతారం కథ’’లో నటించినా విడుదలైన సినిమా మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘‘సత్యాగ్రహం’’ సినిమా. అనంతరం, ‘‘చంటబ్బాయ్‌’’ సినిమాలో చిరంజీవి సరసన నటించే అవకాశం రావటం ఇలా ఎప్పడు ఎవర్ని కలపాలో అప్పుడే కలుపుతాడు ఆ పైవాడు. వారి ద్వారానే మార్గం సుగమం చేస్తాడు. అలా అన్ని దారులు ఆ భగవంతుడే సిద్ధం చేసి పెట్టాడు అంటారు. పెద్దబ్బాయి ‘‘గౌతం’’ పుట్టిన తర్వాత రెండో బాబు కడుపులో పడ్డ తర్వాత ‘‘అబార్షన్‌’’ చేయించాలనుకోవడం ఆ క్రమంలో వారి కళాశాలలో పని చేస్తున్న తోటి అధ్యాపకుడు ‘‘రామశాస్త్రి’’ మందలించటం చిన్నబ్బాయ్‌ ‘‘సిద్ధార్ధ’’ జన్మించటం అంతా కాకతాళీయమే అంటారు.
ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు పెరగటం ఇల్లు మద్రాసుకి షిఫ్ట్‌ చేయటం, అనంతరం వివాహ బోజనంబు ‘‘షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ వల్ల రామనాయడి ‘‘బ్రహ్మపుత్రుడు’’ సినిమాలో అవకాశం కోల్పోవటం, రామానాయుడు సూచనతోనే మేనేజర్‌ తన శిష్యుడు ‘‘శేషు’’ని నియమించుకోవటం, మళ్ళీ రామానాయుడు ‘‘ప్రేమ’’ సినిమాలో అవకాశం రావటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇలా ఒకటేమిటి ‘‘మనీ’’ సినిమాలో ‘‘ఖాన్‌ దాదా’’ పాత్ర మొదలుకొని ఇటీవలే వచ్చిన ‘‘రంగమార్తాండ’’ సినిమాలో రంగస్థల నటుడిగా పాత్ర చేసినా అన్ని దైవానుగ్రహం వల్లనే జరిగిపోయాయి అంటారు. తను నటించిన పదమూడు వందల సినిమాల గురించి, అందులోని పాత్రల గురించి ఎంత రాసిన, ఎంత చెప్పినా ఒడవని ముచ్చట అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజాలైన ఎన్‌టిఆర్‌, ఏఎన్‌ఆర్‌ అనంతరం కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవితో మొదలుకొని బాలివుడ్‌ నటులు, అమితాబ్‌బచ్చన్‌ మొదలైన వారితో నటించి అందర్నీ ‘‘హాస్యపు’’ ఆనంద డోలికల్లో ముంచెత్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు, ఐదుసార్లు ఉత్తమ హాస్యనటుడి అవార్డు, ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు ‘‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’’ అన్ని ‘‘దైవేచ్చ’’ అంటారు.
తెలుగు సాహిత్యం ద్వారా అబ్బిన ప్రతిభ తనలో దాగి ఉన్న మిమిక్రి కళ ఇవన్ని తన జీవితానికి దారులు చూపించాయని అంటారు. కళాశాలలో బోధించే సమయంలోనే విశ్వనాధసత్యనారాయణతో, ఎస్వీ జోగారావు, ఆచార్య తూమాటి దోణప్ప, రావి శాస్త్రి, రోణంకి అప్పలస్వామి, భమిడిపాటి రామగోపాలం, ఆరుద్ర, దివాకర్ల వెంకటాధాని, వంగపండు, గద్దర్‌ మొదలైనవారి ప్రశంసలే ఈ స్థాయికి చేర్చాయంటారు. తన సినిమా గురువైన ‘‘జంధ్యాల’’ అన్నట్లు ‘‘నవ్వటం యోగం నవ్వలేకపోవడం ఓ రోగం’’ నవరసాల్లోని హాస్యమును ‘‘అపహాస్యం’’ చేయకుండా అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి వారధిగా అందర్నీ కలుపుకొనిపోతూ కదపుబ్బా నవ్వించేలా నటించడం మామూలు విషయం కాదు. తెర వెనుక ఎన్ని బాధలు ఉన్నా కెమెరా స్టార్ట్‌ అనగానే సినిమా థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులను నవ్వించడానికి బాధల్ని దిగమింగుకొని నటించిన వారిలో ఓ చార్లీ చాప్లిన్‌, మరో బ్రహ్మానందం లాంటి వారు వెండి తెరకు దొరికిన అరుదైన వ్యక్తులు. తెర మీద కనిపించగానే పసిపిల్లాడితో మొదలుకొని పండు ముసలి వరకు ముఖంలో ఆనందం తాండవిస్తుందంటే ఇంతకు మించి బ్రహ్మానందంకి ఏమి కావాలి? వారి జన్మ ధన్యమైనట్లే. ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈ యాంత్రిక కాలంలో బ్రహ్మానందం అన్ని తరాల వారికి ఓ ‘‘హాస్యపు టానిక్‌’’ లాంటివారు. అన్ని మరిచి సరదాగా కడుపుబ్బ నవ్వుకోవడానికి ఆ హాస్యపు నటన ఇలాగే కొనసాగాలని మరింత కాలం తెలుగు తెరపై ‘‘హాస్యపు రారాజు’’ గా రాణించాలని మనసార కోరుకుంటూ అన్విక్షి పబ్లిషర్స్‌ ఓ మంచి ప్రయత్నం చేసి బ్రహ్మానందంని పుస్తక రూపంలో పరిచయం చేయటం ప్రశంసనీయం.
అదేవిధంగా బ్రహ్మానందం గూర్చి పుస్తకం చివర్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రామోజీరావు, సుబ్బరామిరెడ్డి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కీ.శే.అక్కినేని నాగేశ్వర రావు, సీనియర్‌ నటి కృష్ణవేణి, దర్శకులు కీ.శే.విశ్వనాథ్‌, కీ.శే.దాసరి నారాయణరావు, కీ.శే.కృష్ణ, కీ.శే. శ్రీదేవి, కీ.శే.రామా నాయుడు, సుబ్బిరామిరెడ్డి, కీ.శే.శ్రీమతి విజయనిర్మల, రాంగోపాల్‌ వర్మ, రాజేంద్రప్రసాద్‌, కీ.శే.డా.సి.నారాయణ రెడ్డి, కీ.శే.ఎస్పి.బాలసుబ్రహ్మణ్యం, సీతారామశాస్త్రి, డా.గరికపాటి నరసింహరావు, కత్తి పద్మరావు, మామిడి హరికృష్ణ, సుద్దాల అశోక్‌తేజ, భువనచంద్ర, మాడబూషి శ్రీధర్‌ మొదలైన వారి అభిప్రాయాలతో పుస్తకానికి నిండుదనం అబ్బింది.
డా. మహ్మద్‌ హసన్‌, సాహిత్య విమర్శకులు
సెల్‌: 9908059234.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img