Friday, December 2, 2022
Friday, December 2, 2022

ప్రజా సాహిత్యమే ప్రజాస్వామ్యానికి రక్ష

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
సెల్‌: 9948774243

సైద్ధాంతిక అవగాహన, శాస్త్రీయ దృక్పథం మానవీయత లేకుండా నేడు సమాజంలో మేధావులుగా చలామణి అవుతున్న భౌతిక, ఆధ్యాత్మిక వాదులు సైతం అమానవీయతా వర్తనులై స్వార్థం నీడలో ఆర్థిక ప్రలోభాలకు లోనవుతూ సామాజిక అసమానతలకు, అణచివేతలకు, వివక్షకు, విధ్వంసాలకు హేతువులై నిలవడం దురదృష్టకరమైన అంశం. సమాజానికి రెండుకళ్లుగా ఉండాల్సిన రాజకీయం, మతం దుష్ట చింతనలతో పెత్తందారీ పోకళ్లతో, సామాజిక సామరస్యాన్ని చిదిమివేస్తూ, ఐక్యతకు తూట్లు పొడుస్తూ జ్వలించే మానవ సంబంధాలగ్నికి అవిశ్వాసము, అపనమ్మకపు ఆజ్యం పోస్తున్నారు. హేతుబద్ధ మైన ఆలోచనలు గాని, శాస్త్రీయ దృక్పథంగాని, సైద్ధాంతిక స్ఫూర్తిగాని కొరవడిన వర్గ, వర్ణ వైషమ్యాలు, కుల మతో న్మాదాలు, రాజకీయాల్ని ప్రభావితంచేస్తూ పదవీ వ్యామోహితంగా ఆర్థిక బలోన్నతులను ప్రలోభ పెడుతున్నాయి.
నైతికతను జార్చుకున్న మేధావి వర్గం, రాజకీయ రంగులు పులుముకొని, మతం ముసుగుల్లో కులం కూటాలను కూడ గడుతూ ఓట్ల నోట్లను ఎదబెడుతూ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం నేటి మన ప్రజాస్వామ్యంలో పరిపాటై పోయింది. పాలకవర్గం స్కామ్స్‌తో తల పండిపోతుంటే, అధికార గణం లంచాల పేరుతో లాఘవం ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నవాడికి ఊడిగం చేసే దశకు దిగజారి పాలకపక్షం ప్రతిపక్షం చేతలుడిగి శ్రీరంగ నీతులు చెప్తూ జనానికి వెర్రిమొర్రి ప్రగల్భాల్ని వినోదాలుగా వినిపిస్తున్నారు. జనాకర్షక పథక జ్వర పీడితులైన జనం, అల్ప సంతోషులై ఉచితాలకు ఉబ్బితబ్బిబై పోతున్నారు. అన్యాయాలను, అక్రమాలను, ఎదుర్కొనుటలో ప్రజలకు ‘వాయిస్‌’గా ఉండాల్సిన ప్రతిపక్షంలో, పాలనాధికారం జారిపోయిందనే బాధే కనిపిస్తుంది కాని, ప్రజాపక్షం వహించి పోరాడాలనే ధ్యాసే కనిపించటం లేదు. ప్రింటుమీడియాలో గాని, ఎలక్ట్రానిక్‌ మీడియాలోగాని రాజకీయ ప్రసంగాలు నిరాధారమైన సొల్లు కబుర్లు స్వాగతాలుగా మారి పోతున్నాయి. విదూషక వచనాలుగా అనిపిస్తున్నాయి. మతాధి పతులు గత వైభవాల్ని తవ్విపోస్తూ, మూఢ విశ్వాసాలను, చాదస్తపు భావాల్ని దైవ ప్రవచనాలుగా నమ్మబలుకుతూ, పుణ్యలోకాలకు తెరచిన ద్వారాలుగా విశ్వాసాల్ని కలిగిస్తూ దోపిడీకి తెర లేపుతుంటారు.
మతం భక్తి ముసుగులో వ్యాపారుల చేతుల్లో సరుకుగా మారిపోయింది. అట్లే రాజకీయం దోపిడీ తత్త్వమే ధ్యేయంగా అధికార దాహంతో ఉచ్చనీచాలు మరచి ఊరేగుతుంది. సమాజంలో అంతకంతకు అధికమవుతున్న ఆర్థిక దోపిడీని, పతనమౌతున్న నైతిక విలువల్ని, దిగజారి పోతున్న ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తూ జనాన్ని చైతన్యపరిచే భావజాలాన్ని, బడుగుబలహీన వర్గాల జీవితాల్లో తారసపడే అసంపూర్ణతలను, ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం తోడ్పడుతుంది అనటం అతిశయోక్తి కాదు. హేతుబద్ధంగా శాస్త్రీయ దృక్పథంతో, అభ్యుదయ భావాలతో, ప్రజా సాహిత్యం పట్ల వాస్తవిక దృష్టి, దృక్కోణం కలిగి, భౌతిక దృక్పథాలతో, సమ సమాజ నిర్మాణ ఆకాంక్షతో, త్యాగ పూరితమైన ప్రజా పోరాటాల భావుకతతో రాసే సాహితీవేత్తలు సామాజిక మార్పుకు దోహదపడతారని యధార్థంగా భావించవచ్చును. వివిధ దృక్పథాల కోలాహలం మధ్య సాహిత్యపు మౌలిక విలువలను కాలరాస్తూ స్వార్థపూరిత వర్గ ప్రయోజనాల కోసం సాహిత్య కాలుష్యాన్ని సృష్టించటం అభిలషణీయం కాదు. సాహిత్యంలో పొడగట్టే కాలుష్యం సాహిత్యానుభూతిని మింగేసి, ఆలోచనలు వక్రీకరణ మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ రాజకీయ, మతకాలుష్యం అనేకరకాలైన సామాజిక వివాదాలకు ఏవిధంగా కారణభూతంగా నిలబడుతుందో సాహిత్య కాలుష్యంకు ఆయా వ్యవస్థల మూల స్వభావాలు పూర్తిగా మారిపోయి, సంకట భావాలు తలకెత్తేందుకు ఆస్కారమిస్తుంది.
ప్రజాస్వామ్యానికి ఉండవలసినవి, లోతైన వివేచన, విశాల దృక్పథం గల వివేకము, సాంద్రతతో కూడిన ఆలోచనలు భాషా పటుత్వము. ఎప్పుడయితే సాహిత్యం వర్తమాన సమ సమాజ అంతరంగాల్ని, జాతి అంతర్గత కుళ్లు, కుత్సితాలను పారదోలగలుగుతుందో అప్పుడే మనిషిలోని మృగత్వాన్ని దోపిడీతత్త్వాన్ని ఎండగట్టగలుగుతుంది. మనిషిలో విషయాసక్తి విస్తృతమయ్యే కొద్దీ, సాంకేతిక పరిజ్ఞానం సమకూడే కొలది, ఆర్థికపరమైన అత్యాశ మనిషిని అమాంతం మింగేస్తూ, విచక్షణా జ్ఞానాన్ని విస్మరింపజేస్తూ దొరతనం ముసుగులో దోపిడీకి తెర లేపుతున్నాడు. లౌకికవాదం దారితప్పి లౌల్యంగా మారిపోతుంది. మనిషిలో బలపడే అవిశ్వాసం, అపనమ్మకం, విచక్షణాజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని చంపి వేస్తుంటాయి. ఒక్కోసారి మానవుని దుర్భలత్వం వలన సామాజిక స్థితిగతుల్ని మార్చడానికి వెలుగు చూసిన సైద్ధాంతిక దృక్పథాలు, అహంకార పూరితమైన స్వార్థంలో జోగి, చిట్ట చివరకు వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని రూపుమాపే స్థితికి చేరుకుంటున్నాయి.
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతటా వచ్చిన మార్పు మానవ సంబంధాల్లో అనేక మార్పులు తెచ్చాయి అనడం అతిశయోక్తి కాదు. విపరీతమైన వేగంతో సామాజిక స్థితిగతులు మారిపోతున్నాయి. సామ్రాజ్యవాద సుస్థిరత కోసం ‘ప్రపంచీకరణ’ అనే మాయాజాలాన్ని పెట్టుబడిదారీ దేశాలు బడుగు బలహీన వర్గ దేశాల మీదకు వదిలాయి. దీనివలన ప్రపంచంలో సోషలిస్టిక్‌వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచీకరణ వలన ఆర్థిక అసమానతలతో కొట్టుమిట్టాడుతున్న దేశాలు మాత్రమే సామ్రాజ్యవాద దేశాల చేతుల్లో కీలుబొమ్మలై ఆడుతున్నాయి. కాని కరోనా వలన ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతుంది. మానవ వృత్తిలోను ప్రవృత్తిలోను అనేకమైన మార్పులు వచ్చాయి. మనిషి నీడ సైతం పొడగడితే పారిపోయే దుస్థితికి ప్రపంచంలో మనిషి దిగజారాడు.
కరోనా కాటుకు బలి కాకుండా ఉండేందుకు సాహిత్యం తన వంతు కృషి తాను చేస్తూనే ఉంది. జనాన్ని చైతన్య పరుస్తూనే ఉంది. మనకు అర్థంకాని అవసరంలేని విషయాలు ప్రపంచంలో ప్రజానీకానికి అవసరం లేదనుకునే కాన్‌సెప్ట్‌తో రాజకీయాలు, మతాధిపతులు భావిస్తుంటారు. అంటే మానసిక వార్ధక్యంతో ఆధ్యాత్మికవాదులు సామాజిక రుగ్మతలను పట్టించు కోవటం లేదు. అట్లే భౌతికవాదులు ఆర్థిక వ్యామోహంలో పడి పుణ్యం పురుషార్థం ఉత్త హుళక్కి, దైవందర్శనం ఉత్త హంబక్‌, ఆర్థికంగా బలపడితే సుఖాలన్నీ మన చుట్టే ఉంటాయనే మెటిరియలిస్టిక్‌ మానసిక రోగంతో బతుకు నెతుక్కుంటున్నారు.
సమాజాన్ని చైతన్య పరచాలంటే సాహిత్య ప్రక్రియ పోషించే పాత్ర మరే ప్రక్రియ పోషించలేదు. భౌతికవాద సాహిత్యం, పీడిత జనం పక్షాన నిలబడుతుంది. అభ్యుదయ భావాలతో, శాస్త్రీయ దృక్పథంతో, హేతుబద్ధంగా ఆలోచిస్తూ, కర్మ సిద్ధాంతాలను నమ్మకుండా, మానవ శ్రమకు తగిన ఫలితాన్ని ఆశిస్తూ, శ్రమ దోపిడీకి గురి కాకుండా యోచిస్తూ, రూపొందించే సాహిత్యం స్వచ్ఛమైన ప్రజా సాహిత్యంగా ఉంటుంది. ఈ రూపేణా తీరిన సాహిత్యం సమాజాన్ని చైతన్య పరుస్తుంది. అణచివేతకు గురవుతున్న అణగారిన జనానికి గొంతిస్తుంది. వివక్షకు గురవుతున్న జనం హృదయాల్లో అస్థిత్వపు జ్వాలలు రేపుతుంది. శ్రమజీవుల పక్షాన నిలబడి కార్మిక, కర్షకాభివృద్ధిని కాంక్షిస్తుంది. ఆధ్యాత్మిక వాదులు రాసే సాహిత్యం కర్మ సిద్ధాంతాలని, మతాచారాలను, దైవభక్తిని, పూర్వజన్మ సుకృతాలను తవ్వి పోస్తూ ఆలోచనలకందని మూఢ విశ్వాసాల్లోకి జనాన్ని లాగుతుంటూంది.
పెట్టుబడిదారీ భావజాలంతో పాలకులుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకులను, వివక్షలను, ఆధిపత్యం పోరుకు తెర లేపుతున్న కులమతాల కుళ్లును అణచివేయాలంటే ప్రజా సాహిత్యం భౌతికవాద భావజాలంతో వెలువడాలి. శాస్త్రీయమైన అవగాహనతో, సమిష్టి చర్యలలో, విమర్శ, ఆత్మ విమర్శలతో ప్రజాప్రయోజనాలపై విశ్వాసాన్ని పెంచే సాహిత్యం భౌతికవాదంతోనే ముడిపడి ఉంటుంది.
నేడు భారతదేశపు వర్తమాన రాజకీయ, మత విధానాలను పరిశీలించినట్లయితే, నానావిధ మానసిక అనారోగ్య పాలనా ప్రణాళికలతో పదవుల సుస్థిరత కోసం కంటితుడుపు తాయిలా లను ప్రజలకందిస్తూ, ఎన్నో అక్రమ దార్ల వెంట పరుగులు దీస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో పక్షపాతానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా సాహిత్యం దోపిడీకి గురి అవుతున్న వర్గాలకు అండగా నిలబడాలి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, దుష్ట, దుర్మార్గ, నికృష్ట పాలకుల ఆట కట్టించాలి. అట్లే మతాన్ని మత్తుమందుగా బోధిస్తూ మత కలహాలను సృష్టించే ఆధ్యాత్మికవాదుల ఆంతర్యాలను బట్టబయలు చేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలోసాహిత్యం పాత్ర కృషి ఎనలేనిదని నిరూపించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img