Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

ప్రవహించే నది కమ్యూనిస్టు ప్రణాళిక

మార్క్స్‌ ఏంగెల్స్‌ ‘మనది బూర్జువా యుగం’ అని ఆ వేళ ప్రకటించారు. కమ్యూనిస్టు ప్రణాళికలో వారు అలా ప్రకటించి సరిగ్గా 175 సంవత్సరాలయింది. ఇప్పుడు మనం నయా ఉదారవాద యుగంలో ఉన్నాం. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అలాగే పెట్టుబడిదారీ విధానం ముదిరి నయా ఉదారవాదం అయింది. అది బోర విరుచుకొని విజయ గర్వంతో విర్రవీగుతున్న కాలం మనది. యూరప్‌, అమెరికాల్లో ఈ విధానం మొదలై నాలుగు దశాబ్దాలు అయింది. ఇక్కడ మన పాలకులు దాన్ని మూడు దశాబ్దాల క్రితం కౌగిలించు కొన్నారు. దాదాపు ప్రపంచమంతా ఇప్పుడు ఆ విధానంలోనే మునిగి తేలుతోంది. ఈ వ్యవస్థకి తిరుగులేదనీ, దీనికంటే మెరుగైన వ్యవస్థ ఏదీ లేదనీ సోషలిజం పూర్తిగా విఫలమయిం దనీ చెప్పే ప్రచారాలతో నయా ఉదారవాదులు ప్రపంచ వ్యాప్తంగా ఊదరకొడుతున్నారు. ప్రజలు తమ జీవితాను భవానికి వ్యతిరేక దిశలో ఆలోచించేట్టుగా చేయడమే ఆ ప్రచారాల లక్ష్యం. ప్రచార సాధనాల్లో అత్యధిక శాతం నయా ఉదారవాదుల చేతుల్లోనే ఉన్నాయి. అవి నిజాల మధ్య అబద్ధా లను జొప్పించి ప్రజల బుర్రలను పాడుచేస్తున్నాయి. వారిని తమకి అనుకూలంగా మలుచుకొంటున్నాయి. అయితే ఇదంతా ఎల్లకాలం సాగదనేది సత్యం. జనం క్రమంగా కళ్లు తెరుస్తున్నారన్నదీ సత్యమే.
‘బూర్జువా వర్గం పైచేయి సాధించిన ప్రతిచోటా మొత్తం పితృస్వామిక, ఫ్యూడల్‌….. సంబంధాలన్నిటినీ ఖతం చేసింది…. మతోన్మాదాన్నీ రణోత్సాహాన్నీ… అది తన సొంత లాభనష్టాల బేరీజు అనే అతి చల్లటి నీటి గుంటలో ముంచేసింది.’ అంటుంది ప్రణాళిక అది ఆవేళ.
అప్పటికి బూర్జువా వర్గం పుట్టి వందేళ్లయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే అది ఆ నీటి గుంట నుంచి యుద్ధోన్మాదాన్ని బయటకు తీసి వాడుకొంది. ఇప్పుడిక్కడ మోదీ పాలనలో నయా ఉదారవాదం ఒక పక్కన వికాసం, ప్రగతి, ప్రజాస్వామ్యం వగైరా కబుర్లు చెబుతోంది. మరో పక్క మతోన్మాదాన్నీ, యుద్ధోన్మాదాన్నీ రెచ్చగొట్టి అంతులేని అబద్ధాలతో రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్య వామపక్ష ఉద్యమాల పైనా దళిత, మైనారిటీ ప్రజల పైనా ఫాసిస్టు తరహా పాశవికత్వాన్ని ప్రయోగిస్తోంది. ఈ అవలక్షణాలన్నిటితోనూ అది ప్రస్తుతానికి అజేయంగా కనిపిస్తోంది. అయితే నేడు బలంలా కనిపిస్తున్నది రేపు వాపుగా మారక తప్పదని మనకు తెలుసు. భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా జనం మేలుకొంటున్నారు. పోరాడుతున్నారు.
మత వివక్షకి వ్యతిరేకంగా భారత్‌లో విద్యార్ధులూ, యువ జనులూ ప్రతిఘటిస్తున్నారు. రైతులూ, కార్మికులూ నిరుద్యో గులూ తమ జీవన పరిస్థితులను మెరుగు పర్చుకోవడం కోసం రోడ్లపైకి వస్తున్నారు. స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం, శాంతి కోసం సామాజిక న్యాయం కోసం బుద్ధి జీవులు కూడా కదులుతున్నారు. ఈ పోరాటాలు ఇప్పటికిప్పుడే అత్యున్నత స్థాయిలో ఉన్నాయని మేమనడం లేదు. కాని విడి విడి అం శాలపై అక్కడక్కడా అడపా దడపా జరుగుతున్న ఈ ఉద్యమా లన్నీ కలిసి పెరిగి పెద్దవై మొత్తంగా నయా ఉదారవాదాన్ని ఊడ్చిపారేసే ఒక మహా పోరుగా మారాలన్నదే మా ఆశ. పెట్టుబడిదారీ విధానం శాశ్వతం కాదనీ చరిత్రలో అది ఒక దశ మాత్రమేననీ మార్క్సిజం విశ్లేషించి చూపింది. ఆ వ్యవస్థ ఎన్ని రూపాలు మార్చుకొన్నా దోపిడీయే దాని మూల సూత్రం. చరిత్రలో ఆఖరు దోపిడీ వ్యవస్థ కూడా అదే. రాను రాను మరింత అమానుషంగా మారుతున్న ఆ వ్యవస్థను కూల్చి ఒక మానవీయమైన వర్గరహిత వ్యవస్థను స్థాపించడమే వామపక్షవాదుల లక్ష్యం. అందుకు ప్రజా పోరాటాలు ఎంత అవసరమో సిద్ధాంత పరిజ్ఞానమూ అంతే అవసరం.
మార్క్సిజం అంటే గత అనుభవాల సారం. దాన్ని గ్రహించగలిగితే ప్రస్తుత సమస్యలను ఎదుర్కోడానికి కావలసిన శిక్షణ మనకు లభిస్తుంది. ఆ పునాదితో కొత్తగా వచ్చిపడే సమస్యల మూలాలను గ్రహించవచ్చు. ఆ సమస్యలను సృజనాత్మకంగా ఎదుర్కోవచ్చు.
సిద్ధాంతం ఆచరణకు స్పష్టత ఇస్తుంది. ఆచరణకు దిశని చూపుతుంది. ఆచరణ నుంచే సిద్ధాంతం ఎప్పటికప్పుడు నేర్చుకొంటుంది.
కనుక సిద్ధాంతమూ, ఆచరణ ఒకదానికొకటి ఆసరా. మోదీ అండ్‌ కో ఇవ్వాళ ప్రగతివాదంపై చేస్తున్న దాడులకు జవాబుగా ప్రగతిశీల సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నది నిర్ణయం. దానికి తొలి ప్రయత్నంగా ‘కమ్యూనిస్టు ప్రణాళికనూ దానితో పాటు ఏంగెల్స్‌ రాసిన ‘కమ్యూనిజం సూత్రాల’నూ కలిపి లక్ష ప్రతులు ముద్రిస్తున్నారు. వామపక్ష ఉద్యమాల సహకారంతో వామపక్ష, ప్రజాతంత్ర ప్రచురణ సంస్థలు ఈ పనికి పూనుకొన్నాయి.
మరో అనువాదం ఎందుకు?
కమ్యూనిస్టు ప్రణాళికకు ఇప్పటికే అనువాదాలు అనేకం ఉండగా మరో అనువాదం ఎందుకు? అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. దానికి జవాబు చెప్పడం మరీ అంత కష్టమేమీ కాదు. ఇప్పుడున్న అనువాదాల కంటే సరళంగా కమ్యూనిస్టు ప్రణాళి కను అందించాలన్న కోరికే నన్ను ఈ పనికి పురమాయించింది. ఐదు దశాబ్దాలకు పూర్వం తొలిసారి ప్రణాళికను చదివినప్పుడు నేను పడిన కష్టం నాకింకా గుర్తుంది. పుస్తకం తెలుగులోనే ఉన్నా నాకప్పుడు చాలా పేరాలు అర్ధం కాలేదు. కథలు కాకుండా వేరే సాహిత్యం చదవడం కూడా నాకదే తొలి అనుభవం. ప్రణాళిక ముందుమాటలు చదవడానికి మరీ కష్టపడ్డాను. వాటితో పోలిస్తే ప్రణాళికే నయం అనిపించింది. కొత్త పాఠకులకు తెలుగు ప్రణాళిక ఎందుకంత జఠిలంగా ఉంది? దానికి కారణం భావనల్లో ఉన్న క్లిష్టతా, అనువాదం తెచ్చిపెట్టిన క్లిష్టతా? రెండోదే ప్రధానం అన్నది నా అవగాహన. నిజానికి ప్రణాళిక ముందుమాటల్లో అర్థంకాని భావనలంటూ పెద్దగా ఉండవు. వాటిల్లో సమాచారమే ఎక్కువగా ఉంటుంది. భాష తెచ్చిపెట్టిన ఇబ్బందుల్లో చాంతాడు వాక్యాలది పెద్ద పాత్ర. భావనలను అర్థం చేసుకోవడంలో బొత్తిగా కష్టంలేదని కాదు. చారిత్రిక నేపథ్యం తెలియకపోవడం వల్ల కూడా పఠనం సాగదు. ఈ ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే పాఠకునికి తగిన శిక్షణ అవసరమే. ఒకటికి రెండు సార్లు చదవడమూ చదివినదానిని మిత్రులతో చర్చించడమూ వంటివి స్వీయ శిక్షణకు మార్గాలు. ఇంతకుముందు ప్రణాళికను అనువదించిన వారిలో కంభంపాటి సీనియర్‌, రాచమల్లు రామచంద్రా రెడ్డి వంటి మహామహులున్నారు. వారిని స్మరిస్తూనే ప్రణాళికను మరింత సరళంగా మార్చే ప్రయత్నం చేశాను. భావనలను అర్థం చేసుకోవడంలో పాఠకులకు ఎదురయే సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. భాష వల్ల వచ్చిపడిన ఇబ్బందుల్ని తొలగించడానికి మాత్రం శ్రద్ధగా ప్రయత్నించాను.
కమ్యూనిస్టు ప్రణాళికతో పాటు ఏంగెల్స్‌ రాసిన కమ్యూనిజం సూత్రాలు అనే చిరు పుస్తకం ప్రశ్న జవాబుల రూపంలో ఉంటుంది. పార్టీ కార్యక్రమం రాయమని కమ్యూనిస్టు లీగ్‌ అడగగానే ముందు ఏంగెల్స్‌ రాసిచ్చినదది. తర్వాత మార్క్స్‌ ఏంగెల్స్‌ కలిసి మళ్లీ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. రెంటిలోనూ విషయం ఒక్కటే, కాని శైలిరీత్యా, గాఢత్వం రీత్యా రెంటి మధ్యా తేడా ఉంది.
ఏంగెల్స్‌ పుస్తకం మరింత సులభంగా ఉంటుంది. అది నిండైన చెరువులా ఉంటే, ప్రణాళిక ప్రవహించే నదిలా ఉంటుంది. మొదటిది నడక వేగంలో ఉంటే రెండోది పరుగు వేగంలో ఉంటుంది. మొదటి పుస్తకం ప్రధానంగా వివరణాత్మకం. ప్రణాళికలో వివరణ ఉంటుంది. విశ్లేషణ ఉంటుంది. వాదన ఉంటుంది. అన్నిటినీ మించి, బూర్జువా వ్యవస్థపై విసిరిన ఒక తీవ్ర సవాల్‌ ఉంటుంది. శరీర వ్యాయామం చేసేవారు సాధారణంగా ముందు కాసేపు నడిచి, తర్వాత జాగింగ్‌ చేస్తారు. అధ్యయనం కూడా రోజూ చేయాల్సిన వ్యాయామమే. అందుకే ముందు కమ్యూనిజం సూత్రాలు చదివి తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక చదివితే అది మరింత తేలిగ్గా ఒంటబడుతుంది. ప్రపంచాన్ని కుదిపిన అతికొద్ది పుస్తకాల్లో ప్రణాళిక ఒకటి. సాహిత్యం ఉన్న ప్రపంచ భాషలన్నిటిలోనూ ప్రణాళిక వెలుగు చూసింది.
ఒక్కో భాషలోనూ అనేక అనువాదాలు పొందిన పుస్తకం కూడా ప్రణాళికే. భూస్వామ్య వ్యవస్థలో పీడితులుగా ఉన్నవాళ్లే క్రమంగా బూర్జువా వర్గంగా ఎలా రూపొందారో ప్రణాళిక వివరిస్తుంది. ఆ వర్గం ఎలా ఎదిగిందో చూపిస్తుంది. బూర్జువా వర్గం చరిత్రలో అత్యంత ప్రగతిశీల పాత్ర నిర్వహించిందని గుర్తిస్తుంది. అంతలోనే మానవ సంబంధాలన్నిటినీ అది డబ్బు సంబంధాలుగా మార్చేసిందని ఎత్తి చూపుతుంది. ఒకప్పుడు ప్రగతిశీల శక్తిగా ముందుకొచ్చిన బూర్జువా వర్గం ఎంత ప్రగతి వ్యతిరేకంగా ఎంత అమానుషంగా మారిందో గతి తార్కికంగా చూపుతుంది. ఆ వర్గం అందించిన ఆయుధాలతోనే దాన్ని కూల్చే పని శ్రామికవర్గానిదే అని స్పష్టం చేస్తుంది. శ్రామికవర్గం క్రమంగా వర్గాలు లేని సమాజాన్ని నిర్మించడం ద్వారా తనని తాను రద్దు చేసుకొంటుందని కాదనడానికి వీల్లేని విధంగా నిరూపిస్తుంది…
` ఎ.గాంధి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img