Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మట్టివాసన వదలని మధురకవి కేదార్‌నాథ్‌ సింగ్‌

పై చదువులకోసమో, ఉపాధికోసమో ఉన్న ఊరు వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లవలసి రావడం అనివార్యం. కాని మూలాలను వదల కుండా, కొత్త అనుభవాలతో సమన్వయం సాధించడం సాహిత్యకారుల ప్రతిభకు, నిష్ఠకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌ లోని బలియా జిల్లా చకియా గ్రామంలో జన్మించిన ప్రసిద్ధ హిందీ కవి కేదార్‌ నాథ్‌ సింగ్‌ (1934 జులై 7) తాను పుట్టిన మట్టి వాసన వదులుకోలేదు. వృత్తి రీత్యా, ఉద్యోగ విరమణ తర్వాత దిల్లీలో స్థిరపడ్డా తాను పుట్టిపెరిగిన ప్రాంతంతో సంబంధం విడనాడలేదు.
కేదార్‌నాథ్‌ సింగ్‌ కాశీ హిందీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ., పిహెచ్‌.డి. పట్టాలు పొందారు. కొంతకాలం గోరఖ్‌ పూర్‌ లో హిందీ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. తర్వాత దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో భారతీయ భాషల పీఠంలో హిందీ విభాగం అధిపతిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సాహిత్య విమర్శ రంగంలో కృషి చేసినా, అనేక వ్యాసాలు రాసినా ప్రధానంగా ఆయన కవే.
కేదార్‌నాథ్‌ కవిత్వ భాష, శైలి సులభమైనవే. కాని ఆయన భావచిత్రాలు వినియోగించడంలో దిట్ట. ఆధునిక హిందీ సాహిత్యకారుడిగా ప్రసిద్ధుడు. ఆయన కవిత్వంలో లయాత్మకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చెప్పే విషయంలో స్పష్టత, కరుణ, సమకాలీన పరిణామాల ఆధారంగా కవితా వస్తువు సమకూర్చుకోవడం కేదార్‌ నాథ్‌ సింగ్‌ విశిష్టత. ఆయన కవిత్వంలో భావచిత్రాలు, ప్రతీకాత్మత ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా కాలక్రమేణ ఆయన మనోవైజ్ఞానిక విశ్లేషణలో అందె వేసిన చేయి అనిపించుకున్నారు. ఆయన కవిత్వంలో పదోల్బణం తక్కువ.
జర్మన్‌ రచయిత బెర్టోల్‌ బ్రెప్ట్‌ా, బాదిలేర్‌, రిల్కే కవిత్వాన్ని కేదార్‌ నాథ్‌ హిందీలోకి అనువదించారు. ఆయన కవిత్వం దాదాపు ప్రధాన భారతీయ భాషలన్నింటితో పాటు ఇంగ్లీషు, స్పానిష్‌, రష్యన్‌, జర్మన్‌, హంగేరియన్‌ లాంటి విదేశీ భాషల్లో వెలువడిరది. అనేక దేశాలలో కవిత్వం వినిపించారు.
కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో గ్రామీణ ప్రాంతాలు ఎంత బలంగా, విస్తారంగా కనిపిస్తాయో పట్టణ నాగరికత కూడా అంతే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని చిత్రీకరించినట్టే పట్టణ నాగరికతను గ్రామీణులకు పరిచయం చేస్తారు. ఈ రకంగా ఆయన గ్రామీణ, నగర జీవన విధానాల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించారు.
గ్రామాల్లో వస్తున్న మార్పును గమనించి అక్షరబద్ధం చేస్తారు. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అంగీకరిస్తారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు మారిపోతున్న మాట వాస్తవం. మా ఊరే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. గ్రామాలు మారకుండా ఉండని పరిస్థితి నగరాలు కల్పిస్తున్నాయి. మార్కెట్‌ గ్రామాల్లో మార్పును అనివార్యం చేస్తోంది. ప్రస్తుతం మనం గ్రామాల్లో కాని, నగరాల్లో కాని నివసించడంలేదు. మార్కెట్లో ఉంటున్నాం. అందువల్ల సంస్కృతికి దూరం అవుతున్నాం. ఇదే పరాయీకరణ. పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు, నగరాలకు వెళ్లే వాళ్లు అక్కడ ఫుట్‌ పాత్‌ లమీదో, మురికివాడల్లోనో ఉంటారు కాని మళ్లీ గ్రామాలకు వచ్చి సేద్యం చేయరు. అందుకే గ్రామాలు అంతరిస్తున్నాయి. మన దేశంలో ఈ దుస్థితి ఉంటే చైనాలో గ్రామాలు చెక్కు చెదరలేదు’’ అంటారు కేదార్‌ నాథ్‌. అయితే ఆయన సాహిత్యంలో గ్రామాలు అంతరిస్తున్నందుకు అంగలార్చరు. అవి ఆయనకు పాత జ్ఞాపకాల దొంతరలు కావు. గ్రామాల పరిస్థితి ఆయనను చైతన్యవంతం చేస్తుంది. కవితా రచనకు ప్రేరణ కలిగిస్తుంది.
మార్పులను గమనించకపోతే, గత కీర్తిగానంలో మునిగిపోతే ముందుకెళ్లడం కుదరదన్నది ఆయన భావన. అందుకే ఆయన కవిత్వంలో సమకాలీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కవి సంప్రదాయం పునాది మీద కాళ్లూని భవిష్యద్దర్శనం చేయాలంటారు.
హిందీ సాహిత్య రంగంలో భావ కవితా ధోరణి వెనకపట్టు పట్టి అభ్యుదయ కవిత్వ ధార ప్రబలంగా ఉన్న కాలంలో రీతిలో జాతీయతను, వస్తువులో విమర్శనాత్మక వాస్తవికతను ఆలంబనగా చేసుకుని కేదార్‌ నాథ్‌ సింగ్‌ తన మార్గాన్ని నిర్దేశించుకున్నారు. సవిమర్శక జీవిత వాస్తవికతా చిత్రణకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కనిపించే ప్రశాంతత, అభిమానాలు ఎంత బాగా చిత్రించగలరో రైతుల కడగండ్లు, నిత్యజీవిత సమస్యలను అంతే ప్రతిభావంతంగా రూపు కట్టించగలరు.
కేదార్‌నాథ్‌ సింగ్‌ మొదట పాటలు కట్టేవారు. ఆ తర్వాత కవిత లల్లారు. కాని కవిత్వానికి, పాటకు మధ్య తేడాలేదని, రెండిరటిలోనూ కవితాస్పర్శ ప్రధానమంటారు. సూర్‌దాస్‌, తులసీదాస్‌ లాంటి వారు గొప్ప పాటలు రాసినంత మాత్రాన వారు కవిత్వం రాయలేదనడం కుదర దంటారు. భావ కవిత్వోద్యమం అంతమై, అభ్యుదయ కవిత్వం కూడా కనుమరుగై పోతున్న దశలో తాను నవ్య కవితా మార్గాన్ని అనుసరించా నంటారు కేదార్‌ నాథ్‌. పాటలు కట్టడం అంటే హృదయ వేదనను విప్పి చెప్పడం అన్నది ఆయన భావన. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినందు వల్ల ఆ ప్రభావం తన మీద ఎక్కువగా ఉందని, జానపద కథలు, గాథలు, సంప్రదాయాలతో తనజీవితం పెనవేసుకుపోయిందంటారు. ఆయన తండ్రి సంగీతాభిమాని కావడంవల్ల ఆ సంస్కారం తనకూ అబ్బిందంటారు.
తాను కవితలల్లడం ప్రారంభించినప్పుడు భావకవితోద్యమం అవశేషాలు ఉన్నందువల్ల పాటలు కట్టానని చెప్తారు. పాటే కవిత్వం అనుకునేవాడినంటారు. కాని ప్రయోజనకరమైన విషయం వివరంగా చెప్పాలంటే పాట పరిమితంగా కనిపిస్తుంది కనక కవిత్వాన్ని వాహికగా చేసుకోవాల్సి వచ్చిందంటారు. కేదార్‌ నాథ్‌ సింగ్‌ బాఫ్‌ు వంటి దీర్ఘ కవితలు రాశారు. అందులో పులి ప్రధాన పాత్ర. 1980లలో రాసిన ఈ దీర్ఘ కవితకు అపారమైన ఆదరణ ఉంది. అనేక విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్యాంశమైంది.
కేదార్‌నాథ్‌ గాలిబ్‌ అభిమాని. గాలిబ్‌ గజళ్లకు ప్రసిద్ధుడు. కాని గాలిబ్‌ కూడా విషయ విస్తృతి ఉన్నప్పుడు గజల్‌ పరిధి తక్కువ అని భావించారు. తనదీ ఇదే వైఖరి అయినందువల్ల కవిత్వం ఎక్కువగా రాశానంటారు. తాను చెప్పదలచుకున్న విషయానికి ఛందో బందోబస్తులు ఆటంకంగా తయారైనప్పుడు ఆ చట్రానికి అతీతంగా రాశానంటారు.
కవితా వస్తువు నవీనమైంది, సమకాలికమైంది అయినా అభివ్యక్తి బలంగా ఉండాలంటే ఏ కవైనా తన సొంత పదజాలం ఏర్పరచుకోవాలి. ఈ పదజాలం సృష్టించుకున్నందువల్లే కేదార్‌ నాథ్‌ సొంత గొంతుక వినిపించగలిగారు. కేదార్‌ నాథ్‌ నదీ తీరంలో పెరిగారు. ఆయన పెరిగిన భోజ్‌పూర్‌ ప్రాంతం పేదరికంలో కూరుకుపోయింది. వెనుకబాటుతనం ఎక్కువ. అందుకే తన కవిత్వంలో వెనుకబాటుతనం మీద పోరాటం, పేదలపట్ల సానుభూతి ఉంటాయంటారు.
భావకవుల్లో కనిపించే ఊహాత్మకత, అభ్యుదయ కవుల భిన్నమైన అభివ్యక్తి తన కవిత్వంలో ఉన్నా పదచిత్రాలకోసం పనిగట్టుకుని ప్రయత్నించనంటారాయన. సాహిత్య విమర్శ రంగంలో తన కృషి స్వల్పమైందేనన్నది ఆయన అభిప్రాయం. ఎక్కువగా కవిత్వమే రాసినా తాను కవినో కానో తెలియదనే నిగర్వి కేదార్‌ నాథ్‌.
‘‘భారతీయ కవిత్వం అంతా ఒక చోట చేరిస్తే అనంత వర్ణాలు ద్యోతకం అవుతాయి. ఇంత రాగరంజితమైన కవిత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. కవిత్వంలో వైవిధ్యం వేరు. కవితా కుశలత వేరు. భారతీయ కవిత్వఛాయలన్నీ అందరికీ అందుబాటులోకి రావాలి. కాని మనకు మంచి అనువాదకుల కొరత ఉంది. బల్గేరియా భాష మాట్లాడె వారి సంఖ్య తక్కువే కావొచ్చు. కాని అక్కడ ఏ మంచి రచన వచ్చినా అది వివిధ భాషల్లోకి అనువదిస్తారు. మనకు ఆ వెసులుబాటు తక్కువైనందువల్ల భారతీయ సాహిత్యానికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. మన సాహిత్యాన్ని కూడా విస్తృతంగా అనువదించాలి’’ అని కేదార్‌ నాథ్‌ సలహా.
సాహిత్యంలో సంబంధం ఉన్న వారు మాత్రమే సాహిత్యాన్ని పట్టించుకుంటున్నారు. సామాన్యులు సాహిత్యానికి దూరం అవుతున్నారు అన్న వాదనను కేదార్‌ నాథ్‌ అంగీకరించకపోయినా పాఠకుల రసికతను మీడియా విరూపం చేస్తోందన్నది ఆయన బాధ. అసలైన సాహిత్యానికి, జనామోద సాహిత్యానికి మధ్య సమతూకం ఉండాలని, భవిష్యత్తులో ఇది సాధ్యం అవుతుందన్న ఆశాభావం కేదార్‌ నాథ్‌ కు ఉంది.
కేదార్‌ నాథ్‌ కృషికి తగ్గట్టే ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు, మైథిలీ శరణ్‌ గుప్త్‌ సమ్మాన్‌, కుమారన్‌ ఆశాన్‌ పురస్కారం, జీవన్‌ భారతి సమ్మాన్‌, దినకర్‌ పురస్కారం, వ్యాస సమ్మాన్‌ తో పాటు 2013లో ఆయనకు జ్ఞానపీఠ్‌ అవార్డు కూడా దక్కింది.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img