Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మార్కి ్సజం మార్గంలో ‘మాదిగ పల్లె’ నవల

పెనుగొండ లక్ష్మీనారాయణ
అధ్యక్షుడు, అరసం జాతీయ సమితి
సెల్‌: 9440248778

తెలుగు పాఠకులకు సుపరిచితమైన నవల మాలపల్లి. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. విమర్శలు, విశ్లేషణలూ వచ్చాయి. ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. 1922 లో ప్రచురితమైన మాలపల్లి నవలపై గాంధీజీ జాతీయోద్యమ ప్రభావం, 1917 లో రష్యాలో వచ్చిన బోల్షివిక్‌ ప్రభావం ఉంది. ఈ నవలలోని సంగదాసు దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తారు. గాంధీజీ భావజాలంపై అచంచల విశ్వాసం కలిగిన ఉన్నవ లక్ష్మీనారాయణ తక్కెళ్ల జగన్నాథం ద్వారా ‘బుర్రకథ’ లో చెప్పిన విషయాలు పూర్తి మార్క్సిస్టు అవగాహన, చైతన్యంతో కార్మిక వర్గ పక్షపాతంతో చెప్పినట్లు స్పష్టమౌతుంది. ప్రసిద్ధ సాహితీవేత్త, అనువాదకులు సహవాసి మాలపల్లిని గురించి చెప్పిన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ‘‘మార్క్సిజం మూల పురుషుడు కారల్‌మార్క్సు ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’’ అని ఇచ్చిన పిలుపునకు ప్రతిధ్వనిగా ‘పనివాళ్లందరు ఏకమైతిరాప్రపంచమే మీది’ అని తత్వం పాడిరచడం ద్వారా గాంధేయవాది అయిన ఉన్నవ సామ్యవాద వ్యవస్థను సమర్థించారు. మాలపల్లి అనంతరం 76 సంవత్సరాల తరువాత 1998 లో వచ్చిన నవల ‘మాదిగపల్లె’. రచయిత పెరుగు నాసరయ్య. వారిది బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం. 1929 లో జననం. బి.ఏ.బి.ఇడి చదివి ప్రధానోపాధ్యాయులుగా రిటైరయినారు. వారు అనేక రచనలు చేశారు. అందులో కూలి విజయం (నాటిక1952), శ్రామిక గీతాలు (1985), ఈ పోరాటం ఆగదు (కథలు 1993), బాలవీరులు (గేయకథలు 1994), పోరుబాట నవల (1996), కల్లుగీత సత్తెయ్య (నవల), వీరి కథానిక ‘బతుకు పోరు’ (యానాదుల జీవితంపై1994) దేశమంటే ప్రజాసాహితీ కథా సంకెలనం ఆగస్ట్‌ 1999 లో ప్రచురితం. వీరి ఈ రచనల శీర్షికలే వారి భావాలను ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రస్తావిస్తున్న ఈ నవల ‘మాదిగపల్లె’ను బుక్స్‌ అండ్‌ బుక్స్‌ (విశాఖపట్నం) 1998లో ప్రచు రించింది. వంద పుటల నవల యిది. ఈ పుస్తకానికి ‘ప్రయాణ దిశ’ శీర్షికతో డా.మానేపల్లి సత్యనారాయణ ముందుమాట రాశారు. అందులో ‘‘ఒక బ్రాహ్మణ మేధావి అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలను రచించి తమ వర్గానికి మాల, మాదిగలపై గల అభిప్రాయాన్ని వెల్లడిరచారు. అది ఉత్తమ నవలగా అపారమైన కీర్తి గడిరచింది. అది మాలపల్లి కాదు. బ్రాహ్మణపల్లి అనే విమర్శ 1990 ప్రాంతంలోనే వినిపించింది. వైష్ణవ భక్తి భావ బోధన మాలపల్లిలో ఎంత బలంగా ఉందో అప్పటికిగాని మనకి గుర్తింపు రాలేదు. (శిల్పరీత్యా మంచి నవల, సమకాలీన చరిత్రకు అద్దం పట్టింది అనేది వేరే కోణం) మానేపల్లి ఈ విమర్శకు ఏ ఆధారమూ చూపలేదు. ఇప్పుడు దళిత కులంలో పుట్టిన పెరుగు నాసరయ్య మాదిగపల్లె నవల రాశారు. శిల్ప రీత్యా, నిడివిరీత్యా దీనిని మాలపల్లెతో పోల్చలేమనేమాట నిజమే కావచ్చు. దాని చిత్తశుద్ధి? మాలమాదిగల అభివృద్ధిని కాంక్షించే చిత్తశుద్ధి! ఈ విషయంలో మాలపల్లికీ మాదిగపల్లెకు పోలికే లేదు అని మానేపల్లి సత్యనారాయణ తేల్చేశారు.
మానేపల్లి ఇంకా… ‘మాల మాదిగలు ఒకరికొకరు శత్రువులయ్యారు. వీరు ఉమ్మడి శత్రువైన అగ్రవర్ణ పాలక వర్గాలని మరిచారు. కోటా ప్రకారం రిజర్వేషన్ల విభజన సంగతి ఎలా ఉంచినా వీరిద్దరూ కలిసి పాలక వర్గ దోపిడీతత్వంపై పోరాటం సాగించాలి. ఆ మేరకైన వారి మధ్య ఐక్యత తప్పనిసరి అని సలహా ఇచ్చారు. తాను మాత్రం వర్గీకరణలో ఎటువైపో తప్పించుకునేధోరణిలో వ్యవహరించారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. అభ్యుదయ రచయితల సంఘం వర్గీకరణలో మాదిగల వైపు నిలబడిరది, కొనసాగిస్తుంది. (ఈ పుస్తకానికి సంపాదకుడిగా కూడ వ్యవహరించిన మానేపల్లి పుస్తక ప్రచురణలోనూ అలాగే పాత్రల పేర్లకు సంబంధించి ఏ మాత్రం జాగ్రత్త వహించలేదు. (ఒకే పేరు సుశీల రెండు పాత్రలకు ఏంది. ఈ పుస్తకాన్ని వేరొకరు ఎవరు ప్రచురించినా వెలుగులోకి వచ్చేది. పుస్తక ప్రచురణ ఖర్చు భరించింది రచయితే.)
రచయిత నాసరయ్య ‘చైతన్యం కోసం’ శీర్షికన మూడు పుటలలో తన మాట రాసుకున్నారు. ఇందులో ‘అస్పృశ్యులు చైతన్యవంతులు కావాలి. ఐకమత్యాన్ని సాధించి పోరాటాలకు నాయకత్వం వహించి అంతిమ విజయం సాధించే వరకు విశ్రాంతి తీసుకోకూడదు. అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నేలకూల్చి శ్రామిక వర్గం విజయం సాధించాలి అని ఆశయాన్ని వివరించారు. ఇంకా ‘చైతన్యం కోసం’ కు అనుబంధంగా ‘తాజాకలం’ శీర్షికన రాసిన మాటలు ఎంతో ముఖ్యమైనవి. అవి: ‘‘ఆంధ్రలో దళితోద్యమము మార్క్సిజము మీద అపనమ్మకముతో సాగుతున్నది. కొన్ని ప్రాంతాలలో మార్క్సిజానికి వ్యతిరేకంగా సాగుతున్నది. అంబేద్కరిజం మార్క్సిజం కంటె గొప్పదనే దురభిప్రాయంతో సాగుతున్నది. నిజం అని దేనిని పిలవాలో నిజానికి నిర్వచనమేమిటో అర్థం చేసుకోకపోవటమో, గుడ్డి వ్యతిరేకతలు మాత్రమే దీనికి కారణం.
పెట్టుబడిదారి సమాజంలో ఏ సమస్యనయినా, ఏ పోరాటాన్నయినా అర్థం చేసుకోవటానికి మార్క్సిజమ్‌ ముఖ్య ఆధారం. ఆ జ్ఞానం లేక పోవడం మూలముననే దళితోద్యమం చీలికలై మాదిగ దండోరాగా మాల మహానాడుగా చీలి ఒకరిని మరొకరు ద్వేషించుకునే స్థితికి వచ్చారు. సమస్య మీద డోపిడీకి ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని అర్థం చేసుకోలేని అసమర్థత బైటపడిరది. మార్క్సిస్టు అవగాహనతో మాలమాదిగ ఉద్యమ కారులకు కనువిప్పు కలిగేలా మరో పుస్తకం తీసుకురావడం అవసరం అనుకుంటున్నారు. (లోగడ ‘పోరుబాట’ నవలను కూడా అస్పృశ్యులలో చైతన్యం కోసం రాశానని కూడా పేర్కొన్నారు) ఈ మాటల ద్వారా నాసరయ్యకు మార్క్సిజంపట్ల ఉన్న జ్ఞానం, విశ్వాసం ఎంతగానో స్పష్టమవు తుంది. ఇటీవల జిగ్నేశ్‌మేనాని అనే శాసనసభ్యుడు, దళిత ఉద్యమనేత ‘కమ్యూనిస్టులు దళితులకు విశ్వసనీయమిత్రులు వారితో కలిసి కొనసాగాలని’ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను.
నవల నడక
ఈ నవల 110 పుటల పుస్తకం. ముందు మాటలు 10 పుటలు పోను నవల అంతా వంద పుటల్లో 18 అధ్యాయాలుగా విభజితమైంది. నవలా నాయకుడు అమరయ్య, ఉపనాయకులు అమరయ్య సంతానమైన సుందర రావు, ఆనందరావు, సుశీలప్రతినాయకుడు భూపతిరావు. నవలా కేంద్రం: ధనదవోలు గ్రామానికి దగ్గరలోని మండేవారి మాలపల్లె. ఇది మాల కులానికి చెందిన నాసరయ్య రాసిన నవల. నవల కొనసాగింపు ధనదవోలుగ్రామంలో శ్రీరాముని గుడివద్ద శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రవచనాన్ని ఆగి వింటున్న అమరయ్యను ‘ఓరేయి అమిరిగా లేవరా అక్కణ్ణుంచి...మాల వెధవ!’ అని భుజంగరావు గుమాస్తా తిడతాడు. దీనితో కలత చెందిన అమరయ్య పల్లె ప్రజలకు విషయాన్ని వివరిస్తాడు. పల్లెలోనే రామాలయాన్ని కట్టాలని అందరూ నిర్ణయించుకుని నిర్మిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దీనితో పల్లెపై పెత్తనం పోతుందని భావించిన భూపతిరావు చినజియ్యరుస్వామిని తీసుకొనివచ్చి పల్లెలో రామాలయం ఉండగూడదని చెప్పిస్తాడు. ‘‘మీరు అంటరానివాళ్లగా దరిద్రులుగా పుట్టటానికి గత జన్మలో మీరు చేసుకున్న పాపపుణ్యాలే కారణం. ఈ జన్మలో పుణ్యాలు చేసుకోండి. మరుజన్మలో మీకు మంచి గతులబ్బుతాయి. మీ పల్లెలో రామాలయం నిర్మించి రాముణ్ణి బంధించారు. దేశంలో ఎక్కడ ఏ మాలపల్లెలో దేవుడికి ఆలయాలులేవు. మీ పల్లెలోఆలయం అరిష్టదాయకం. వెంటనే ఆ ఆలయాన్ని మూసెయ్యండి అని చినజియ్యరుస్వామి చెప్పిన మాటలు ఆ చినజియ్యరు స్వామిని ఎంతగానో అభిమానించే అమరయ్యకు రుచించలేదు. అవి అబద్దపుమాటలని తేల్చుకుంటాడు. దేవుడు మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. అమరయ్యలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు అంటరానివాళ్లం ఎందుకయ్యాం. హిందూమతంలోని అనేక అసంగత విషయాలపై తనలో తనే తర్కించుకుంటాడు. చర్చించుకుంటాడు. ఇంతలో క్రైస్తవ ఫాదర్‌ అమరయ్యకు చేరువవుతాడు. అమరయ్య క్రైస్తవమతంలో చేరి యేసోబుగా మతాంతీకరణ చెందుతాడు. పల్లెలో పాఠశాల ఏర్పాటవుతుంది. దానిని రామాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. ఈ మతాంతీకరణకు ముందే గ్రామంలో పల్లెవాసులు కూలీలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కూలికి గింజలు బదులు రొక్కం యివ్వాలని పల్లె జనులచేత సమ్మెకట్టించి అమరయ్య విజయంసాధించాడు. పల్లె శ్రామికు లకు అమరయ్య మీద విశ్వాసం, గౌరవం పెరుగుతాయి. పల్లెపైన పట్టు కోల్పోయిన భూపతిరావు అమరయ్యను యిబ్బందులకు గురి చేయాలని నిర్ణయించుకుంటారు. అమరయ్య కౌలుకు చేసుకుంటున్న పదెకరాలలో ఐదెకరాలు ఆ వూరికి చెందిన శాస్త్రిది. పట్టణంలో ఉంటున్న శాస్త్రివద్దకు వెళ్లి ఆ భూమిని అమరయ్య కౌలునుండి తొలగించ మని కోరినా శాస్త్రి తిరస్కరిస్తాడు. శాస్త్రికి భూపతిరావు అతని కులంపైన కోపం ఉంది. వారి వల్లనే తాను ఆ వూరు వదలి రావలసి వచ్చిందనే బాధ కూడా ఉంది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్నే అందుకు కారణంగా భావిస్తాడు. భూమి అమరయ్య కౌలులోనే ఉంటే క్షేమమని భావిస్తాడు శాస్త్రి. గ్రామంలోని హోటళ్లలో అమలవు తున్న రెండు గ్లాసుల విధానాన్ని నిరసిస్తూ మాలవాళ్లు ఆ హోటళ్లకు వెళ్లకుండా పల్లెలోనే హోటల్‌సౌకర్యాన్ని కల్పించు కున్నారు. అమరయ్య కొడుకు సుందరరావు పదో తరగతి చదువుకున్నాడు. అతనిలో సామాజిక చైతన్యం, కుల చైతన్యం ఉన్నాయి. అతనిపై భూపతిరావు దొంగతనం మోపి కొట్టిస్తాడు. పల్లెవారు భూపతిపై తిరగబడతారు. పల్లెలో ఐక్యత పెరిగింది. పల్లెవారు మంచి బట్టలు వేసుకునేట్లు చేస్తాడు సుందర రావు. అమరయ్య కూతురు సుశీల పొలానికి వెళ్లినప్పుడు అత్యాచారానికి, హత్యకు గురవుతుంది. ఆ దుండగుడిని పట్టుకుని శాశ్వత వికలాంగుడిని చేస్తారు ఆనందరావు, పల్లెలోని యువకులు. అమరయ్య కొడుకు ఆనందరావు డాక్టర్‌ చదివి పక్క పట్టణంలో ఆస్పత్రి నిర్మించి దళిత వర్గాలకు అంబేద్కర్‌ ఆరోగ్య కేంద్రం పేరుతో వైద్యసేవలు అందిస్తున్నారు. మంచిపేరు తెచ్చుకున్నాడు. మండల కమీషన్‌ ఏర్పాటయిన సందర్భంలో ఆ ఆస్పత్రిపై దాడి జరుగుతుంది. విధ్వంసం జరుగుతుంది. ఆ దాడిలో ఆనందరావు తీవ్రంగా గాయపడతాడు. కాలక్రమంలో భూపతిరావు శాసనసభ్యుడవుతాడు. మండేవారి మాలపల్లె లోనే ఒక పక్కవున్న మాదిగపల్లెను తరలించాలని ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న భూమిని తాను వశపరుచుకుని ఎరువుల ఫ్యాక్టరీని నిర్మిస్తాడు భూపతిరావు. కార్మిక సంఘం ఏర్పాటై హక్కుల కోసం పోరాడుతుంది. ఫ్యాక్టరీలో పనిచేసే యిద్దరు మహిళలను మానభంగం చేసి హత్య చేశారు. కార్మిక సంఘం ఒత్తిడితో కేసు పమోదవుతుంది. సుందరరావు తన సమీప గ్రామానికి చెందిన బి.ఏ చదివిన సువార్తను ఆదర్శవివాహం చేసు కుంటాడు. అంతకుముందు జరిగే వివాహాల మాదిరికాకుండా సాంఘిక వివాహం. దండలమార్పిడి ద్వారా జరుగుతుంది. ఆదర్శభావాలు కలిగిన సువార్త పల్లెకుచెందిన మహిళలను సమావేశపరచి రాత్రి పాఠశాల ఏర్పాటుచేసి వారిని చైతన్యపరుస్తుంది. భర్తల తాగుబోతుతనాన్ని ఎలా అరికట్టాలో, పొదుపు ఎలా చేయాలో తెలుపుతుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక పథకాలను వారికి చేరువ చేస్తుంది. శ్రమ విలువ గురించి వారికి చక్కగా తెలియజేస్తోంది. అమరయ్య చిన్న కూతురు సుశీల. కళాశాలలో చదివేటప్పుడే విద్యార్థి ఉద్యమాలలో చురుకైన కార్యకర్త. మంచి వక్త. అభ్యుదయ, హేతువాద భావాలు కలిగిన తన సహ విద్యార్థిని ఆదర్శ వివాహం చేసుకుంటుంది. సుందరరావు దళిత మహాసభ నాయకుడిగా ఎదుగుతున్నాడు. దళితుల ఐక్యత కొరకు ఊరూరా తిరిగి కృషి చేస్తున్నాడు. అమరయ్య పల్లె మొత్తానికి నాయకుడయ్యాడు. పల్లెకు కావలసిన శ్మశానాన్ని సాధిస్తాడు. పల్లె ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తాడు. అమరయ్యకు కుల, మత విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దళిత వర్గాల ఐక్యత మాత్రమే దళిత వర్గాల ప్రగతికి తోడ్పడగలదనే స్పష్టమైన ఆలోచనకు వచ్చాడు. అమరయ్య ఆలోచనలతో దళితుల పొలాల వద్ద చెరువు ఏర్పడుతుంది. పంటలు బాగా ఎండుతాయి. భూపతిరావు పల్లె ప్రజల భూమిని దక్కించుకోవాలని పోలీసుల సహాయంతో, అధికార బలంతో ప్రయత్నిస్తాడు. కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో అమరయ్యతో పాటు మరో ఇద్దరు మృతి చెందుతారు. కొందరు గాయాలపాలయ్యారు. అమరజీవి అమరయ్యకు పల్లెవాసులు ఘనంగా వీడ్కోలు చెప్పి స్మారక స్థూపం నిర్మాణం చేస్తారు. అమరయ్య అందించిన ‘దున్నేవాడిదే భూమి’ సందేశంతో ఇకపై భూస్వాములు, పెట్టుబడిదారులు కాకుండా తామే అధికారంలోకి రావాలనే ఆలోచనకు పల్లె ప్రజలు వచ్చారు. ‘ఓట్లన్నీ మనవే మన ఓట్లన్నీ మన వాడికే’ అని నిర్ణయించుకున్నారు. సుందరరావు ఈ ఆలోచనకు సూత్రధారి. జనాభా లెక్కలు ప్రభుత్వం తీయించాలి. కుల గణన జరగాలి. ఏ కులం ఎంత శాతం ఉందో ఆ మేరకు వారికి అధికారం కలగాలి. దామాషా పద్ధతి సరైనదిఅది అవసరమైనది అని సుందరరావు చెప్పిన మాటలు సరైనవేనని అందరూ అన్నారు. (కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన చేయాలని అనేక రాజకీయ పక్షాలు నేడు పట్టుబట్టటాన్ని గమనించాలి). ఆ గ్రామంలో కులాల వారీగా ఎవరికి ఏ పదవి ఉండాలో అని నిర్ణయం జరిగింది కుల జనాభాను బట్టి. అగ్నికుల క్షత్రియుల జనాభా ఎక్కువ కాబట్టి వారికి ప్రెసిడెంట్‌ పదవి యివ్వాలన్నారు. అయితే వారు సుందరరావును ప్రెసిడెంట్‌ పదవికి ప్రతిపాదిస్తారు. ఎన్నికలు జరిగాయి. భూపతిరావు వర్గం చిత్తుగా ఓడిపోయింది. సుందరరావు వర్గం గ్రామాధిపత్యం సాధించింది. ఈ నవలలో ఎస్‌.సి రిజర్వేషనుల వలన మాదిగలు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే దామాషాపద్ధతి కావాలనే ప్రతి పాదన వ్యక్తమయింది. వర్గీకరణకు మాల కులానికి చెందిన సుందరరావు అంగీకారం తెలపటం ద్వారా ఆ కులం కూడ వర్గీకరణకు అనుకూలం అనే భావన కలిగించారు. అంబేద్కర్‌, మార్క్స్‌ భావజాలాలను సుందరరావు పల్లె ప్రజలకు వివరిస్తాడు. మాల మాదిగల ఐక్యతను బలంగా ప్రతిపాదించాడు సుందరరావు. ‘‘మాలపల్లెకు మాదిగపల్లె నాయకత్వం వహించే రోజు సమీపంలోనే ఉందని కొందరు యువకుల మనసుల్లో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది’’. అని రచయిత పెరుగు నాసరయ్య ‘ముగింపు కాదు అధ్యాయం’ తో ఈ నవల సందేశాత్మకంగా ముగుస్తుంది. (అరసం ఆధ్వర్యాన గౌరవాధ్యక్షురాలు డా॥పి.సంజీవమ్మ అధ్యక్షతన 15`2022 న జరిగిన 83 వ జూమ్‌ సమావేశంలో చేసిన ప్రసంగానికి అక్షరరూపం.)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img