Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

అభ్యుదయ దృక్పథం నిండిన ముద్దుకృష్ణ కథా సాహిత్యం

పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి, సెల్‌: 9440248778

తెలుగు సాహిత్య చరిత్రలో ఎంతగానో ప్రసిద్ధిగాంచిన ముద్దుకృష్ణ నేపథ్యం విశిష్టమైనది. వీరి తాత స్వామినేని ముద్దునరసింహులు నాయుడు రచించినది ‘హిత సూచని’. తెలుగులో తొలి వ్యాస సంపుటి. వీరే తెలుగులో తొలి వ్యాసకర్త. వీరేశలింగం, గిడుగు వారిని ప్రభావితం చేసిన రచయిత. ముద్దుకృష్ణది ప్రగతిశీల దృక్పథమని ‘సమాజానికి కళ ప్రయోజనకారిగా ఉండాలి’ అనే వారి వ్యాసం ద్వారా స్పష్టమవుతుంది. ఏప్రిల్‌ 1945లో తెలుగుతల్లిలో తొలిసారి అచ్చయిన ఆ వ్యాసం అభ్యుదయ మార్చి 1988 సంచికలో పునర్ముద్రితమైంది. ఇది చాల చిన్న వ్యాసమయినా ముద్దుకృష్ణ అనేక విషయాలను పాఠకుల ముందుంచారు. చర్చ చేశారు. చర్చకు పెట్టారు.
అందులోని కొన్ని అంశాలు: ‘ప్రతి సమాజంలోనూ, ప్రతి కాలంలోనూ కవికీ సమాజానికీ సంబంధం ఉంది. కళ కళ కోసమే అంటే కలిగే ఉపకారం ఏమిటో చెప్పండి,’ ‘కళ ప్రచారానికి ఉపయోగించడం తప్పుకాదు. ఒక విశిష్ట లక్ష్యాన్ని తెలియ పరచడానికి కవి రాస్తాడు. కేవలం ప్రచారమే కళగా అంగీకరించమని ఎవరూ అనరు. తాత్కాలిక సమస్యలపై రాసినవి తాత్కాలికాలే, ఇక అభ్యుదయ రచయితల విషయంప్రాచీన సాంప్రదాయాలలో ఉత్తమమైన వాటినన్నిటిని అభ్యుదయ రచయితలు స్వీకరించి నూతన సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు.’ ప్రాచీన విజ్ఞానం గొప్పదయినా, అది మన గుండెలమీద బరువు కాకూడదు. అది మనకు ఉత్తేజం ఇచ్చి మన పురోభివృద్ధికి తోడ్పడాలి.1943లో ఆంధ్రలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం, దాని ప్రణాళిక ముద్దుకృష్ణను ప్రభావితం చేశాయని ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. ‘సారస్వతాన్ని ప్రజోపయోగానికి వినియోగించాలంటే తప్పేమిటి?’ అన్న ప్రశ్న ద్వారా తన అభ్యుదయ దృక్పథాన్ని ముద్దుకృష్ణ ప్రకటించారు. అప్పటికే ఉన్న నవ్య సాహిత్య పరిషత్తు ఏమి సాధించలేకపోయిందని స్పష్టం చేశారు. ముద్దుకృష్ణపై తన తాత నరసింహులు నాయుడు, తన తండ్రి రంగప్రసాద నాయుడుల ప్రభావంఉందని తెలుస్తుంది. ఇంకా ‘ముద్దుకృష్ణకు 1920నాటి జాతీయోద్యమ ప్రభావంవల్ల స్వాతంత్య్రాభిలాష కల్గింది. ఇదే 193233 జాతీయోద్యమంలో పాల్గొనటానికి ప్రేరేపించింది’ అని అరసం నిర్మాతలలో ఒకరైన ప్రసిద్థ అభ్యుదయ సాహితీవేత్త తుమ్మల వెంకట్రామయ్య 1973లో విశాలాంద్ర పునర్ముద్రించిన ‘వైతాళికులు’ కు రాసిన ‘సంస్మృతి’ లో వివరించారు.
ముద్దుకృష్ణ కథాసాహిత్యం: వీరి కథా సంపుటి 1941లో తొలిసారి ప్రచురితం. తరువాత 1969, 1987, 1989 (అక్టోబర్‌)లో పునర్ముద్రితం. నేను విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన 1969, 1989 సంపుటాలను చూశాను. 1989 సంపుటి ఆధారంచేసుకుని రాస్తున్న వ్యాసమిది. 1969లో విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ ప్రచురించిన ముద్దుకృష్ణ కథలు సంపుటిలో మొత్తం 13 కథలున్నాయి. 1989లో ప్రచురించిన సంపుటిలో మరో ఆరుకథలు బంగారమ్మ, జెలసి, రైలు ప్రయాణం, ఒక కరక్కాయ, హక్కులు1, హక్కులు2 కథలను చేర్చారు. మొత్తం కథలు 19. చలం రాసిన 1934లో జ్వాల పత్రికలో అచ్చయిన ‘జెలసి’ కథను యథాతథంగా యిందులో చేర్చారు. ముద్దుకృష్ణ మరణాంతరం పునర్ముద్రించిన సంపుటి యిది. జెలసి కథ ఈ సంపుటిలో చేరటం విశాలాంధ్ర వారి పొరపాటేనని స్పష్టమౌతుంది. ఎవరైనా విశాలాంధ్ర వారి 1989 సంపుటిని ఒక్కదానినే చూస్తే ముద్దుకృష్ణను తప్పక అనుమానించే అవకాశముంది. నేనూ పొరపాటుపడ్డాను. 69 నాటి సంపుటి చూశాక కుదుటపడ్డాను. కాబట్టి ఈ సంపుటిలోనివి 18 కథలుగా మాత్రమే పరిగణించాలి.
సామాజికత నిండిన కథలు: ముద్దుకృష్ణ కథలలో జాతీయోద్యమ భావాలు, సంఘ సంస్కరణ దృష్టి, స్త్రీల పట్ల అభిమానం, దళితులపట్ల సానుభూతి అంతస్సూత్రంగా అభ్యుదయ దృక్పథం చోటు చేసుకున్నాయి. మన భారతదేశంలో వలస కాలంలో అధికారాలు వెలగబెట్టి యిక్కడ మనవారిని బానిసలుగా చూసి వారిచేత సేవలు చేయించుకున్న ఇంగ్లండ్‌ అధికారులలో విపరీతమైన ఆధిపత్య, అహంభావ ధోరణులు నరనరాలలో జీర్ణించుకుపోవటాన్ని వివరించిన కథ. ఈ అధికారులు భారతదేశంలో అలవాటుపడ్డ సేవలను వారు తిరిగి స్వదేశం చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యుల నుంచి కూడా పొందాలని కోరుకొని భంగపడటాన్ని చెప్పిన కథ ‘ఎక్కడికి’? ఈ కథను ఆంగ్లేయ అధికారులపై కసి, ఏహ్యతలతో ముద్దుకృష్ణ రాశారు. హక్కులు1 మరియు హక్కులు2 అనే రెండు కథలూ రైల్వేస్టెేషన్‌, రైలు ప్రయాణం చుట్టూ తిరుగుతాయి. రైలులో ప్రయాణించే వారందరికీ వారు తెల్లవారైనా, మొదటి తరగతి ప్రయాణీకులైనా సమాన హక్కులు ఉంటాయని అంతేకాని ధనికులకు, తెల్లవారికి ఏ ప్రత్యేక హక్కులూ ఉండవని కొన్ని సంఘటనల ద్వారా నిరూపితం చేశారు. రైల్వేఅధికారులు తెల్లవారిపట్ల దాస్యభావంవీడి దేశీయుల పట్ల గౌరవభావాలు ,బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేసిన కధలు. దేశ ప్రజలలో పెల్లుబుకుతున్న నిరసనలను, అంకురిస్తున్న జాతీయోద్యమ భావాలను వెల్లడిరచిన కథలివి. గాంధీ ప్రారంభించిన అసహాయోద్యమానికిప్రభావితుడైన దాసు అనేవ్యక్తి గాంధీ భావజాలానికి దాసుడయ్యాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటాడు. లాఠీదెబ్బలు తింటాడు. జైళ్ల పాలవుతాడు. ‘‘ఇంగ్లీషు వారి ప్రభుత్వం కాంగ్రెసుకు లొంగిపోయింది. కాంగ్రెసు నాయకులు మంత్రి పదవుల్ని అంగీకరించారు. అందులోనూ తనకు సన్నిహితుడైనవాడు, తనకు జైల్లో రాజకీయాలు నేర్పినవాడు’’`
‘‘మంత్రి వొస్తున్నాడు. మన పల్లెకు. ఈ మారుమూల ఉన్న మన నిరుపేద పల్లెకు. మన మంత్రి , మనవాడు, మనకోసం వొస్తున్నాడు. స్వరాజ్యం వొస్తుందంటే ఏమిటో గ్రహించలేకపోయారు. గాంధీ కలలు కంటూ ఉన్న స్వరాజ్యం ఇదే సుమా! ఇప్పుడైనా తెలుసుకోండి. మన మంత్రి మనదగ్గరకు వొస్తాడు. మన కష్టనిష్ఠురాలు తెలుసు కుంటాడు. మన కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. మన మంత్రులు, మన కాంగ్రెసు మంత్రులు అంటే బీదసాదలకు బంధువులు. ఇంగ్లీషువారి ప్రభుత్వంలోని మంత్రుల్లాగ అధికారం చెలాయించి ప్రజల్ని దబాయించి, పరాయి ప్రభుత్వానికి మనల్ని బానిసలను చేసి, మనల్ని బాధల పాలు చేసిన మంత్రులు కాదు..’’ అనే గట్టి విశ్వాసంతో స్వాతంత్య్రానంతరం ఎన్నో కలలతో తన వూరికి వస్తున్న తనకు తెలిసిన సన్నిహితుడైన మంత్రిని ఆహ్వానించడానికి యింటింటా ఘనమైన ఏర్పాట్లు చేస్తారు. కార్యకర్తలను తోడ్కొని స్వయంగా రైల్వేస్టేషనుకు వెళ్లిన దాసుకు ఆ మంత్రి మొదటి తరగతి బోగీ నుండి దిగి దాసు బృందం వైపు కన్నెత్తి సైతం చూడకుండా అధికారులు, లక్షాధికారులతో ముచ్చటిస్తూ వెళ్లడం దాసును కుంగదీస్తుంది. ధనవంతులు, అధికారులతో కలసి విందు చేస్తున్న సమయంలో ఆ వూరువాడైన దాసు మంత్రికి గుర్తుకువచ్చి పిలుచుకు రమ్మని అధికారులను ఆజ్ఞాపిస్తాడు.
అప్పుడు దాసు ‘మీ మంత్రి, ఉద్యోగుల మంత్రి, లక్షాధికారుల మంత్రి, ఆ మంత్రితో నాకు నిమిత్తంలేదు. బీదసాదల మంత్రి, ప్రజల మంత్రి నా మంత్రి రాలేదు. నేను రానని మనవి చెయ్యండి. నా మంత్రి రాలేదు అని చెప్పి వాళ్ల ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాసిన ఈ కథలో అధికారాన్ని చేబట్టిన కాంగ్రెసు వారు స్వార్థపరులయ్యారని తెలిపారు. ప్రజల కలలు కల్లలయ్యాయని, స్వాతంత్య్రోద్యమం లక్ష్యాలు కనుమరుగైపోతున్నాయని, స్వాతంత్య్ర సమరయోధులు సైతం విస్మరణకు గురయ్యారని బలంగా చిత్రించిన కథ ‘నా మంత్రి’.ఈ కథను అనంతపురం శ్రీకృష్ణదేవ రాయ విశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించి తాను బోధించినట్లు ఆంధ్రప్రదేశ్‌ అరసం అధ్యక్షులు డా॥రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఈ సంపుటిలోని మరో ముఖ్యమైన కథ ‘కాలం కవ్వించే మార్పు!’ ఈ కథను అరసం గుంటూరుజిల్లాశాఖ ఏప్రిల్‌ 1991లో నేను సంకలనపరిచిన ‘కథాస్రవంతి’ 4వ సంకలనంలో ఉంది. కన్యాశుల్కానికి కక్కుర్తిపడి కన్నబిడ్డను అమ్ముకొని ఆ అమ్మాయి గొంతుకోసిన స్వార్థపరుడైన వెంకటశాస్త్రి కుటిల బుద్ధిని బహిర్గతం చేసిన కథ. ఈ కథలో ముద్దుకృష్ణ ‘ఇప్పటి హిందూ సంఘమంతా బొల్లి నాటకం’ అనే తీవ్రవిమర్శ చేశారు. వెంకటశాస్త్రి వితంతు కూతురును ‘పంతులుగారి తోట’ కు ఒక యువకుడు చేర్చడం ప్రధానాంశంగా సాగిన కథ యిది. ఆ తోటలో ‘చెట్టుకింద కుర్చీ మీద కూర్చుని, ఎదర కుర్చీలోకూర్చున్న షరాయితొడుగుకుని అదోమోస్తరుగా తలపాగాచుట్టుకున్న ఒకాయనతో మాట్లాడుతున్నారు. ఆయనే వెంకటరత్ననాయుడుగారని తరువాత తెలిసింది’. ఈ మాటల ద్వారా మనకు మహనీయులైన వీరేశలింగం పంతులు, రఘుపతివెంకటరత్నం నాయుడుగారలను మహాదర్శనం గావించారు.
కథాసారాంశాన్ని ముగింపులో సూటిగా విశదీకరించారు. ‘‘నిజం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహానుభావుడు పుడతాడు. దూరదృష్టితో సమస్తాన్నీ ఏ మార్పు తిలకించి కల్పిస్తే యెక్కువ ధర్మం కలుగుతుందో గ్రహించి, అతడు కాలాన్ని సరిjైున దారికి తిప్పుతాడు. ఆ తరువాత వ్యక్తులతో నిమిత్తంలేదు. రావలసిన మార్పు దానంతట అదే వొచ్చేస్తుంది. ఆ తరువాత నుంచీ తెలివైనవాళ్లు గ్రహించుకొని సర్దుకోనైనా సర్దుకుంటారు. తెలివితక్కువవాళ్లు ఎదిరించినా ప్రయోజనం ఉండదు. కాలం కల్పించే మార్పు ఇది.’’
బాల్య వివాహం జరిగిన లీలకు పుట్టిన బిడ్డ పురిటిలోనే పోతుంది. అనారోగ్యం ప్రాప్తిస్తుంది. ‘ఇంత నీరసంగా ఉన్న పిల్లలకు ఇంత త్వరలో ఈ స్థితులు రప్పించడం ఈ దేశం మూర్ఖత’ అని ఆమెను పరీక్షించిన వైద్యుడు చెప్పిన మాటలు ముద్దుకృష్ణవే. ఈ కథలోనే లీల భర్త గోదావరిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందుతాడు. లీలకు గుండు చేయిస్తాడు. ఆ పరిస్థితుల్లో లీలను చూసిన యింటి దూడ సైతం బెదురు తుంది. పశుపక్ష్యాదులకు ఎంతో స్వేచ్ఛ ఉంది. మనతో పాటు ఉన్న మన ఆడపిల్లలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేక పోవటాన్ని సచిత్రం చేసిన కథ ‘తెలివి’ హిందూ సంఘం స్త్రీలను అతి బలహీనులుగా చేసిందని చెప్తూ రాసిన మరో కథ ‘‘అహింస’’? విధవరాలైన పొరుగింటి సత్యవతితో ఆమె ప్రేరణతోనే సంబంధం పెట్టుకొన్న విద్యార్థి ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు ‘పెళ్లా, నాకేం పెళ్లి. చదువుకున్న వాళ్లకి ఇట్లా మతులు పోతున్నాయేం’’ అంటుంది. వితంతువులకు పునర్వివాహమన్న ఊహ సైతం కలగకుండా మానసికంగా హిందూ సంఘం ఎంత ఆలోచనా రహితులుగా వారిని మార్చిందో వివరించిన కథ ‘వింత ప్రకృతి’..
దళితుడైన పిచ్చయ్య ‘బాబూ తాత ముత్తాతల నాటి నుంచీ అనుభవిస్తున్నాం ఈ భూమిని, అది నా ప్రాణం అమ్మను బాబూ’ అన్న పిచ్చయ్య భూమిని కొని చుట్టూ ఉన్న తన భూమితో కలుపుకొని ఏకఖండంగా చేసుకోవాలన్న అగ్రహారీకుడైన ఆంజనేయులు పన్నిన కుట్రను తన తీర్పు ద్వారా న్యాయమూర్తి బయటపెడతారు. పిచ్చయ్యదే భూమి అని తెలుసుకున్న వారు అతన్ని అభినందిస్తారు. అతను సంతోషిస్తాడు. ఈ కథకు ‘అంటరానిపొలం’ పేరుపెట్టటం ఎంతోసముచితం. ఈ కథ దళితులపట్ల ముద్దుకృష్ణకున్న అభిమానాన్ని చాటింది. ‘దురాశ’ అనే కథ కూడా కోర్టు నేపథ్యంలో కొనసాగింది. కథలో దొంగనోట్ల ముద్రణ ప్రధానాంశం. ముద్దాయిలపై కేసును న్యాయస్థానం కొట్టివేస్తుంది. ఈ కేసును నిర్వహించిన అధికారి అన్న ఈ మాటలు నేడు దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరస్థులు విజయమాల్యా, నీరవ్‌మోడీ, సోక్సీ తదితరులను గుర్తు చేస్తున్నాయి. ‘ఏముంది సార్‌. ఉన్న డబ్బంతా పట్టుకుని ఏ పరాయి దేశమో పోయి మారుపేర్లతో బతుకుతారు.’ అనైతిక జీవిత చరిత్ర కలిగిన వెంకుబాయి భాగవత పఠనంతో, ఆధ్యాత్మిక ప్రవచనాలతో మొదలుపెట్టి పరిసర ప్రాంతాల వారిని భక్తి పారవశ్యంలో ముంచెత్తు తుంది. భ్రమలు కల్పిస్తుంది. ఒక పథకం ప్రకారం దాచిన విగ్రహాలను పొలంలో బయటపెట్టి భక్త జనులను ఆకర్షించి అక్కడ గుడి, ఆశ్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటుంది. తరువాత వెంకుబాయి పూర్వ పరిచయస్తులతో కలసి ఆశ్రమంలో సహజీవనం చేస్తుంది. మనం ఈనాడు నిత్యం చూస్తున్న విషయాన్నే ఓ ఎనభైఏళ్ల క్రితమే బహిర్గతం చేసిన కథ ‘ఒక దేవుడి పుట్టుక’.
ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ఆణిముత్యం ముద్దుకృష్ణ. వారి కథలు ఒకనాటి సమాజాన్ని మన కళ్లముందుంచాయి. తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయ స్థానం ముద్దుకృష్ణది. వారికిజేజేలు. ముద్దుకృష్ణ రాజమండ్రిలో 7ఫిబ్రవరి 1889న జన్మించారు. 6ఫిబ్రవరి 1972న కనుమూశారు.
(ఆంధ్రప్రదేశ్‌ అభ్యదయ రచయితల సంఘం 8 ఆగస్టు 2021 ఆదివారం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో చేసిన ప్రసంగానికి అక్షర రూపం.)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img