Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విశిష్ట ప్రయత్నం

తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర మొ॥లైన అంశాల మీద ఎన్నో రచనలు వచ్చాయి. ఈ అంశాల మీద శతకాల్ని కూడా రచించిన కవులున్నారు. ఈ కోవలోనే ప్రసిద్ధ రచయిత, విశ్రాంత ప్రధానాచార్యులు, నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపకులు అయిన డా॥నాగభైరవ ఆది నారాయణగారు తెలుగు వెలుగు పేరుతో ఒక శతకాన్ని రచించారు. శతక సాహిత్యం తెలుగు వారి సొత్తు. స్వయం సమగ్రంగా ఉండే పద్యాలు పాఠకునికి ఎంతో సౌలభ్యాన్ని కలిగిస్తాయి.
తెలుగు సాహిత్యం మీద అధికారం గలిగిన నాగభైరవ వారు తెలుగు సాహిత్యం, కళలు, కళాకారులు, క్రీడాకారుల, కవులు, సాహితీవేత్తలు మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ శతకాన్ని రూపొందించారు. ‘దిగ్దిగతంతములకు మన తెలుగు వెలుగు’ అనేది మకుటం. అయితే అక్కడక్కడ మకుటం పాదాన్ని మార్చి చివరలో ‘తెలుగు వెలుగు’ ఉంచటం గమనార్హం.అందుకే ఇది తెలుగు వెలుగు శతకం అయింది. ‘‘తెల్లముగ నిత్య సత్యమౌ తెలుగు వెలుగు, ‘తలపనా కవి కోకిల తెలుగు వెలుగు’’ ఇలా కొన్ని పాదాలు రచించబడ్డాయి. శ్రీకారంతో శతకాన్ని ప్రారంభించారు. నన్నయ, తిక్కన, ఎర్రన, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, పోతన, వేమన లాంటి ప్రాచీన కవుల్ని, కందుకూరి, రాయప్రోలు, గురజాడ, తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ లాంటి ఆధునిక కవుల్ని, సంకీర్తన కర్తల్ని, వ్యాకరణ కర్తల్ని, నవలాకారుల్నిఇలా ఎందరెందరినో ప్రస్తావిస్తూ శతకాన్ని రచించారు. గిడుగును గూర్చి ‘‘అరయ శిష్ట జన వ్యవహార భాష/యుక్తమౌ గ్రంథ రచన కంచుద్యమించి కడు గడలు కొనజేసెను గిడుగు పిడుగు/దిగ్దిగంతములకు మన తెలుగు వెలుగు (65) అని రచించారు. ఇలా ప్రతి పద్యాన్ని సరళ సుందరమైన పదాలతో ఆయా సారస్వత మూర్తుల్ని సాక్షాత్కరింపజేశారు. స్వయంగా గ్రంథాన్ని ముద్రించి ఉచితంగా అందరికీ అందిస్తున్న నాగభైరవ ఆదినారాయణగారి సౌజన్యం ప్రశంసనీయం. నిజమైన తెలుగు భాషాభిమాని. తెలుగు తల్లి ముద్దుబిడ్డ నాగభైరవ వారికి అభినందనలు. డా॥గుమ్మా సాంబశివరావు, సెల్‌: 9849265025
తెలుగు వెలుగు (శతకం), రచన: డా॥నాగభైరవ ఆదినారాయణ, ప్రథమ ముద్రణ ఏప్రిల్‌ 2021, ప్రతులకు: డా॥ నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీవేంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్యనగర్‌, ఒంగోలు`523002, ప్రకాశం జిల్లా సెల్‌: 9849799711 వెల: అమూల్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img