Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మాతృభాషా మాధ్యమం కోసం
50 ఏళ్ల క్రితమే పోరాడిన అట్లూరి పురుషోత్తం

కొత్తపల్లి రవిబాబు, సెల్‌: 9490196890

ఆయన 50 ఏళ్ల పాటు నిడుబ్రోలు, విజయవాడ లయోలా, కోదాడ కళాశాలల్లో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేశారు. ఇంగ్లండ్‌ పర్యటనలో షేక్స్పియర్‌ జన్మస్థలం సందర్శించారు. బెర్నార్డ్‌ షా జ్ఞాపక చిహ్నాన్ని చూసి వచ్చారు. షేక్స్పియర్‌ నాటకాలను పరిచయం చేస్తూ మూడు సాధికారకమైన సంపుటాలు రాసి ప్రచురించారు. తన ఇంగ్లీషు పాండిత్యమంతా, ప్రాథమిక స్థాయిలో, హైస్కూలు స్థాయిలో తెలుగు మాధ్యమంలో చదువుకోవడం ద్వారానే వచ్చిందని వ్యాసాలు రాశారు. 1978`79 లలో ‘విశాలాంధ్ర’ లో ‘మాతృభాషలో ప్రాథమిక విద్య’ పై వరుసగా వ్యాసాలు రాశారు. దానిని పుస్తక రూపంలో 1978 లో ముద్రించినపుడు, దానికి ముందుమాట రాస్తూ ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు ‘‘మాతృభాషలో ప్రావీణ్యతను సంపాదించిన తర్వాత పర భాషలను నేర్చుకోవడం సులభం..కాని మాతృభాషను మరచిపోయి, పర భాషను నేర్చుకొన ప్రయత్నించడం అస్వాభావికం. కష్టసాధ్యం కూడా’’ అని రాశారు. అంతే కాదు ‘‘ఇది వ్యక్తి సమస్య కాదు. జాతీయ సమస్య. అందుచే ఇందుకు రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీలో విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ పెద్ద ఆందోళన చేయవలసి ఉంది’’ అన్నారు. ఈ ముందు మాటను ఆయన 30.7.1978 లో రాశారు.
1922 జులై 22 న కృష్ణాజిల్లా ఈడుపుగల్లులో జన్మించిన అట్లూరి పురుషోత్తం శత జయంతి సందర్భంగా వారు ‘మాతృభాషలో విద్యా బోధన’’ గురించి రాసిన వ్యాసాలు గుర్తు వస్తున్నాయి. ఈనాడు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో హ్రస్వదృష్టితో, అంగన్‌వాడీల నుంచి, ఎల్‌.కె.జీ లనుంచి పిల్లలకు అమలు పరుస్తుంటే, ఈ ఇంగ్లీషు మాధ్యమాన్ని పరమ అశాస్త్రీయమైన విధానాన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాల్సిన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మౌనం వహిస్తున్న నికృష్ట పరిస్థితి నేడు మన ముందున్నది.
కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామ నివాసి, తండ్రి వీరరాఘవయ్యకు రావల్సిన 80 ఎకరాల భూమి దాయాదుల వశం కాగా, పురుషోత్తం బాల్యం పేదరికంలో గడచింది. ఆర్థిక స్తోమత లేకపోయినా చదువుకోవాలనే బలమైన కోరిక ఆయనను ఆ వూరి గ్రంథాలయం వైపు నడిపింది. పొట్టిపాడులో కప్పగంతుల వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్లి, నెలకు వీసెడు వెన్నపూస జీతంతో ఇంగ్లీషు నేర్చుకున్నారు. 8 వ తరగతిలో ఉన్నప్పుడు రాజాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి (11 వ తరగతి) వరకు తెలుగు మాధ్యమంలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. 10 వ తరగతిలో వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడయ్యారు. మంజూరైన ఆరు రూపాయల ఉపకార వేతనం, కమ్యూనిస్టు అనే కారణంతో ఆయనకు అందలేదు. తలపాగాలో కమ్యూనిస్టు కరపత్రాలు పెట్టుకొని కాలువ ఈదుకుంటూ మానికొండకు చేరవేసేవారు. 11 వ తరగతిలో పాఠశాల పత్రికకు సంపాదకుడిగా పని చేశారు. మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (ఎఫ్‌.ఏ) గుంటూరు ఎ.సి కళాశాలలో బి.ఏ. చదివారు. అక్కడ లండన్‌కు చెందిన రెవరెండ్‌ బాగ్షా వద్ద షేక్స్పియర్‌పై అధ్యయనం చేశారు. బి.ఇడి చదివి ఈడుపుగల్లు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడే దండల వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఏ. ఆనర్స్‌ చదివారు. ప్రొఫెసర్‌ శ్రీనివాస అయ్యంగారి శిష్యునిగా తన ఇంగ్లీషు సాహిత్య అధ్యయనానికి మరింత పదునుబెట్టారు. లయోల కళాశాలలో షేక్స్పియర్‌ రాసిన ‘మేక్బత్‌’ నాటకాన్ని దానిలో లీనమై బోధించడంతో విద్యార్థులు ఆయన్ను ‘మేక్బత్‌’ అని పిలిచేవారు. పట్టణాల నుండి పల్లెల వరకూ ప్రాకిన ఇంగ్లీషు భాషా వ్యామోహం గమనించిన పురుషోత్తం లాంటి భాషావేత్తలు మాతృభాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ వచ్చారు. అమలాపురమునకు చెందిన రచయిత, ఇంగ్లీషు అధ్యాపకుడైన వాసమూర్తి కృషితో ‘తెలుగు కూటమి’ అనే సంస్థ 1970 వ దశకంలో ఏర్పడిరది. డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన అమలులోకి వచ్చింది. 1968లో ప్రారంభమైన తెలుగు అకాడమీ డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన అమలులోకి వచ్చింది. 1968 లో ప్రారంభమైన తెలుగు అకాడమీ డిగ్రీ వరకు సామాజిక శాస్త్రం, విజ్ఞానశాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనవదించి ప్రచురించింది. అయినా గ్రామాలలో కేరళ టీచర్స్‌ నిర్వహించే కాన్వెంటులు అని పిలిచే ఇంగ్లీషు మీడియం పాఠశాలలు మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అట్లూరి పురుషోత్తం ‘విశాలాంధ్ర’ లో ధారావాహికంగా ఈ అంశంపై వ్యాసాలు రాశారు. వాటిలో తన జీవితంలోని అనుభవాలను వివరించారు. వివిధ దేశాలలో మాతృభాషను ఎలా ఆదరిస్తున్నారో తెలియజేశారు. మాతృభాషలో విద్యా బోధన అవసరం గురించి ప్రముఖులు చెప్పిన వాటిని ఉటంకించారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలలని గొప్పలు చెప్పుకునే పాఠశాలల్లో ఉన్న ఇంగ్లీషు స్థాయి చాల తక్కువని రుజువు చేశారు. బట్టీ పట్టడం తప్ప విద్యార్థులు సొంతంగా రాయలేని దుస్థితిని బయటపెట్టారు. మాతృభాషలో ప్రాథమిక విద్య ప్రజాస్వామికానికి పట్టుగొమ్మ అని తేల్చి చెప్పారు. మాతృభాష అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన అట్లూరి పురుషోత్తంగారు 2010, డిసెంబరు 1 వ తేదీ 88 వ ఏటన మరణించారు.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే నేర్పాలని జాతీయ విద్యా విధానం 2020 ఘోషిస్తున్నా, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాతృభాషా ప్రచారం చేస్తున్నా, ఇంజనీరింగ్‌ లాంటి సాంకేతిక శాస్త్రాలకు మాతృభాషలోనే పాఠ్య గ్రంథాలు తయారుచేసి బోధిస్తున్నా, యునెస్కో ఫిబ్రవరి 21 ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి మరుగౌతున్న భాషల ఉద్ధరణకు కృషి చేస్తున్నా మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తాబట్టిన కుందేలుకు మూడే కాళ్లనే చందాన కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తున్న పరిస్థితుల్లో 50 ఏళ్ల క్రితమే ఈ అంశంపై విశేష కృషి సల్సిన అట్లూరి పురుషోత్తంను శత జయంతి సందర్భంగా స్మరించుకొని వారు ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగించటం ద్వారా వారికి నివాళి తెలియజేద్దాం.
(అట్లూరి పురుషోత్తం శత జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img