Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వయోపౌరుల మనోభావాల వేదిక ‘జీవన సంధ్య’

జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తడబడుతూ నిలబడుతూ క్రమంగా స్థాయిని పెంచుకుంటూ సాగే క్రమంలో పిల్లల్ని ఉన్నతస్థానంలో ఉండేలా తీర్చిదిద్దినా చివరకు ఎవరికివారే యమునాతీరే అన్న రీతిలో ఒంటరిగా వృద్ధాశ్రమంలో శేషజీవితాన్ని గడిపే వృద్ధులెందరో ఉన్నారు. ఇంకొందరు తామెవరో తెలియని స్థితిలో అనాథలుగా జీవనాన్ని సాగించేవారూ కనిపిస్తారు అక్కడక్కడ. ఎలా ఉన్నా వృద్ధాప్యమంటే జీవితంలో ఎదురయ్యే మంచిచెడుల సంగమం. అనుభవాల జీవనసారం. అటువంటి వారి జీవితాలను వింటున్నా, చదువుతున్నా వృద్ధాప్యంలో ఇన్ని వెతలా! అనిపించకమానదు. వృద్ధాశ్రమాల్లోనో, ఒంటరిగానో ఎక్కడో జీవించేవారు నేటికాలంలో ఎక్కువవుతున్నారనే చెప్పాలి. అయితే ఇందుకు మారుతున్న కాలంతో అంతగా కలవలేకున్న పెద్దల ఆలోచనలా? మారుతున్న పిల్లల ఆలోచనలా? అని ఆలోచించేకంటే వాటివెనకున్న వృద్ధుల సమస్యల తాలూకు పలు ప్రశ్నలకు సమాధానాలను తెలిపే ప్రయత్నం చేశారు ప్రముఖ రచయిత సుధామ ఈ ‘జీవన సంధ్య’ పుస్తకంలో. వాయిస్‌ ఆఫ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ మాసపత్రికలో మూడు సంవత్సరాలు సీ‘ని’యర్‌ కబుర్లు’ పేరుతో రచయిత సుధామ నిర్వహించిన కాలమ్‌లో వయోపౌరులకు సంబంధించి ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, దాంపత్య, సామాజిక అంశాలపై అందించిన వ్యాసపరంపరే ‘జీవనసంధ్య’ పుస్తకంగా పాఠకులను పలకరిస్తోంది. 41 వ్యాసాలున్న ఇందులో ప్రతి వ్యాసం వయోపౌరులకు సంబంధించిన అమూల్యమైన విషయాలే. తొలి వ్యాసం ‘తలపోతల వ్యాయామం’. ఇందులో వృద్ధాప్యంలో అందరూ జ్ఞాపకాలను తలచుకోవడంతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఈ వయసులో ఎక్కువగా అల్జీమర్స్‌ వంటి మతిమరుపు లక్షణాలు వచ్చే అవకాశాలే ఎక్కువ. అలాకాకుండా ఉండటం కోసం జ్ఞాపకశక్తిని పదిలపరచుకోవడం కోసం మాటల ద్వారా, రాతల ద్వారా, మననం ద్వారా మంచి జ్ఞాపకాలను పదిలపరచుకోవచ్చు. అది వారికే కాదు కుటుంబసభ్యులకు సైతం ఉత్తమం. అనారోగ్యానికి గురిచేసే వాటిలో ఒత్తిడి మరొకటి. ఎటువంటి ఒత్తిడులులేని జీవితం గడపడం ఎవరికైనా సాధ్యంకాని పని. కొందరు పెద్ద వయసులో మొహమాటంతో పనులు చేసి ఇబ్బంది పడుతుంటారు. అందుకని మొహమాటం అనేది అనవసరం. పరిమితులు తెలుసుకుని సామర్ద్యం, వయసుకి మించి అదనపు బాధ్యతలు ఒప్పుకోకుండా ఉండటం శ్రేయస్కరం. తమని తాము నియంత్రించుకుని, క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ఒత్తిడి దరిచేరక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒక్కోసారి కన్నవారి హృదయపూర్వకమైన ప్రేమాదరణలు అందని అభాగ్యులైన వృద్ధులకు వృద్ధాశ్రమాలే ఒకవిధంగా భాగ్యాలయాలని చెప్పాలి. ఎందుకంటే అనునిత్యం మానసిక, శారీరక హింస అనుభవిస్తూ కడవరకు జీవితాన్ని గడిపేకంటే ఉన్నంతలో ఆదరణగా చూసి ప్రేమనందించే వృద్ధాశ్రమాలు మేలేకదా. కొంతమంది పెద్దలు, సేవాతత్పరులు ఆర్ధికపరంగా, సేవాపరంగా తమ వంతు సహకారాన్ని అందించడం ద్వారా ఎంతోమంది వృద్ధులు చివరిదశలో అన్ని మరచి ప్రశాంతజీవనం సాగిస్తున్నారు వృద్ధాశ్రమాల్లో. ఇలా ఎన్నో వ్యాసాల్లో వృద్ధుల సమస్యల గురించి, వారి ఆలోచనల గురించి, వారనుభవిస్తున్న మనోవేదన, ఇబ్బందుల గురించి వారు తమలో మార్చుకోవాల్సిన అలవాట్ల గురించి తెలియజేశారు. ముఖ్యంగా వృద్ధులనగానే కొంతమందిలో చులకనభావం ఉంటుంది. అందుకే చాలామంది వృద్ధులు నేటితరానికి మా అనుభవాలు అవసరం లేదన్న భావన ఉందంటారు. నిజానికి కొందరిలో ఆ భావన ఉన్న మాట నిజమే అయినా తాము చెప్పిందే నిజమని పట్టుబట్టే కొంతమంది వృద్ధులవల్ల వారటువంటి భావనతో ఉంటుంటారు. అయితే మీ జీవితమే మీ సందేశం కావాలి అంటారు రచయిత. ఫలితాల గురించి ఆలోచించకుండా తమకుతోచిన ఉపయుక్తమైన పనులను చేసుకుంటూ పోవడమే ప్రశాంత వృద్ధాప్య జీవనానికి మంచిసోపాన మంటారు. కాలంతో పరిపక్వమై తనను తాను తెలుసుకుంటూ జీవనం సాగించడమే జీవనసారం. ఇది కేవలం వృద్ధులకే కాకుండా వృద్ధాప్యానికి దగ్గరయ్యేవారు సైతం తెలుసుకోవడం ఉత్తమం. మనసులోని మాటలో ‘ఈ లోకంలో సజీవుడైన మనుష్యుని మినహా అంతగా వింతగొల్పే అమూల్యవస్తువు పుస్తకం మాత్రమే’ అని చెబుతారు. ఆ రీతిన సుధామగారి ఈ ‘జీవన సంధ్య’ పుస్తకం వయోపౌరులకు ఓ అమూల్యమని చెప్పకతప్పదు. యువతరం సైతం ఈ జీవన సంధ్యను చదవడం ద్వారా వయోపౌరుల ఆలోచనలను, భావాలను, బాధలను తెలుసుకుని వారికి, వారి ఆలోచనలకు తమ వంతు చేయూతనందించే వీలు కలుగుతుందని చెప్పొచ్చు. వృద్ధుల ఆలోచనలకు, ఆవేదనకు అక్షరరూపు కట్టిన ఈ జీవనసంధ్య నేటితరం సైతం తప్పక చదవవలసిన పుస్తకం. జె.బి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img