Friday, April 26, 2024
Friday, April 26, 2024

వస్త్ర రైతు

చేనేత వృత్తిలో
చీకటి వెలుగుల దోబూచులాట
అనంతంగా సాగుతూనే ఉంది.
పడుగు పేకలు సంధించి
పసందైన చీర నేసి
ప్రశంసల వేదికపై మెరుస్తాడు
బతుకు తెరువును
చేనేతకు కుదువ పెట్టిన వాడు
సుఖాల సంపెంగలు రాలిపోయి
కష్టాల కొలిమికి అంకితమౌతున్నాడు
‘అభివృద్ధి’ చిలుక పలుకులవుతున్నాయి
రాయితీలు శూన్యమై
పన్నులతో పహారా కాయటం
గోరుచుట్టు పై రోకలిపోటే
తెగిపోతున్న బతుకు పోగుల్ని
పాలనా యంత్రాంగం అతక్కపోగా
విసిరిన ఇంద్రజాలం వల
ఎవరికీ కనిపించదు
స్వతంత్ర జీవన యాత్ర
భరోసా రహదారిని కూల్చేసి
భయాన్ని జత కలుపుతా ఉంది
అప్పులు కొండ చిలువలై, ఉరి తీసే
దౌర్భాగ్యం వెంటాడతా ఉంది
చేయి విదిల్చితే రాలే
ఎంగిలి మెతుకులు కాదు
కష్టానికి తగిన ప్రతిఫలంతో
ఇష్టంగా తినే భోజనం కావాలి
చేతి వేళ్ల నైపుణ్యానికి
ప్రశంసలు మాత్రమే కాదు
గ్రహణం పట్టని
పున్నమి జీవితాలు కావాలి
(మే డే సందర్భంగా…)
`ఎస్‌.ఆర్‌.పృథ్వి, సెల్‌: 9989223245

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img