Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సంస్కరణవాద దివిటీ ప్రేంచంద్‌

చింతపట్ల సుదర్శన్‌

భారతదేశంలో గుర్తించబడిన 22 భాషల సాహిత్యం భారతీయ సాహిత్యం. వివిధ ప్రాంతాల సాహితీ సంస్కృతులలో భేదాలు ఉన్నప్పటికీ భారతీయ ఆత్మ, మానవ జీవిత వాస్తవికత ఒక్కటేనని వివిధ భాషలలోకి అనువదించబడిన సాహిత్యం తెలియజేస్తుంది. తమ రచనల అనువాదాల ద్వారా దేశంలోని అన్ని భాషల వారికి పరిచయం అయిన సుప్రసిద్ధ రచయితలు రవీంద్రనాథ్‌ఠాగూరు, సరోజినీ నాయుడు, శరత్‌బాబు, బంకించంద్రచటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్‌లు. వీరు తెలుగు వారికి సుపరిచితులు. వీరి రచనలను తెలుగువారు ఆస్వాదించడమే కాక వీరిని తమ భాషారచయితల లాగానే అభిమానించారు. భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించక ముందు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల పరిపాలనలో భారతీయ సమాజం ఎదుర్కొన్న సమస్యలను తమ రచనలలో ప్రతిబింబించిన వారిలో ప్రేమ్‌చంద్‌ ఒకరు. భారతీయ సాహిత్యంలో, హిందీ సాహిత్య రంగంలో మొట్టమొదటి నవలా రచయిత ప్రేంచంద్‌. హిందీ/ఉర్దూ భాషలలో రచనలు చేశాడు. మొదట ఉర్దూ నవలా రచనతో ఆరంభించి తర్వాత హిందీలో నవలలు, కథలు, నాటికలు, వ్యాసాలు రచించాడు.
ప్రేంచంద్‌ జీవితం: ప్రేంచంద్‌ అసలు పేరు ధనవంత్‌రాయ్‌ శ్రీవాత్సవ్‌. ఈయన 1880లో వారణాసి సమీపంలోని ‘లంహే’ గ్రామంలో జన్మించాడు. తండ్రి అజైబ్‌రాయ్‌, తల్లి ఆనందీదేవి. ప్రేంచంద్‌ విద్యాభ్యాసం లంహే గ్రామానికి కొద్దిదూరంలోఉన్న లాల్‌పూర్‌లో జరిగింది. అక్కడ మదర్సాలో ఉర్దూ, పర్షియన్‌ భాషలు నేర్చుకున్నాడు. ఆయన 15వయేట వివాహం జరిగింది. అయితే అభిప్రాయ భేదాల కారణంగా భార్య ఆయనను వదిలి వెళ్లిపోయింది. తర్వాత బాలవితంతువు శివరాణి దేవిని సమాజ వ్యతిరేకతను ఏమాత్రం లెక్క పెట్టకుండా వివాహం చేసుకున్నాడు ప్రేంచంద్‌. ఆ రోజుల్లో అదొక విప్లవాత్మకమైన చర్చ. 1897లో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణుడై బెనారస్‌ సెంట్రల్‌ హిందూ కాలేజీలో చేరిన ప్రేంచంద్‌ గణితంపై తనకున్న అయిష్టత కారణంగా చదువు మానేశాడు.
ప్రేంచంద్‌ మొట్టమొదట చేసిన ఉద్యోగం పుస్తకాల అమ్మకం. 1905లో ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు ప్రేంచంద్‌. ప్రేంచంద్‌ కాన్పూర్‌లో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నప్పుడు ‘జమానా’ పత్రిక సంపాదకుడు మున్షీ దయానారాయణ నిగమ్‌ పరిచయంతో ప్రేంచంద్‌లో కథారచనలపై ఆసక్తి కలిగింది. ‘జమానా’ లో ప్రేంచంద్‌ కథలు నవాబ్‌రాయ్‌ అనే పేర అచ్చవడం మొదలైంది. ప్రేంచంద్‌ సంచలనాత్మక నవల ‘సోజ్‌వతన్‌’ 1909లో అచ్చయ్యింది. ఈ నవల బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉండడంతో, ఆంగ్లేయ కలెక్టర్‌ ప్రేంచంద్‌ ఇంటి మీద పోలీసులచే దాడి చేయించి 500ల ప్రతులను తగులబెట్టించాడు. బ్రిటీషు ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది.
ఈ సమయంలో మున్షీ దయానారాయణ్‌నిగమ్‌ అప్పటిదాకా నవాబ్‌రాయ్‌ అనే పేర రచనలు చేస్తున్న ధనవంత్‌రాయ్‌ శ్రీవాత్సవను ప్రేంచంద్‌గా పేరు మార్చుకుని రచనలు కొనసాగించమని సలహా యిచ్చాడు. మున్షీ అనే పదానికి పర్షియన్‌ భాషలో రచయిత అనే అర్థం ఉంది. ఈ విధంగా ధన్‌వంత్‌రాయ్‌ శ్రీవాత్సవ కలం పేరు మున్షీ ప్రేంచంద్‌గా మారింది. 1905 సం॥లో టీచర్‌గా ఉద్యోగంలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో పనిచేసిన ప్రేంచంద్‌ 1919లో అలహాబాద్‌ బి.ఎ డిగ్రీ సాధించాడు. ఆయన గోరఖ్‌పూర్‌లో డిప్యూటి ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా పని చేస్తున్న సమయంలో గాంధీజీ ఒక సభలో మాట్లాడుతూ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా భారతీయులు బ్రిటీష్‌ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేయాలని కోరాడు. ప్రేంచంద్‌కు ఆరోగ్యం బాగాలేదు. ఇద్దరు సంతానం. భార్య గర్భవతి. అయినా దేశం కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదులుకుని బనారస్‌కు వచ్చేసిన ప్రేంచంద్‌ 1923లో సరస్వతి ప్రెస్‌ను ఆరంభించి ‘మర్యాద’ ‘మాధురి’ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు. అప్పటి నుంచి 1936లో తను మరణించే వరకు సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అనారోగ్యాన్ని ఎదుర్కొన్నాడు.
ప్రేంచంద్‌ సాహిత్యం: ప్రేంచంద్‌ 12నవలలు, 250 కథలు, అనేక వ్యాసాలు రాయడంతో పాటు కొన్ని ఆంగ్ల రచనలను హిందీలోకి అనువాదం చేశాడు. బాలల కోసం కథలు రాశాడు. జీవిత చరిత్రలు కూడా రాశాడు.
ప్రేంచంద్‌ కథలు: ప్రేంచంద్‌ తొలికథ 1907లో ‘జమానా’లో అచ్చయ్యింది. ఈ కథ దునియాక సబ్‌నే అన్‌మోల్‌ రతన్‌. మొదటి కథా సంకలనం ‘సప్త్‌సరోజ్‌’. బడే బాయిసాబ్‌, బేటీకా ధన్‌, సౌత్‌, బేటోంవాలీ విధ్‌వా, మా దుర్గామందిర్‌, ఘర్‌ జమాయీ, ధిక్కార్‌, ఈద్‌గా, విధ్వంస్‌ ఆయన కథల్లో ప్రజాదరణ పొందినవి. ‘శత్రంజ్‌ క ఖిలాడీ’, ‘కఫన్‌’ ఆయన కథల్లో సుప్రసిద్ధమైనవి. శత్రంజ్‌క ఖిలాడీలో నవాబులైన మీర్జా సజ్జాద్‌ అలీ, మీర్‌ రోషన్‌ అలీ చదరంగం ఆటలోనే కాలం గడుపుతూ లోకాన్ని పట్టించుకోరు. ఆఖరుకి రాజు వాజిద్‌ అలీషాపై దండయాత్ర జరగడం, యుద్ధంలో వోడిన వాజిద్‌ అలీని శత్రువులు ఖైదీగా పట్టుకుపోవడం కూడా పట్టించు కోరు. ఆటలో ఒక ‘ఎత్తు’ కు సంబంధించి గొడవపడి ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని చనిపోతారు. ప్రపంచ ప్రసిద్ధమైన కథ ‘కఫన్‌’. కఫన్‌ అంటే శవంపై కప్పే గుడ్డ. గీసా, మాధవ్‌లు తండ్రీ కొడుకులు. గర్భంతో ఉన్న మాధవ్‌ భార్య ప్రసవసమయంలో చని పోతుంది. శవానికి అంతిమ సంస్కారం చెయ్యడానికి, శవంపై కప్పే గుడ్డ కోసం ఊళ్లో వాళ్లను డబ్బు దానం చెయ్యమని ప్రాధేయ పడతారు తండ్రీ కొడుకులు. అలా జమ అయిన డబ్బుతో కల్లుపాకకు వెళ్లి విపరీతంగా తాగుతారు. శవం మీద బట్ట కప్పడం కన్నా తామిద్దరూ కడుపు నిండా తినీ తాగితే చనిపోయిన కోడలి ఆత్మ శాంతిస్తుం దంటాడు గీసా. అసలు శవంపై గుడ్డ కప్పడమే ఒక పిచ్చి రివాజు అంటాడు కొడుకు మాధవ్‌. ప్రేంచంద్‌ కథలు దిగువ మధ్యతరగతి మనుషుల జీవితాలలోని వాస్తవాలను పాఠకులకు అందిస్తాయి. జీవితపు విషాదాన్ని, సంక్లిష్టతను వివరిస్తాయి. వ్యక్తి జీవితం కన్నా ఆచారవ్యవహారాలు, మత చాదస్తం ఎక్కువ కావని చెప్తాయి.
ప్రేంచంద్‌ నవలలు: మొదట ఉర్దూలో ‘అస్రారెమా అబిద్‌’ ‘సోజ్‌ వతన్‌’, జల్వే ఇసార్‌, బజారే హోస్న్‌, బేవా వంటి నవలలు రాసిన ప్రేంచంద్‌ ఉర్దూలో ప్రచురణకర్తలు కరువవడంతో 1914 నుండి హిందీ నవలలు రాయడం ఆరంభించాడు. ప్రేంచంద్‌ నవలల్లో ‘రంగభూమి’, ‘కర్మభూమి’ ‘ప్రతిగాన్‌’, ‘గబన్‌’, ‘గోదాన్‌’ ప్రసిద్ధమైనవి. గోదాన్‌ నవలలో హిందూమత సంప్రదాయమైన గోదానం కథా వస్తువు. హోరి మహతో అనే రైతు చిరకాలపు కోరిక ఆవును కొనడం. బతుకంతా అప్పులు చేస్తూ, కష్టాలు అనుభవిస్తూ చివరకు ఆవును కొనకుండానే చనిపోతాడు. అతను చనిపోయాక భార్య తన దగ్గర ఉన్న డబ్బును పండిత్‌కి గోదానంగా యిస్తుంది.
ప్రేంచంద్‌ మరో ప్రసిద్ధ నవల ‘గబన్‌’. ఈ నవలలో దిగువ మధ్యతరగతి కుటుంబాలలో పతనమౌతున్న నైతిక విలువలు మనుషులు తమని తాము ధనవంతులం అనిపించుకోవాలనే భ్రమలో బతకడం, పోలీసు వ్యవస్థలోని లోపాలు వివరిస్తాడు. మరో నవల ‘రంగభూమి’ లో జీవితంలోని అన్ని వైవిధ్యాలు, భావావేశాలు, సామాన్యులు, రైతుల జీవితాలలో బ్రిటీష్‌ నియంతృత్వం సృష్టించిన సంక్షోభాలు చిత్రించబడ్డాయి. ప్రేంచంద్‌ నవలలు గ్రామీణ జీవితం, రైతు జీవితం, బ్రిటీష్‌ వారి దౌర్జన్యం, పతనమైన నైతిక విలువలు, మారుతున్న మనుషుల మనస్తత్వాలకు అక్షర రూపం యిస్తాయి. అర్థం లేని ఆచారాలు, మత సంప్రదాయాలు పాటించడంలోని డొల్లతనాన్ని కూడా ఎత్తి చూపుతాయి.
ఇతర రచనలు` అనువాదాలు: ప్రేంచంద్‌ ‘కర్‌బలా’ ‘రూహానీషాదీ’ ‘సంగ్రమ్‌’ వంటి నాటికలు ‘కుచ్‌ విచార్‌’, ‘ఖలాంత్యాగ్‌ ఔర్‌ తల్వార్‌’ వంటి వ్యాసాలు ‘మహత్మా షేక్‌ సాదీ’, దుర్గాదాస్‌ల జీవిత చరిత్రలు రాశాడు. బాలల కోసం ‘బాల్‌ కహానియా సంపూర్ణ్‌’, మన్‌ మెందక్‌’ కథల సంపుటులు ప్రచురించాడు. టాల్‌స్టాయ్‌ కథలను టాల్‌స్టాయ్‌ కహానియాగా ‘జాన్‌ గల్స్‌వర్తీ ‘సిల్వర్‌బాక్స్‌’ ను ‘చమేలీకీ డిబియా’ గా అనువదించాడు. ఆస్కార్‌ వైల్డ్‌, చార్లెస్‌ డికెన్స్‌, మీటర్లింకుల ఆంగ్ల రచనలను హిందీలోకి అనువాదం చేశాడు.
చలన చిత్రాలు: 1934లో ప్రేంచంద్‌ బొంబాయి చిత్ర పరిశ్రమలో కొంత కాలం పని చేశాడు. ఆ సమయంలో ‘మజ్దూర్‌’ అనే సినిమా రాశాడు. అక్కడి వ్యక్తుల పద్ధతి నచ్చక తిరిగి బనారస్‌ వెళ్లిపోయాడు. ప్రేంచంద్‌ కథ ‘షత్రంజ్‌కె ఖిలాడీ’ ని సత్యజిత్‌రాయ్‌ చలన చిత్రంగా రూపొందించాడు. ప్రేంచంద్‌ నవల ‘సేవాసదన్‌’ చలన చిత్రంగా నిర్మించబడిరది. ఈ చిత్రంలో కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి కథానాయికగా నటించింది. 1966లో ఆయన నవల గబన్‌ చిత్రం సునీల్‌దత్‌ కథానాయకుడుగా విడుదలైంది. హృశీకేశ్‌ ముఖర్జీ కథ ‘కఫన్‌’ ఆధారంగా తెలుగులో మృణాల్‌సేన్‌ ‘ఒక ఊరి కథ’ చిత్రాన్ని నిర్మించాడు. ‘నిర్మల’, ‘కర్మభూమి’, ‘రంగభూమి’ వంటి ప్రేంచంద్‌ నవలలు, ప్రసిద్ధమైన కథలు తెలుగులోకి అనువదించబడ్డాయి.
బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని ధిక్కరించి సామాన్యుని జీవితాన్ని తన సాహిత్యంలో చిత్రించిన అభ్యుదయవాది మున్షీ ప్రేంచంద్‌. మానవ విలువలు, సంబంధాలు, కష్టసుఖాలు సార్వకాలికమైనవి. బ్రిటీష్‌ ప్రభుత్వ దుష్ట పాలనలో భారతీయ జీవనాన్ని ప్రతిబింబించిన ప్రేంచంద్‌ సాహిత్యం నిత్య నూతనమైనది. ఏ తరం పాఠకులైనా తప్పక చదవాల్సిన సాహిత్యం. 1936లో లక్నోలో స్థాపించబడిన అభ్యుదయరచయితల సంఘానికి ప్రేంచంద్‌ మొట్టమొదటి అధ్యక్షుడవడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం.
( జులై 31 ప్రేంచంద్‌ జయంతి )

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img