Monday, May 20, 2024
Monday, May 20, 2024

పదచిత్రాల పోహళింపు కవిత్వానికి సింగారింపు

పువ్వుకు తావిలా, సముద్రానికి కెరటాల్లా, ఆకాశానికి నక్షత్రాల్లా పదచిత్రాల మేళవింపు కవిత్వానికి ఇంపు కలిగిస్తాయి. దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. దానిని శక్తిమంతం చేస్తాయి. అందుకే పదచిత్రాలంటే కవిత్వానికి ప్రాణం. ఆ పదచిత్రాలతో కలిసి కవిత్వం సమ్మోహనం గానం చేస్తూ పఠితలను అలరిస్తుంటుంది. పదచిత్రాల తొలకరి మబ్బులతో కవిత్వం పురివిప్పి నాట్యం చేస్తుంటుంది. పదచిత్రాల సోయగాలతో కవిత్వం ప్రపంచాన్ని సమ్మోహనపరుస్తుంటుంది. పదచిత్రాలు ఎన్నెన్నో భావాల రహస్యాల్ని పుక్కిట పట్టుకుంటాయి. ఎన్నెన్నో అందాలకు, ఆనందాలకు, ఉద్వేగాలకు అక్షరాలను తొడుగుతుంటాయి. అచ్చెరువు గొలిపే ఉపమల్నీ, అలంకారాల్నీ అవి ధరిస్తుంటాయి. ప్రకృతి పార్శ్వాలతో బాటు సామాజిక పార్శ్వాలకూ అని సరికొత్త ద్వారాలు తెరుస్తుంటాయి. అవి కవిత్వాకాశంలో మెరుపులై మెరుస్తూ ఆలోచనల వర్షపుధారల్ని కురిపిస్తుంటాయి. పదచిత్రాలు ఆమనితో ముచ్చటించే పూల గుసగుసల్ని వినిపిస్తుంటాయి. వెన్నెలతో సరాగాలాడే కలువ ఆత్మీయ సంభాషణనూ అక్షరీకరిస్తుంటాయి. అవి చిరుగాలుల్లా భావాల మబ్బుల్ని కరిగిస్తూ పచ్చదనాల అనుభూతులతో హృదయోద్యానాల్ని మురిపిస్తుంటాయి. అవి సామాజిక సంఘర్షణలోని ఎన్నో పార్శ్వాలకు ప్రతిరూపాలైపోతుంటాయి. సైనికుల కవాతులా పదచిత్రాల అడుగులతో కవిత్వం ముందుకు సాగిపోతూవుంటుంది.
‘హాయిగా గొంతు ముడివిప్పి పాడు
రయిక ముడివిప్పి/ చంటిబిడ్డకు/ చన్నిచ్చే తల్లిలా
నీ అంతరాత్మలో/ నీ రక్తసంధ్యలో/ లేచిన తెల్లటి పావురాన్ని
నా రక్తసంధ్యలో/ వాలనీ/ వెలిగే పగళ్లలో
ఉభయ సంధ్యల్ని/ కలవనీ
ఎగిరి ఎగిరి అలసిపోయి/ దివాలు రెక్కలు ముడిచేవేళ
పాట నావలో కూచుని/ నీ కనురెప్పల తెరచాపనెత్తి
నీ కళ్లలో/ అస్తమానం/ అస్తమించే
నల్లని సూర్యబింబంకేసి/ సాగిపోనీ’
(‘పాటకత్తెకి’ ఖండిక నుంచి)
అంటూ ఒక పాటకత్తెను గానం చేయమని అర్థిస్తూ, ఆ పాటను ఆలపించవలసిన విధానాన్నీ, దానిని తాను ఆలకించే విధానాన్నీ పలు విలక్షణ ప్రకృతి పదచిత్రాలతో వర్ణిస్తాడు ఎన్నెన్నో ప్రకృతి ప్రతీకలతో సరాగాలాడుకున్న చెట్టుకవి ఇస్మాయిల్‌. పాటకత్తె గొంతుముడి విప్పడాన్ని రయిక ముడి విప్పడంతో అనుసంధానించడం ఇక్కడి విలక్షణత. ఆ వెంటనే మాతృత్వ భావన పురివిప్పేలా చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఒక పాటకత్తె పాటకోసం తల్లిపాల కోసం తపించే పసివాడిలా తపిస్తాడు కవి. పాటకత్తె పాట గొప్పతనాన్ని వర్ణించడానికి ఇంతకంటే శక్తిమంతమైన ప్రతీక ఏముంటుంది !? పాటకత్తె పాటకు తెల్లటి పావురమూ, వెలిగే పగళ్లూ, రక్తసంధ్యలూ… ఇవన్నీ పదచిత్రాలైపోయి పాట స్వభావాన్ని తెలియజేస్తాయి. పాటకత్తెకు ఆపాదించిన రక్తసంధ్య ఆమె జీవన సంఘర్షణను సూచిస్తుంది. ఆ సంఘర్షణకు ప్రతీకలైన ఆమె కళ్లలోని నల్లటి సూర్యబింబాల అస్తమయాల్ని చూడడానికి కవికి ఆమెపాట నావ అయిపోయింది. ఆమె కనురెప్పలు తెరచాప అయి పోయాయి. ఆమె పాటనావలో కూర్చున్న కవి ఆమె పాటకు మైమరచి పోతూనే సూర్యాస్తమయమనే ప్రకృతి దృశ్యాన్ని ఆమె కళ్లలోని నల్లటి సూర్యబింబ అస్తమయం అనే జీవనదృశ్యానికి అను సంధానం చేస్తాడు. పదచిత్రాల్లో విలక్షణ మేళవింపు అంటే ఇదే.
‘ఆకలిరెక్కలు అలసిపోయి
మనిషి లోపలియంత్రాలు ముక్కలైపోయాక
చివరి మిల్లు మూసేశారు
ఎన్నెన్ని తెగిన పోగుల్ని అతికించుకుంటూ
ఎన్నెన్ని అంతరాత్మల్ని అద్దకంగా మార్చితే
ముంబై ప్రపంచం మోహనవస్త్రమై
ఫ్యాషన్‌ పెరేడ్‌ చేసింది …..
జీతం ఘనీభవించి
కష్టం బతికిబట్టకట్టింది ఈ మిల్లులోనే కదా
ఎన్ని గుండెలు మిల్లు శబ్దాల్ని విన్పిస్తాయి
ఎన్ని నరాలు దారపు పోగులై ఉబ్బి కన్పిస్తాయి
సైరన్‌ విన్పించక ఎన్నో గొంతులు మూగపోయాయి
వలస పక్షులన్నీ తలోదిక్కూ ఎగిరిపోయాయి
ఆకాశాన్ని తాకే అపార్టుమెంట్లతో
రంగుచిలకై లేచి రెక్కలు దులుపుకుంటుంది
యంత్రం జీవితాన్ని నియంత్రించాక
దిక్కుతోచక అక్షరాల్ని మంత్రిస్తున్నాను
ఇప్పుడు ఎవరు శాలువా కప్పినా
మిల్లు శబ్దాలే విన్పిస్తున్నాయి
(‘చివరి మిల్లు’ ఖండిక నుంచి)
అంటూ ప్రపంచీకరణ మిగిల్చిన ఒక చేదు విషాదాన్ని విలక్షణ సామాజిక పదచిత్రాలతో కవిత్వీకరిస్తున్నాడు వర్తమానకవి సంగెవేని రవీంద్ర. ముంబైలో చివరి బట్టల మిల్లును మూసేసిన సందర్భం ఈ పదచిత్రాలకు వస్తువైంది. యాంత్రీకరణ మనిషి లోపలి యంత్రాలన్నింటినీ ముక్కలు చేసి మానవీకరణను హరించిన వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఒక బట్టలమిల్లు పూర్వవైభవాన్నీ, వర్తమాన విషాదాన్నీ బేరీజు వేస్తున్నాయీ పదచిత్రాలు. ఫ్యాషన్‌ పెరేడ్‌ కూపంలో ముంబై మోహనవస్త్రం కావడానికి తెగిపోయిన పేగుల్ని మళ్లీ మళ్లీ అతికించుకుంటూ అంతరాత్మలు అద్దకంగా మారడం, మిల్లు శబ్దాలు కార్మికుల హృదయ స్పందనల్లో సంలీనమైపోవడం, ఆ తరువాత మిల్లు ఆగిపోయి కార్మికులు వలస పక్షులైపోయి ఎగిరిపోవడం, ఆఖరికి మిల్లు నింగిని తాకే భవనాలతో రెక్కలు దులుపుకొనేరంగుల చిలకైపోవడం…ఇవన్నీ విలక్షణ పదచిత్రాలే. రెక్కలు దులుపుకోవడం కార్పొరేట్‌ మదాంధకారాన్ని సూచిస్తుంది. ఈ పదచిత్రాలు కార్మికులతో మిల్లుకు వున్న అనుబంధాన్ని విడమరచిచెబుతాయి. ఎన్నో జీవితాల సంఘర్షణకు సంబంధించిన విషాద రాగాలను మనకు వినిపిస్తాయి. పదచిత్రాల పోహళింపు కవిత్వంలో సౌందర్యాన్ని నింపుతుంది. విభిన్న పార్శ్వాల జీవన ఆర్తి వెలుగుల్ని ప్రసరిస్తుంది. గాఢానుభూతిని వొంపుతుంది. భావాల బిందువుల్ని కవిత్వపు సింధువు చేస్తుంది.
డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర,సెల్‌: 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img