Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఆఖరి పోరాటయోధులు

మనకు 1947 ఆగస్టు 15న వచ్చింది స్వాతంత్య్రమా, స్వేచ్ఛా అన్నది పెద్ద ప్రశ్న. స్వాతంత్య్ర సమర యోధులందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే పోరాడారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన మాట నిజమే కాని స్వేచ్ఛ ఇప్పటికీ మృగ్యమే. ఉన్న కాస్తంత స్వేచ్ఛ గత పదేళ్ల మోదీ పాలనలో క్రమంగా అంతరించుకు పోయింది. ప్రసిద్ధ పత్రికా రచయిత పాలగుమ్మి సాయినాథ్‌ రాసిన 272 పేజీల ‘‘ది లాస్ట్‌ హీరోస్‌: ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’’ గ్రంథంలో ప్రధానంగా చర్చించిన అంశం ఇదే. స్వాతంత్య్ర పోరాటానికి, మరో మాటల్లో చెప్పాలంటే గాంధీ, నెహ్రూ, పటేల్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ లాంటి వందలాది మంది నాయకత్వం వహించిన మాట వాస్తవమే. ఇది జాతీయోద్యమంలో ప్రధాన స్రవంతి అన్నదీ నిజమే. కానీ చరిత్రకెక్కని అనేక మంది పోరాట యోధులు అసమానమైన త్యాగాలు చేశారు. వారి పేర్లు ఎక్కడా కనిపించవు. అలాంటి 16 మంది కొనసాగించిన పొరాటాన్ని సాయినాథ్‌ గ్రంథస్తం చేశారు. దీనికోసం ఆయన వందలాది మందితో మాట్లాడారు. ఈ గ్రంథంలో ఆయన ప్రస్తావించిన వారిలో అందరికన్నా తక్కువ వయసు కలిగిన వ్యక్తికి 92 ఏళ్లు. అందరికన్నా ఎక్కువ వయసున్న వ్యక్తికి 104 ఏళ్లు.
నాలుగు దశాబ్దాలపైబడిన పత్రికా రచన అనుభవం ఉన్న సాయినాథ్‌ ఎప్పుడూ పేదలు, దోపిడీ గురించే రాశారు. ఇది ఆయన రెండో గ్రంథం. మొట్ట మొదటిది ‘‘ఎవ్రీబడీ లైక్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌’’. ఇది ఇప్పటికీి పునర్ముద్రితం అవుతూనే ఉంది. సాయినాథ్‌ తన వృత్తి జీవితంలో ఎక్కువ భాగం సామాన్యుల జీవితాలను, జీవిత విధానాలను చిత్రించడానికే కేటాయించారు. ‘‘ది లాస్ట్‌ హీరోస్‌’’ లో మాత్రం అసామాన్యుల పోరాట పటిమను చిత్రీకరించారు. మన దేశంలో పత్రికా రచనకు మొట్ట మొదటిసారి రామన్‌ మెగసేసె అవార్డు అందుకున్నది సాయినాథే. కనీసం కొందరు స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు చెప్పడానికి సాయినాథ్‌ ప్రయత్నించారు. ఈ కథలు ప్రస్తుత తరం చదివితే అపారమైన స్ఫూర్తి పొందుతారు. కానీ అలాంటి పాఠకులను వెతికి పట్టుకోవలసిన దుస్థితిలో ఉన్నాం.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి జాతీయ పోరాటంలో ఇసుమంత పాత్ర కూడా లేదు. పైగా స్వాతంత్య్ర పోరాటానికి 800 ఏళ్ల చరిత్ర ఉందని వీరు నమ్మబలుకుతుంటారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబ్‌ సైట్‌లో ఇదే మాట చెప్పుకొచ్చారు. ఇందులో ముస్లిం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది తప్ప స్వాతంత్య్ర స్ఫూర్తి మచ్చుకైనా లేదు. 1943లో బెంగాల్‌ కరవు కన్నా ముందు ఈ దేశంలో 31సార్లు కరవు తాండవించిందని సాయినాథ్‌ అంటారు. ఈ కరవులన్నీ బ్రిటిష్‌ వలసవాదులు అనుసరించిన విధానాల ఫలితమేనంటారు. 1880 నుంచి 1920 మధ్య వచ్చిన కరవుల్లో కనీసం 165 మిలియన్ల మంది మరణించిన వాస్తవాన్ని సాయినాథ్‌ తెలియజేశారు. 800 ఏళ్ల వెనకకు స్వాతంత్య్ర పోరాటాన్ని తీసుకెళ్లడం ద్వారా బీజేపీ ప్రచారంలో పెట్టదలచుకున్నది ముస్లిం వ్యతిరేకత మాత్రమే.
అమృతోత్సవాల సందర్భంగా సిద్ధం చేసిన వెబ్‌ సైట్లో బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల ఆగడాల గురించి ఒక్క ముక్కైనా లేకపోవడం యాదృచ్చికం కాదు. బ్రిటిష్‌ వలసవాదులతో కుమ్మక్కైన చరిత్ర మాత్రమే ఉన్న బీజేపీ ఇంతకన్నా ఏం చేయగలదు కనక. అందుకే స్వాతంత్య్ర పొరాటాన్ని 800 ఏళ్లు వెనక్కు నెట్టి ముస్లిం వ్యతిరేకతను పెంపొందించే కుటిల యత్నం సాగుతోంది.
జాతీయ పోరాటంలో ఏ పాత్ర లేని వారికి అసత్య ప్రచారమే ఆలంబన. ఈ అసత్య ప్రచారం బీజేపీ చేతిలో పెద్ద ఆయుధం అయింది. దీన్ని ఎక్కడబడితే అక్కడ ప్రయోగిస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే కరోనా మహమ్మారికి మన దేశంలో 40 లక్షలమంది బలయ్యారని అంతర్జాతీయ సంస్థలు బయట పెట్టిన లెక్కలు మన దేశానికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని బీజేపీ వాదించడంలో ఆశ్చర్యం లేదు. సాయినాథ్‌ రాసిన ‘‘ది లాస్ట్‌ హీరోస్‌’’ గ్రంథంలో కనిపించే శంకరయ్య, నల్లకన్ను ఇప్పటికీ స్వేచ్ఛ కోసం పరితపిస్తూనే ఉన్నారు. శంకరయ్య, నల్లకన్ను కమ్యూనిస్టులు. శంకరయ్య గత సంవత్సరం నవంబర్‌ 15న 102 ఏళ్ల వయసులో ఊపిరి వదిలారు. నల్లకన్ను 98వ ఏడు పూర్తి చేసుకుని 99లోకి ప్రవేశించారు. వీరి ఆరాటం స్వాతంత్య్ర సముపార్జనతో పూర్తి కాలేదు. స్వేచ్చ కోసం ఆరాటమే వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
‘‘ది లాస్ట్‌ హీరోస్‌’’ చదివితే జైలుకెళ్లిన వాళ్లు మాత్రమే స్వాతంత్య్ర పోరాట యోధులు కాదని ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో రైతులు, కార్మికులు, వివిధ చేతివృత్తుల వారు ఉన్నారని అర్థం అవుతుంది. అజ్ఞాతవాసం చేస్తున్న వారికి అన్నం వండి పెట్టిన వారు సైతం స్వాతంత్య్ర పోరాట యోధులే అని చెప్పడానికే సాయినాథ్‌ ప్రయత్నించారు.
ఆయన గ్రంథం మొదటి అధ్యాయం గాంధీజీ మాటలను ఉటంకించడంతో మొదలవుతుంది. ‘‘ప్రపంచమంతటా గొప్పవారు విప్లవాలకు కారణంగా కనిపిస్తారు. నిజానికి విప్లవాలు తీసుకొచ్చేది సామాన్యులే’’ అంటారు గాంధీజీ. ఈ దృష్టితో చూస్తే దెమరి దెయ్‌ సబర్‌ ‘‘సలిహాన్‌’’ స్వాతంత్య్ర పోరాట యోధుల జాబితాలో చేరరు. సలిహాన్‌ ఆమె గ్రామం. ఆమె ఎన్నడూ జైలుకెళ్లలేదు. కనీసం భారత ప్రభుత్వం తయారు చేసిన స్వాతంత్య్ర యోధుల జాబితాలో ఆమె పేరు కనిపించదు. కానీ పదహారేళ్ల వయసులో ఆ గిరిజన బాలిక మరో నలభై మందితో కలిసి కేవలం లాఠీలతో బ్రిటిష్‌ వారిని ఎదిరించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనక పోయినా వారూ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములేనంటారు సాయినాథ్‌. సలిహా గ్రామంలో ఓ శిలా ఫలకంపై 17 మంది స్వాతంత్య్ర యోధుల పేర్లు నమోదై ఉన్నాయి. అందులో దెమరీ దే సబర్‌ పేరు లేదు.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో మిగిలే వారు మరో రెండు మూడేళ్లలో ఎవరూ మిగలక పోవచ్చు. భవిష్యత్‌ తరాల వారికి ఈ యోధులను కలుసుకోవడానికి, వారి మాటలు వినడానికి, మాట్లాడడానికి అవకాశమే ఉండదు. సాయినాథ్‌ ఈ పుస్తకం రాస్తున్న క్రమంలోనే అంటే 2021 మే తరవాత ఆరుగురు స్వాతంత్య్రయోధులు మరణించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలో కనీసం 23,000 మంది ఇలాంటి యోధుల పేర్లున్నాయి. ఇంకా వేలాదిమంది పేర్లు ఈ జాబితాలోకి ఎక్కనే లేదు. అజ్ఞాతంగా ఉండి పోరాడిన వందలు, వేలమంది పేర్లు కూడా ప్రభుత్వ లెక్కల్లో చేరలేదు. వీరిలో ఎక్కువ మంది శాంతియుత సమరంలో కాకుండా విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్న వారే. తుపాకీ ఉపయోగించడంలో శిక్షణ పొందిన వారిలో కూడా అనేక మంది ఒక్క తూటా కూడా పేల్చే అవకాశం రాని వారే. అంతమాత్రం చేత వారు పోరాట యోధులు కాకుండా పోరు. అజ్ఞాత వాసంలో ఉండి పోరాడిన చాలా మందికి స్వాతంత్య్ర యోధుల పింఛన్‌ కూడా రాలేదు. విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్న వారు అనేకులు అజ్ఞాతంగానే ఉండిపోయారు. పింఛన్ల విషయంలో కూడా వీరు అజ్ఞాతంగా ఉండిపోయిన వారే.
1947 తరవాత జన్మించినవారు, ఇంకా చాలాకాలం తరవాత పుట్టిన వారికి ఈ గాథలు తెలియజేయడానికే సాయినాథ్‌ ఈ గ్రంథం రాశారు. ఇలాంటి వృత్తాంతాలు తెలుసుకుంటే మన భవిష్యత్తును సవ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ గ్రంథం రాయడానికి సాయినాథ్‌కు కనీసం రెండు దశాబ్దాలు పట్టింది. ఒక్కొక్కరిని అనేకసార్లు కలుసుకోవలసి వచ్చింది.
ఈ గాథల్లో కొన్ని ఇంత విస్తారంగా కాకపోయినా సంక్షిప్తంగా ‘‘ది హిందూ’’లో ప్రచురితమైనాయి. పీపుల్స్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (పి.ఎ.ఆర్‌.ఐ.) లోనూ వెలువడ్డాయి. ప్రతి కథనం కింద ఒక క్యు.ఆర్‌. కోడ్‌ ఇచ్చారు. దాన్ని స్కాన్‌చేసి చూస్తే సవివరమైన కథనాలు, వీడియోలు కనిపిస్తాయి.
ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img