Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వ్యక్తి ఆరాధనాతత్వం వెనక దాగిన అసంతృప్తి

ప్రణబ్‌ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా తన కుటుంబంతో కలిసి రాష్ట్రపతి భవన్‌ లో ప్రవేశించిన మొదటి రోజు అది. భోజనాల బల్లపై అనేక రకాల వంటకాలతో పాటు పశ్చిమ సంస్కృతికి ప్రతీకలైన ప్లేట్లు, చెంచాలు, ఫోర్కులు, కత్తులు కూడా ఉన్నాయి అక్కడ. ప్రణబ్‌ ముఖర్జీ తోబుట్టువులు, కూతురు వాటినన్నింటినీ వింతగా చూస్తూ ఉంటే ప్రణబ్‌ వారి అవస్థ గమనించి ‘‘చేత్తో తినండి’’ అన్నారు. ‘‘ప్రణబ్‌, మై ఫాదర్‌’’ గ్రంథంలో ఆయన కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ ఇలాంటి చిన్న చిన్న వివరాలు సైతం చెప్పారు.
ప్రణబ్‌ ముఖర్జీది 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇందులో ఆయన లోకసభకు ఎన్నికైంది రెండు సార్లు మాత్రమే. మిగత సమయం అంతా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ప్రధానమంత్రి కావాలన్న ఆయన కోరిక తీరలేదు కానీ దేశంలోకెల్లా అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి ఆయనకు దక్కింది. విభిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించే అవకాశం ఆయనకు వచ్చింది. ప్రణబ్‌కు రోజూ డైరీ రాసే అలవాటు ఉండేది. అయితే ఆ డైరీలలో ఉన్న అంశాలను తన జీవిత కాలంలో వెల్లడిరచకూడదని ఆయన అనే వారు. ఈ గ్రంథ రచయిత షర్మిష్ఠ ముఖర్జీ కూడా ప్రణబ్‌ మరణానంతరమే ఆ డైరీలు తెరిచి చూడగలిగారు. ఆమె గ్రంథ రచనకు ముడి సరుకు ప్రధానంగా ఈ డైరీలే.
ఇందిరా గాంధీ కుటుంబానికి ఆయన చాలా విశ్వాసపాత్రుడంటారు. కానీ రాజీవ్‌, సోనియా గాంధీ తనతో వ్యవహరించిన తీరు ఆయనకు కష్టం కలిగించిన సందర్భాలూ ఉన్నాయి. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి ఎవరవుతారు అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్‌ నాయకుడు ఘనీ ఖాన్‌ చౌదరి మంత్రివర్గంలో అత్యంత సీనియర్లయిన పీవీ నరసింహారావు, ప్రణబ్‌ ముఖర్జీ-వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కాలని సూచించారు. అప్పుడు పీవీకి ఆ అవకాశం దక్కింది. పీవీ మరణించిన తరవాత ఆయన మృత దేహాన్ని కాంగ్రెస్‌ కార్యాలయంలోకి తీసుకురావడాన్ని సోనియా అడ్డుకోవడం ప్రణబ్‌కు ఏ మాత్రం నచ్చలేదు.
ప్రణబ్‌ తన ఆత్మ కథ రాసుకున్నారు. మూడు సంపుటాలుగా వెలువడిన ఆ ఆత్మకథలో రాజకీయ వివరాలు చాలా ఉన్నాయి కానీ అందులో సంచలనాలు ఏమీ లేవు. ప్రణబ్‌ జీవిత కాలంలో వెల్లడిరచ డానికి నిరాకరించిన కొన్ని అంశాల వివరాలు షర్మిష్ఠ విప్పి చెప్పారు.
ప్రణబ్‌ రాజకీయ జీవితానికి నిచ్చెన వేసింది ఇందిరాగాంధీనే. కానీ ఆమె మీద కూడా ప్రణబ్‌కు ఫిర్యాదులున్నాయి. ఆమె ‘‘మట్టీకాళ్ల మనిషి’’ అనే వారు ప్రణబ్‌. ఇందిరా గాంధీ కుటుంబానికి ప్రణబ్‌ విశ్వాసపాత్రుడే కానీ ఆ కుటుంబానికి మాత్రమే కాంగ్రెస్‌కు నాయకత్వం వహించగలిగిన సత్తా ఉందన్న ప్రణబ్‌ అభిప్రాయంతో షర్మిష్ఠ ఏకీభవించరు. ప్రణబ్‌ లో ఉన్న వ్యక్తి ఆరాధనాతత్వం ఆమెకు నచ్చలేదు.
అయిదు దశాబ్దాల ప్రణబ్‌ రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే ముడివడి ఉంది. కానీ ఆయనకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. సిద్ధాంతం మీద అభిమానం ఉన్నట్టుంది. రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తరవాత ఈ అంశాన్ని ఆచరణలో ప్రణబ్‌ వ్యక్తం చేశారు. ఓ దసరా రోజు ఆర్‌.ఎస్‌.ఎస్‌. వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోదీ మీద ఆయనకు అపారమైన గౌరవ భావం ఉండేది. ఇలాంటి వివరాలు చాలా మంది రాజకీయ నాయకుల సిద్ధాంత బలిమి ఎంత బలహీనమైందో మరో సారి రుజువు చేస్తాయి.
ప్రణబ్‌ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న రోజులూ ఉన్నాయి. కొంత కాలం ఆయన బంగ్లా కాంగ్రెస్‌లో, మరి కొంత కాలం రాష్ట్రీయ సమాజ్‌ వాది కాంగ్రెస్‌లో ఉన్నారు. సోనియా గాంధీతో ప్రణబ్‌కు అంత మంచి సంబంధాలేమీ ఉండేవి కాదు. 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడాన్ని ప్రణబ్‌ కొనియాడారు. ప్రణబ్‌ సజీవంగా ఉన్నప్పుడు వ్యక్తం కాని ఆయన వ్యక్తిత్వ పార్శ్వాలను షర్మిష్ఠ ఈ గ్రంథంలో ఆవిష్కరించారు. అధికారం అంతిమంగా ఎవరికి దక్కుతుంది అన్నది భిన్నమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం, అనుభవం, నైపుణ్యం అపారంగా ఉన్న ప్రణబ్‌ లాంటి వారికి రాజీవ్‌ గాంధీ లాంటివారి కింద పని చేయడంలో కొన్ని ఇబ్బందులు సహజంగానే ఉంటాయి. అవి ప్రణబ్‌కు తప్పలేదు కాని ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ప్రణబ్‌కు ఉండేది. 2002లో ప్రణబ్‌ ఉప రాష్ట్రపతి పదవికి తన పేరు ప్రతిపాదించాలనుకున్నారు. వామపక్షాలతో పాటు సోనియా గాంధీ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించలేదు. ‘‘నా అభ్యర్థిత్వానికి కమ్యూనిస్టులు అడ్డు తగిలారు. ఇది నాకేం బాగో లేదు. తనను ఓ దశలో అమాంతం కమ్యూనిస్టులు వదిలేసినప్పుడు సోనియాకు వారి అసలు స్వరూపం అర్థం కాదు’’ అని డైరీల్లో రాసుకుని ప్రణబ్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను బయట పెట్టుకున్నారు. సోనియా ‘‘దర్శకత్వం’’లో యూపీఏ పాలన కొనసాగు తున్నప్పుడు కనీసం డజను సార్లయినా ప్రణబ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారని షర్మిష్ఠ అంటారు. రాహుల్‌ గాంధీ రాజకీయ సామర్థ్యంపై ఆయనకు నమ్మకం కుదరలేదు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నేరపూరిత కార్యకలాపాల మచ్చ పడ్డ రాజకీయ నాయకుల మీద చర్య తీసుకోకుండా ఉండే ఆర్డినెన్సు జారీ చేయాలనుకున్నప్పుడు రాహుల్‌ గాంధీ ఆ ఆర్డినెన్సు ముసాయిదాను చించేయడాన్ని ప్రణబ్‌ ప్రస్తావించారు. ఇది గాంధీ-నెహ్రూ కుటుంబంలో గూడుకట్టుకున్న అహంకారానికి తార్కాణం అంటారు ఆయన. అయితే గాంధీ-నెహ్రూ కుటుంబంలో మునుపటి వారికి ఉన్న రాజకీయ కుశలత రాహుల్‌కు లేదని ఆయన నిందించారు. ప్రభుత్వ చర్యను బహిరంగంగా తిరస్కరించి పార్టీ ఉపాధ్యక్షుడే ఇలా వ్యవహరిస్తే ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలని కూడా ప్రణబ్‌ ప్రశ్నించారు.
రాహుల్‌లో ఉన్న లోపం ఆధారంగా గాంధీ-నెహ్రూ కుటుంబంలోని వారందరినీ అహంకారపూరితుల కింద జమకట్టడంలో ప్రణబ్‌ అనౌచిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకటీ అరా సంఘటనల ఆధారంగా మొత్తం కుటుంబాలను అంచనా వేయడం సాహసమే. జీవితాంతం కాంగ్రెస్‌ తో ఉన్నా ఆర్‌.ఎస్‌.ఎస్‌.మీద అభిమానం పెంచుకోవడం, నరేంద్ర మోదీ అంటే గౌరవం అనడం ప్రణబ్‌ అవగానా రాహిత్యం కింద కొట్టి పారేయలేం. అంతరాంతరాల్లో ప్రణబ్‌ కు ఆర్‌.ఎస్‌.ఎస్‌. మీద ఉన్న అభిమానాన్ని గమనంలోకి తీసుకుంటే తప్ప ఆయన సైద్ధాంతిక లోపాలు అర్థం కావు. ప్రణబ్‌ లాంటి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనుకూలురు కాంగ్రెస్‌ లో మొదటి నుంచీ ఉన్నారు. పురుషోత్తం దాస్‌ టాండన్‌ ఇలాంటి వారికి గురువు.
2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు వదిలేసినా ప్రణబ్‌ మరణించే దాకా మూడేళ్ల పాటు రాజకీయంగా చురుకుగానే ఉన్నారు.
ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img