Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

తారలా ఎగసి, ఉల్కలా రాలిన శారద !

మందలపర్తి కిషోర్‌

‘‘మా తెనాలివాళ్ళం, ఇతర ఊళ్ళ మాదిరిగా ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్త’’మని సగర్వంగా చెప్పుకున్నారు కొడవటిగంటి కుటుంబరావుగారు. ఆయన కన్నా దశాబ్దంనర చిన్నవాడయిన ‘శారద’ (ఎస్‌.నటరాజన్‌) విషయంలో ఈ నియమాన్ని పాటించలేదు తెనాలి. ‘‘మనుషుల్ని తయారు చేసి లోకం మీదికి వదలటం మాత్రమే మా వం’’తని కూడా కొ.కు. అన్నారు కానీ, శారద దానికి కూడా ఓ మినహాయింపుగా నిలిచాడు. (ఈ సూత్రీకరణకు సైతం ఓ మినహాయింపుందిశారదను మనిషిగా కాకపోయినా, రచయితగా ‘తయారు చేసి’న ఘనత తెనాలికే దక్కుతుందేమో!) తెనాలి వదిలిపెట్టి కొన్ని లక్షల మంది మద్రాసు మహానగరానికి వలసపోయి, కుటుంబరావుగారిలా, అక్కడే పాతుకుపోయారు. కానీ, మద్రాసు నుంచి తెనాలి వచ్చినవాళ్ళు తక్కువ. వాళ్ళలో తెనాలీయుల హృదయాలను టోకున దోచుకున్నవాళ్ళు మరీ తక్కువ. అంత పనీచేసి, అకస్మాత్తుగా ఉల్కలా రాలిపోయినవాడు బహుశా శారద ఒక్కడేనేమో అనిపిస్తుంది. తమిళుడిగా పుట్టి తెలుగు కథకుడిగా రాణించిన మరో రచయిత రిషిమంగళం (ఆర్‌.ఎమ్‌.) చిదంబరం, శారద కన్నా దాదాపు దశాబ్ద కాలం చిన్నవారు! రచయితల్లో కొందరి జీవితాలు వాళ్ళ రచనల్ని మించిపోయే ప్రమాణంలో నాటకీయంగా మొదలవుతాయిÑ అనూహ్యమయిన మలుపులతో కొనసాగుతాయిÑ ఊహాతీతమయిన రీతిలో అంతమూ అవుతాయి! నీజ్చ, మొపాసా, గగోల్‌, చేహఫ్‌, గోర్కియ్‌, శరత్‌ బాబు ఇలా అంతర్జాతీయ ప్రమాణాలను అధిగమించిన మహారచయితల జీవితకథలన్నీ వాళ్ళ రచనల్ని మించిన నాటకీయతతో నిండివుంటాయి! ఈ విషయంలో, ‘శారద’, చిదంబరం వాళ్ళ సరసనే నిలుస్తారు! ముప్పై రెండేళ్ళ జీవితంలో, శారద రచయితగా జీవించింది ఏడెనిమిదేళ్ళే.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒడియా భాషలు మాట్లాడే ప్రజల సంకీర్ణరాష్ట్రంగా వుంటూవచ్చిన మద్రాసు ప్రెసిడెన్సీలో ఒకప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం భాగంగా ఉండేది. 1930 దశకం నాటికి, మద్రాసు మహానగరంలోని అరవలు ‘‘స్ట్రీట్ల తెలుంగువీట్ల తమిజ్ష్‌’’ (వీధిలో తెలుగుఇంట్లో తమిళం) మాట్లాడేవారట! అంచేత, మద్రాసీయుల్లో అత్యధికులకు ఈ రెండు భాషలూ సుపరిచితమయివుండేవి. ఇతర భాషల మధ్యన కూడా సాంస్కృతిక ఆదాన ప్రదానాలు బాగానే ఉండేవి. చరిత్ర ప్రసిద్ధుడయిన తిరువాన్కూరు మహారాజా స్వాతి తిరునాళ్‌ ఏకంగా తెలుగులోనే కీర్తనలు రాసివుండగా, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ‘‘సుందర తెలుంగు’’ (అందమయిన తెలుగు భాష) అంటూ ప్రశంసించివున్నారు. ముఖ్యంగా, సంకీర్ణ మద్రాసు రాష్ట్ర రాజకీయ చరిత్రలో 1937 సంవత్సరానికి ఓ ప్రత్యేకత వుంది. ఆ ఏడాది మొదట్లో జరిగిన ‘ప్రొవిన్షియల్‌’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు నాల్గింట మూడు వంతుల ఆధిక్యం సాధించింది. అప్పటికి దశాబ్దంనర కాలంగా మద్రాసు రాష్ట్రంపై ఏలుబడి సాగిస్తున్న జస్టిస్‌ పార్టీ పెత్తనం దాంతో తుడిచిపెట్టుకుపోయింది. అదే సంవత్సరం చివరికల్లా, శ్రీబాగ్‌ ఒప్పందం కుదరనే కుదిరింది. ఆంధ్రుల అస్తిత్వం నిర్దిష్ట రూపం తీసుకునే క్రమం సాగే క్రమంలో మైలురాయిలాంటిది ఈ ఒప్పందం. ఇది కుదిరిన సంవత్సరమే, సబ్రహ్మణ్యయ్యర్‌ నటరాజన్‌ అనే పదమూడేళ్ళ తమిళ బాలుడు తెనాలి గడ్డమీద అడుగుపెట్టాడు.
అతగాడో నిరుపేద. మైలాపూరు అగ్రహారంలో మధుకరం ఎత్తుకుని, కడుపు మాడ్చుకుని బతుకీడ్చలేక, తండ్రితో కలిసి తెనాలి వచ్చినవాడు. అక్కడికి వచ్చేనాటికి, తెలుగు మాట్లాడడం ఏమన్నా తెలుసేమో కానీ చదవడంరాయడం బత్తిగా తెలియనివాడు. అయితే, అప్పటికింకా నటరాజన్‌ గానే వుండిన ‘శారద’ రచనంటే ఏమిటో తెలియనివాడు మాత్రం కాడు! అతని తండ్రి సుబ్రహ్మణ్యయ్యరు తమిళ దినపత్రిక ‘దినమణి’ అనుబంధాల్లో ఒకటయిన ‘దినమణి కదిర్‌’(సూర్య కిరణం)లో ఉపసంపాదకుడిగా పనిచేశాడట. ఈ నేపథ్యం నటరాజన్‌ను, ‘శారద’గా మార్చే క్రమంలో కచ్చితంగా ఓ పాత్రపోషించేవుంటుంది! ఇక, కుటుంబరావే చెప్పినట్లుగా, తమిళ తంబులకే కాఫీ ఎలా కలపాలో నేర్పగలిగేంత నేర్పున్న తెనాలి అయ్యరుగా మారడం చేతనేమో, హోటల్‌ పరిశ్రమలో డబ్బు గడిరచకపోయినా, మనుగడ సాగించగలిగాడు. హోటల్లో పనికి కుదిరి, సాపాటు సమస్య తీర్చుకున్న మరుక్షణంనుంచీ, తెలుగు సాహిత్యం మీదకి మళ్ళింది నటరాజన్‌ గాలి. వేమన పద్యాలతో మొదలుపెట్టి, పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం వరకూ కంఠస్థం చేశాడట. కుటుంబరావు, గోపీచంద్‌, బల్లిముంత తదితర అభ్యుదయ రచయితల రచనల్ని ఆపోశనపట్టాడట. అలా పుట్టుకొచ్చిన రచయిత ‘శారద’, స్కెచ్‌లతో మొదలుపెట్టి, నాటికలూ, కథానికల మీదుగా ‘ఏది సత్యం?’, ‘మంచీచెడు’, ‘అపస్వరాలు’, ‘చీకటి తెరలు’, ‘మహీపతి’ అనే అయిదు నవలలు కూడా రాశాడుÑ వాటిల్లో చివరి రెండూ అముద్రితంగానే ‘ముక్కిపోతున్న’ విషయంలో పర్‌స్పెక్టివ్స్‌ ఆర్కే వ్యక్తం చేసిన ఆవేదన మన పరిశోధకులూ ప్రచురణకర్తల సంస్కారం తాలూకు సిసలయిన ప్రమాణాలను పట్టిస్తోంది. కథారచయితగా శారదకు పేరు తెచ్చిపెట్టిన కథానిక ‘రక్తస్పర్శ’. కుటుంబ సంబంధాలన్నీ సారంలో ప్రగాఢమయిన మానవసంబంధాలేనని ఈ కథానికలో రుజువు చేశాడు శారద. ఆ మాటకొస్తే, సకల సామాజిక సంబంధాలూ సారంలో మానవ సంబంధాలే! అటు సెంటిమెంటా లిటీకి గానీ, ఇటు చేదు వాస్తవికతకు కానీ పీట వెయ్యని రచయిత శారద. మంచినీళ్ళలాంటి వాస్తవజీవితానికి, నిజానికి, ఏ రంగూ రుచీ వుండదు! శారద కథల్లో కనిపించే జీవితవాస్తవం కూడా అలాగే వుంటుంది. దాన్ని ఏ శిల్ప రహస్యంగానో పొరబడేవాళ్ళు ఓ సత్యం తెలుసుకోవాలి రూపానికీ సారానికీ అలీనంగా వుండే శిల్పం సజీవంగా వుండజాలదు. శారద రచనల్లో దేన్ని చూసినా ఈ విషయం ఇట్టే బోధపడుతుంది! ప్రచురితమయిన శారద నవలలు మూడిరటి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఒకటుంది. అవన్నీ, దిగువ మధ్యతరగతి, పేదవర్గాల ప్రజల కథనే చిత్రించాయి. శారద మరణించే నాటికి 1955నాటికి తెలుగు రచయితల్లో అత్యధికుల్లో ఆదర్శవాదం ప్రబలమయిన ధోరణిగా వుంది. ఈ జాతి స్వాతంత్య్రం మీద మధ్యతరగతి పెట్టుకున్న ఆశలకు అది సాహిత్య ప్రతిఫలనం మాత్రమే! మరోవైపు, పేదవర్గాలకు చెందిన రచయితల్లో స్వాతంత్య్రం పట్ల కనిపించే ఆశాభంగం కూడా నాటి రచనల్లో వ్యక్తమయిన మరో ప్రధానమయిన లక్షణం. అలాగే, అమాయకమయిన సోదరభావం ఒకటి మధ్యతరగతినుంచి వచ్చిన రచయితలను ఆవహించుకునివుండేది. ఇది కవుల్లో మరింత పెచ్చుగా వుండడం కద్దు. కథానిక, క్రమంగా ఈ అమాయకత్వం నుంచి బయటపడ్డం మొదలుపెట్టి చాలావరకూ జయప్రదం కాగలిగింది కూడా. నవలా సాహిత్యంలో ఈ ధోరణి ఆశావహమయిన స్థితికి వెళ్ళినట్లే వెళ్ళి కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి తదితర భుజబలం కలిగిన రచయితత్రుల పుణ్యమాని అక్షరాలా ‘‘కాల్పనిక’’ సాహిత్యరూపంగా మారి, స్థిరపడిరది. (ప్రతి సూత్రానికీ మినహాయింపులున్నట్లే ఈ సామాన్య సూత్రానికీ వున్నాయని గమనించ ప్రార్థన!) శారద లాంటి రచయితలు రాసిన ‘‘ఏదిసత్యం?’’, ‘‘మంచీచెడూ’’, ‘‘అపస్వరాలు’’ లాంటి నవలల్లో కాల్పనికత వుండదనికాదు అది వాస్తవ జీవనాన్ని ఆశ్రయించుకుని అల్లుకునివుంటుంది. శారద సృష్టించిన పాత్రలు బెజవాడ, బందరు, గుంటూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రి లాంటి మధ్య కోస్తా పట్టణాల్లో అడుగడుక్కీ కనిపించే మనుషుల్లాగానే వుండడం కాకతాళీయం కాదురచయిత, ఆ పాత్రలు అలా వుండాలనే వాటినలా తీర్చిదిద్దాడు! పార్వతి, సాంబశివరావు (ఏదిసత్యం?), పద్మ, భాస్కరం (మంచీచెడూ), వరదరాజు, రంగయ్య, సదానందం, బ్రహ్మానందం (‘అపస్వరాలు’) ఇలా ఏ పాత్రను తీసుకున్నా ‘కేవలం కల్పితం’గా కనిపించదు. ఇందులో వుంది శారద వాస్తవికత తాలూకు మూలం! అతను ‘పాత్రల’ కథలు రాసే రచయిత కాదు‘మనుషుల’ కథలను చెప్పే రచయిత. ‘‘జీవితమెలా వుండబోతోందో సాహిత్యం ముందే వూహిస్తుందిÑ అంతే తప్ప దాన్ని, సాహిత్యం అనుకరించదు సాహిత్యం జీవితాన్ని రచనగా మల్చుకుంటుం’’దన్నాడు ఆస్కర్‌ వైల్డ్‌. అందుకే, దాన్ని కేవల శిల్పరహస్యంగా పరిగణించడానికి వీల్లేదనేది.
మనదేశంలో, ఆ మాటకొస్తే ఏదేశంలోనయినా, శ్రమజీవులు రచయితలుగా మారడం నిన్ననో మొన్ననో మొదలయిందేం కాదు! అసలు సాహిత్యం పుట్టిందే శ్రమజీవుల జీవనం నుంచే!! జార్జ్‌ థాంప్సన్‌, మక్సీమ్‌ గోర్కియ్‌, ఇవాన్‌ వజోర్‌, లూయీ ఆరగాు, బెర్తోల్‌ బ్రెష్ట్‌, వ్లదిమీర్‌ మయాకఫ్‌స్కియ్‌, గార్సియా లోర్కా, నాజిమ్‌ హిక్మెత్‌, పాబ్లో నెరూదా తదితరులు విభిన్న సందర్భాల్లో ఈ మాట చెప్పినవాళ్ళే. శారద అనే ఎస్‌.నటరాజన్‌ ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ శ్రామిక రచయితల్లో ముఖ్యుడంటే కాదనేవాళ్ళు వుంటారనుకోను. అలాంటి శారద కన్నుమూసేనాటికి, మన దేశంలోని పెద్దపెద్ద పారిశ్రామిక కేంద్రాల్లో ఆధునిక కార్మికవర్గం రూపుదిద్దుకుని రెండు మూడు దశాబ్దాలు అయిన మాట నిజమే కానీ, స్పష్టమయిన`స్ఫుటమయిన కార్మికవర్గ చైతన్యం రూపుదిద్దుకోలేదు. సాహిత్యరంగంలో ఈ విషయం మరింత కొట్టచ్చినట్లు కనబడుతూనే వుంది. అయితే, శ్రామిక వర్గ పక్షపాతం అనే అభ్యుదయ సాహిత్య దృక్పథం శారదలాంటి వాళ్ళరచనల్లో ప్రస్ఫుటంగానే కనబడుతుంది. ధనమే పరదైవంగా భావించే నైతికతను అసహ్యించుకుంటూ శారద రాసిన ‘అపస్వరాలు’ నవలలో ఇదే దృక్పథం కనిపిస్తుంది. శారద సాహిత్యానికంతటికీ వర్తించే సామాన్య లక్షణం ఇదేనేమో!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img