Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

అరెస్టులు కాదు.. నిందితులకు పుష్పగుచ్ఛాలు

లఖింపూర్‌ ఖేరి ఘటనపై అఖిలేశ్‌ యాదవ్‌
లక్నో : లఖింపూర్‌ ఖేరి ఘటనలో దర్యాప్తునకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తీరును సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం విమర్శించారు. ఇందులో నిందితులను అరెస్టు చేయడానికి బదులుగా వారికి ‘పుష్పగుచ్ఛాలు’ అందిస్తున్నట్లు ఆరోపించారు. లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ముందు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా హాజరైన కొద్దిసేపటికే ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అశిష్‌ మిశ్రా శుక్రవారం పోలీసులు ముందు హాజరుకాకపోవడంతో శనివారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆయనకు మరోసారి నోటీసు జారీ చేశారు. అఖిలేశ్‌ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘రైతులను అణచివేసిన విధానం, ఇప్పుడు చట్టాలను అణచివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై వాహనం ఎలా దూసుకెళ్లిందో మీరు చూశారు. దోషులు ఇంకా పట్టుబడాల్సి ఉంది. సమన్లు ఇచ్చే బదులు, పూల గుత్తి ఇస్తున్నారు. సమన్లు పేరుకు మాత్రమే, వాస్తవానికి ‘సమ్మాన్‌’(గౌరవం) ఇస్తున్నారు’ అని తెలిపారు. అటువంటి సంఘటన జరగవచ్చని స్థానిక నిఘా విభాగం, పాలనా యంత్రాంగంతో సహా అధికారులకు సమాచారం ఉండి ఉండాలని ఈ యూపీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ, రైతులు మరణించారని చెప్పారు. యూపీ ప్రభుత్వం దోషులను కాపాడుతోందని ఆరోపిస్తూ, కేంద్ర మంత్రి పదవికి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్‌ చేశారు. ‘తమది ‘దమ్దార్‌ సర్కార్‌’ అని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం కేవలం శక్తిమంతులకేనా..? రైతుల కోసం కాదా..?. రాబోయే కాలంలో బీజేపీ తుడుచుపెట్టుకుపోతుంది’ అని అఖిలేశ్‌ హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులు న్యాయాన్ని, నిందితులకు శిక్షను కోరుతున్నారని అన్నారు. ‘జీపు టైర్ల కింద దేశంలోని చట్టాలు నలిగిపోతున్నాయి’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img