Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చట్టానికి అందరూ సమానమే..

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్ద అఫ్గాన్‌ శరణార్థుల ఆందోళనపై దిల్లీ హైకోర్టు సీరియస్‌
నేటిలోగా సమస్య పరిష్కారానికి ఆదేశం
కోవిడ్‌ నిబంధనల అతిక్రమణపై దిల్లీ పోలీసులకు మొట్టికాయలు
న్యూదిల్లీ :
దిల్లీ వసంత్‌ విహార్‌లోని ఐరాస శరణార్థుల ఉన్నత కమిషన్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) కార్యాలయం వద్ద అఫ్గాన్‌కు చెందిన వందలాది మంది శరణార్థులు ధర్నా చేపట్టారు. దాదాపు 500 మంది వరకు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ పరిణామాన్ని దిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిణమించింది. కోవిడ్‌ నిబంధనలను పక్కకుపెట్టడాన్ని ప్రశ్నించింది. మహమ్మారి వేళ 500 మందికిపైగా ఆందోళన చేయడం ఏమిటి? ఇంత మందికి అనుమతి ఎలా ఇచ్చారు? అంటూ సంబంధిత అధికారులను ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. ఆందోళనకారుల సంఖ్య తగ్గాలని, కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారమే ఆందోళన జరగాలని ఆదేశించింది. ఆగస్టు 15 నుంచి వీధులు, పార్కుల్లో అఫ్గాన్లు ఉంటున్నారని, ఈ పరిస్థితి స్థానికులను ఇబ్బంది పెడుతోందని వసంత్‌ విహార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తన పిటిషన్‌లో న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. దక్షిణ దిల్లీ బీ బ్లాక్‌లోని యూఎన్‌హెచ్‌సీఆర్‌ కార్యాలయం వద్ద అఫ్గాన్‌లు గుమ్మిగూడి ఉన్నట్లు పేర్కొంది. అఫ్గాన్‌లో రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఇది సాధారణ పరిస్థితి కాదని కేంద్రం తరపు న్యాయవాదులు వాదించగా అడ్డగించిన కోర్టు.. అకారణంగా ఎవరితోనూ మొరటుగా లేదా కఠినంగా వ్యవహరించరాదని పేర్కొంది. అదే సమయంలో చట్టం అందరికీ సమానమే అంటూ స్పష్టంచేసింది. ‘ఆందోళన చేయకుండా వారిని ఎవ్వరూ ఆపడంలేదుగానీ ఇది ఆందోళన స్థలి కాదు. కోవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. వంద మందికి మించి ఒక్కచోట గుమ్మిగూడరాదు. వంద మందికి మించి నిరసనల్లో పాల్గొనరాదన్న ఆదేశాలు జారీచేయాల్సి వస్తుంది. 500 మంది ఎలా పాల్గొంటారు? శరణార్థులు అయితే మాత్రం 500 మంది ఒక్క చోట ఎలా ఉంటారు? పెళ్లిళ్లకే వంద మందిని అనుమతిస్తుంటే ఇక్కడ 500 మందికిపైగా ఆందోళనకారులు ఉండటం ఏమిటి ’ అంటూ జస్టిస్‌ రేఖా పల్లి అసహనం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో దిల్లీ పోలీసుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దిల్లీ విపత్తు నియంత్రణ యంత్రాంగం (డీడీఎంఏ) మార్గదర్శకాలు, అన్ని సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/సాంస్కృతిక/మతపరమైన కార్యక్రమాలు, వేడుకలను మహమ్మారి కాలంలో నిషేధించినట్లు కోర్టుకు తెలిపారు. కేంద్రం తరపున స్టాండిరగ్‌ కౌన్సెల్‌ అజయ్‌ దిగ్‌పాల్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిని మనవీయ కోణంలో చూడాలని, సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. ఇదిలావుంటే, ఏళ్ల తరబడి భారత్‌లో ఉన్నప్పటికీ తమకు సుస్థిర జీవనం సాధ్యం కావడం లేదంటూ అఫ్గాన్‌ శరణార్థులు యూఎన్‌హెచ్‌సీఆర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు వర్క్‌ పర్మిట్లు జారీ చేయాలన్నారు. బతికేందుకు మార్గం సుగమం చేస్తూ శరణార్థుల హోదా నుంచి విముక్తి కల్పించాలని యూఎన్‌హెచ్‌సీఆర్‌కు విన్నవించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img